మళ్ళీ మళ్ళీ నిన్నే...


పగలంతా నువ్వు లేని క్షణాలని గడపి
మర్చిపోనివ్వని జ్ఞాపకాల్ని భరించి
కన్నీళ్ళను గుండెల్లో దాచి
నవ్వులు పులుముకు తిరిగాను..

మనసుకో ఓదార్పు మాట చెప్పి
వీడ్కోలు తప్పదని నచ్చజెప్పి
నీ తలపులనన్ని తిప్పికొట్టి
ఏకాంతంలో పొగిలి పొగిలి ఏడ్చాను..

మన గొడవలెంత బాధో రాసుకున్నాను
నీ మౌనానికెలా తల్లడిలానో తల్చుకున్నాను
మూసేసిన మనసు తలుపుల ముందు,
దిగులుతో నిల్చున్న క్షణం గుర్తు చేసుకున్నాను

తీరా రాతిరయ్యే సరికి
కలల దుప్పటి కప్పుకుని,
కలిసిపోయామని భ్రమించాను!
మళ్ళీ మళ్ళీ నిన్నే ప్రేమించాను!


చలం-బ్రాహ్మణీకం-కొన్ని ఆలోచనలు

నాకెందుకో మొదటి నుండీ విషాదాంతాలయ్యే కథలంటే తెలియని వెగటు.

ఏ కారణం చేతనైనా ఒక పుస్తకంలోనో, సినిమాలోనో చివరకు చెడు గెలవటాన్ని చూపించినా, మంచితనమో - నిస్సహాయతో శాపాలుగా మారి కథలోని ఏ పాత్రనో కబళించడం జరిగినా దాన్ని తేలిగ్గా తీసుకోలేక విలవిల్లాడతాను.

చిన్నప్పుడు అమ్మ/అమ్మమ్మ దగ్గర 'ఆవు-పులీ' కథ విన్న నాటి నుండీ ఈ నాటి దాకా నా ఆలోచనల్లో పెద్ద మార్పేమీ లేదనే చెప్పాలి. కేవలం ఈ ఒక్క కారణం చేతనే నేను చదవకుండా వదిలేసిన పుస్తకాలు, చూడకుండా తప్పించుకు తిరిగిన సినిమాలూ బోలెడున్నాయి. అయితే ఇటీవల రచనా వ్యాసంగం మీద నాకున్న ఆసక్తిని గమనించిన శ్రేయోభిలాషులు కొందరు మాత్రం, నా ఈ తత్వం కొన్ని మంచి కథలకు దూరం చెయ్యగలదని హెచ్చరించాక, అభిప్రాయాలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. రచనను కేవలం రచనగానూ, పాత్రల్లో కలిగే సంచలనం పాఠకుల్లో కలిగించే భావోద్వేగం రచయిత నేర్పుగానూ చూడాలని నిర్ణయించుకున్నాను. అతిగానూ, అనవసరంగానూ స్పందించడం నన్ను ఆదర్శ పాఠకురాలిని కాకుండా చేసి, రచనలను అనుభూతి చెందటం నుండి రెక్క పట్టుకు దూరం లాగుతోందన్న సందేహం కలగడమూ, నాలోని మార్పుకు కొంత కారణం.

ఇలా మార్పు ఒళ్ళో కుదురుకుంటున్న కొద్ది రోజులకే "బ్రాహ్మణీకం" నా చేతుల్లో పడటం కేవలం యాదృఛ్ఛికం!

బ్రాహ్మణీకం, నన్నడిగితే, లెక్కలేనన్ని స్త్రీ హృదయాలని, ఒక్క పాత్రలో చూపించిన విషాదం!
మంచితనానికీ, జాలికీ, సహనానికీ హద్దులు తెలుసుకోలేని అమాయకత్వం జీవితాన్ని కొండచిలువలా మింగేస్తుంటే, ఉక్కిరిబిక్కిరి అవ్వడమే తప్ప ప్రతిఘటించలేని స్త్రీ జీవితం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించే కథ.

ఇల్లు తప్ప బయట ప్రపంచం ఎఱుగని ఒక ఆడపిల్లకు పెళ్ళి. మేడ పైని గదిలో, బయట ప్రపంచానికి ప్రవేశం లేకుండా తలుపులు మూసేసి, ఆమె సౌందర్యంతో పిచ్చి వాడైన భర్త పగలూ-రాత్రీ బేధం లేకుండా, రెండేళ్ళ పాటు సాగించిన సంసారం, చివరికి అతని ఆరోగ్యం చెడిపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మేడ దిగుతుంది.

అనారోగ్యంలోనూ భార్యను విడలేని వెర్రి మోహమా భర్తది. తల్లిదండ్రులూ, అత్తమామలూ వారిద్దరినీ విడిగా ఉంచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో, ఆఖరుకు, భర్తకు జాతకరీత్యా ఉన్న ఆయుస్షు అంతే కనుక, తదనుగుణంగా చివరి ఘడియల్లో భర్త మనసుకు ఉల్లాశం కల్పించడమే మెఱుగన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది.

చేసేదేమీ లేక వాళ్ళ ప్రాప్తానికి వాళ్ళని వదిలేస్తారందరూ.

భర్త చనిపోతాడు. అతనికి ఆస్థి ఉందని తెలిసినా, ఎలా రాబట్టుకోవాలో తెలీనితనం! భర్త చనిపోయాక ఎవరి పంచకు చేరాలో, ఎవరు ఆశ్రయం ఇవ్వగలరో, ఎవరిని అడగాలో తెలియని బిడియం!

