ఒక నిన్న

బయట ఇంకా పూర్తిగా చెదరని చీకటి. ఇంకా భంగమవని నిశ్శబ్దం. ఇంకా కురవని నల్లమబ్బు తునక. నన్ను పిలిచీ పిలిచీ అలసినట్టు, కూత ఆపేసిన బుల్లిపిట్టల అలికిడి. నిలువెల్లా ఊగుతోన్న నిటారు చెట్టు. రెండుకాళ్ళ మీద నిలబడి పచ్చిక కొసరుకుంటోన్న ఉడుతలు. చెంగున దూకి కనుమరుగవుతోన్న కుందేలు పిల్లలు. పొద్దున లేవగానే ఇక్కడికే వచ్చి నిలబడతాను. రాత్రి అలసటతో వదిలేసిన ఇల్లు గమనించుకోకుండా నేరుగా తలుపులు తీసి వీటినే చూస్తుండిపోతాను. అటుపైన లోపలికెళితే హాల్ నిండా బొమ్మలు, రంగు కాగితాలు. వంటింట్లో శుభ్రపడని గిన్నెలు. టేబుల్ మీద ఇంకా విప్పని బహుమతులు. గదిలో, సున్నాలా తెరచుకున్న నోటితో నాన్న మీదకో కాలు విసిరి పడుకున్న పిల్లాడు. ఊరికే నన్నొక ఉత్సాహం కెరటంలా తాకిపోతుంది. నిన్న ఇక్కడ ఈ ఇంట్లో సంతోషంగా మసలుకున్నామనడానికి గుర్తుగా ఇవన్నీ పడి ఉన్నాయనిపిస్తుంది. ఆనందంతో అలసిపోయి అలాగే నిద్రలోకి జారుకున్నామని గుర్తుచేస్తూ నిన్నటి సందళ్ళు తునకలై నా కళ్ళ ముందు ఆడుతున్నట్టుంటుంది. ఆఖరు నక్షత్రం కూడా ఆకాశంపు లోతుల్లోకి జారిపోయేదాకా లోపలికీ బయటకీ తిరుగాడుతూనే ఉంటాను. మెల్లగా వెలుగు పరుచుకుంటుంది. బుల్లిపిట్టల కువకువలు తగ్గి ఎక్కడో ఎవరో భళ్ళున తలుపులేసి బయటకు వెళ్తున్న చప్పుడు తెలుస్తుంది. అలవాటైన రొద లోకాన్ని ఆక్రమించుకుంటూ ఉంటుంది. నేను రహస్యంగా పోగేసుకున్న బలమేదో రోజంతా నాతో అదృశ్యంగా ఊసులాడుతూనే ఉంటుంది.

4 comments:

  1. Nice one Manasa. A good start to the day.

    ReplyDelete
  2. బాగుంది. భావుకత ను లౌకిక జీవితాన్ని పడుగు పేక లాగా కలిపి వ్రాయడం ఒక టెక్నిక్ కావచ్చు.

    రచయితలు ఎందుకు వ్రాస్తున్నారు అని ఒక సందేహం.

    1) భావాలు పంచుకోవడానికా 2) ఆ భావాలను నలుగురు మెచ్చుకోవడానికా 3) ఒక cathartic relief కోసమా 4) for playing to the gallery నా.

    నేను కూడా 35 ఏళ్ల క్రితం కొన్ని తవికలు వ్రాశాను. 2 - 3 తవికలు అచ్చు వేశారు కూడా. తరువాత అవి చదువుతుంటే చాలా కామెడీ గా అనిపించాయి. ఆ పిచ్చి రచనలు ఎలా అచ్చు వేశారా అనిపిస్తుంది.

    50 -55 ఏళ్లు వచ్చాక outlook పూర్తిగా మారిపోతుంది అనుకుంటా.

    Your writing efforts are appreciable..

    ReplyDelete
  3. ఎంతందమైన దృశ్యాన్ని కళ్ళముందు పరిచారు! ఎలా ఉన్నారు? బిజీ అయిపోయారా?

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....