గులకరాళ్ళు

చెరువులోని చేపలన్నీ పట్టి
ఆకాశం వైపుకు వల విసిరినట్టు
పక్షుల గుంపులు.
నా గుండె ఎక్కడ చిక్కుకుందో-
వెనక్కిలాగే లోపే వల పైపైకిపోయింది
*
ఒకే చెట్టుకు పూసిన పూలు
ఒకదానికి తెలీకుండా ఒకటి
ఒంగి ఒంగి కొలనులోకి చూసుకుంటున్నాయి
రాకుమారుడెటు నుండి వస్తాడో
రహస్యం చెప్పడం కోసం
నీళ్ళన్నీ ఒడ్డును వెదుక్కుంటూ వచ్చాయి
*
నల్లటి బాతులు రెండు,
నా కళ్ళను తోడు పిలుచుకుని
జంటగా ఈదుకుంటూ పోతున్నాయి
నీడ ఒక్కటే, నీటి మీద వదిలిన
దారి ఒక్కటే.
ఒక్కటే ఎందుకు మునిగిందో మరి,
కాసేపు ఊపిరాడలేదు
*
పక్షులు రొదపెడుతున్నాయి
పేరు తెలియని పూల పరిమళం
గుబురు చెట్ల వెనుక నుండి మత్తుగా పాకుతోంది
నిద్రకు ముందు నగలన్నీ తీసేసిన యువతిలా
సాయంకాలపు తళుకులు తుడుచుకున్న కొలను
నల్లగా మెరుస్తోంది
చందమామ తోసుకుంటూ ఎందుకొస్తాడో
లోకం ఒక ముద్దు కూడా దొంగిలించకుండానే
చీకటి కౌగిట్లో!
*తొలిప్రచురణ - ఈమాట ఫిబ్రవరి,2017 సంచికలో

4 comments:

 1. మానస గారూ, కవి మా తమ్ముడు విన్నకోట రవిశంకర్ కవితల గురించి మీకు తెలుసు కదా. ఈ నెలలో మా మరో తమ్ముడి కూతురి పెళ్లికి ఇండియా వచ్చి వెళ్లాడు. అప్పుడు 10TV చానెల్ వారి "అక్షరం" కార్యక్రమంలో అతని గురించి పరిచయం చేసారు. అది ఈ నెల 19న 10TV లో ప్రసారమైంది (19-03-2017 మధ్యాహ్నం 12.30 కు). దాని తాలూకు విడియో లింక్ ఇస్తున్నాను. అతని కవితలు మీరు చదువుతుంటానన్నారు కాబట్టి మీకు ఆసక్తి ఉంటే విడియో చూడండి.

  10TV "అక్షరం" లో విన్నకోట రవిశంకర్ (19-03-2017)

  ReplyDelete
 2. ఇప్పుడే విన్నానండీ, గుర్తుంచుకుని నాకు వార్త అందించి వినేలా చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. వారి గొంతు ఇప్పుడే వినడం.

  "కవిత్వంలో నేను" చదువుతున్నానండీ, చాలా ఆసక్తికరంగా ఉంది.

  ReplyDelete
 3. విన్నకోట రవిశంకర్ కు సంబంధించినదే మరోటి. ఫిబ్రవరి 2014 "వాకిలి" వెబ్ పత్రికలో రవిశంకర్ తో ముఖాముఖీ వచ్చింది. అప్పుడు ఎందువలనో నేనూ మిస్సయ్యాను. దాని లింక్ ఈ క్రింద ఇస్తున్నాను. ఆసక్తి ఉంటే చూడండి. అతనూ, మీరూ ఇద్దరూ ఇస్మాయిల్ అవార్డ్ గ్రహీతలే.

  విన్నకోట రవిశంకర్ తో ముఖాముఖం (ఫిబ్రవరి 2014 "వాకిలి")

  ReplyDelete

పరవశ

  My Dear Friends, Happy Ugadi to you all! I'm super happy and excited to share that Analpa Book House published my first poetry book &q...