ఈ లోపు తండ్రీ చనిపోతాడు. దిక్కు లేకుండా పోయిన తల్లీ కూతుళ్ళ సంగతీ తెలుసుకున్న మేనమామ, వారిద్దరికీ ఆశ్రయం ఇవ్వడానికి ముందుకు వస్తాడు. అలా వారింటికి ప్రయాణమవుతారు. దారిలో ప్రయాణం పొడుగునా వీళ్ళ వ్యవహార శైలిని చలం వర్ణించిన తీరు చదివి తీరాల్సిందే! ఇతర కులాల వారితోనూ, వర్గాల వారితోనూ సాగిన సంభాషణల్లో అగ్ర వర్ణాల వారి ఆలోచనల గురించి విసిరిన వ్యంగ్యోక్తులు మనకి తెలీకుండానే పెదవుల చివరల నవ్వులు పూసేలా చేస్తాయి.

ఇహ నా దృష్టిలో అసలు కథ మొదలయ్యేది సుందరమ్మ వీళ్లింటికి వెళ్ళాకనే! అక్కడ ఈమె పాలిటి శాపంలా ఒక సంగీతం మాష్టారు(చంద్రశేఖరం) తయారవుతాడు. అతనికి సుందరమ్మ అందం మీద వ్యామోహం! ఆమె కళ్ళల్లో కనపడే మెరుపు రహస్యాలు తెలుసుకోవాలనే ఉబలాటం!

ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన స్త్రీ అన్న గౌరవమూ, ఆమె వైధవ్యం పట్ల జాలీ ఉన్నా, వాటిని మించిన మోహమే, ఆమె సౌందర్యం పట్ల తెలియని వ్యామోహమే ఆమెపై అతని ఆసక్తికి తొలి బీజం వేస్తుంది. ఆమెను తన దారిలోకి తెచ్చుకునేందుకు అతడి ప్రయత్నాలు ఏహ్య భావాన్ని కలిగిస్తాయి. అలాగే, ఆత్మ విశ్వాసం, ధైర్యం లేని సగటు స్త్రీ మాటల్లో, పురుషుడు ఆహ్వానాన్ని ఎలా వెదుక్కుంటాడో, దాన్ని ఆధారంగా చేసుకుని ఆమెను ఎలా మభ్యపరుస్తాడో, చలం మాటల్లో చదవడం బాగుంటుంది.

ఆమె అమాయకత్వం మీద మొదట్లో మనకున్న సహృద్భావం కథ నడిచే కొద్దీ చిరాగ్గా మారుతుంది. మంచితనం, విషవలయంలోకి తీసుకుపోతోంటే మౌనంగా అనుసరిస్తున్న ఆమెను వెనక్కు లాగేందుకు, కథలో మనకీ ఒక పాత్రుంటే ఎంత బాగుండుననిపిస్తుంది.

ఒకానొక రాత్రి సదరు చంద్రశేఖరం అతనికి కావల్సినదేదో దక్కించనే దక్కించుకుంటాడు. సుందరమ్మ గర్భవతి అవుతుంది. వితంతు బ్రాహ్మణురాలైన ఆమెకు ఇది మహాపరాధంలా తోస్తుంది. ఆమె భర్త గుర్తొస్తాడు. ఆచారాలతో, సాంప్రదాయాలతో అగ్ని లాంటి స్వఛ్ఛతతో గడచిన తన గతం గుర్తొస్తుంది. అంత క్రితం అతను పలు పర్యాయాల్లో కాళ్ళ బేరానికి వచ్చినప్పుడు, చనిపోతానని అంటూ మొసలి కన్నీరు కార్చినప్పుడు, అతనికి సర్దిచెప్పే ప్రయత్నంలో వలలో పడిన సుందరమ్మకు, ఈ సంఘటన తర్వాత, ఆ కాస్త జాలీ కరిగిపోయి అసహ్యమే మిగులుతుంది.

మేనమామ చంద్రశేఖరాన్ని మెడలు వంచి పెళ్ళికి ఒప్పించడంతో, వివాహమవుతుంది. అయితే ఈ శేఖరానికి వితంతువుని పెళ్ళి చేసుకోవడం మింగుడు పడదు. అతనికి ఇలాంటి ఖర్మ పట్టినందుకు చింతిస్తూ ఉంటాడు. ఆమె మీద అందాకా ఉన్న మోజూ కనపడదు, గుదిబండన్న అభిప్రాయం తప్ప. మరో పక్క సుందరమ్మ వీటన్నింటి పట్లా నిర్వికారంగా ఉంటుంది.

బిడ్డ పుడతాడు. ఎవరి ఆసరా లేకుండా బిడ్డను పెంచడమెట్లానో సుందరమ్మకు తెలీదు. చెప్పేందుకు ఎవ్వరూ ఉండరు. ఇరుగు పొరుగూ ఈమె పట్ల మర్యాదగా వ్యవహరించరు. వీటన్నింటి వల్లా సుందరమ్మకు జీవితం పట్ల చెప్పలేని నైరాశ్యం కమ్ముకుంటుంది. పిల్లవాడికి జబ్బు చేస్తే తన పాప ఫలమని భ్రమిస్తూ ఉంటుంది. ఒక దేవతకు మొక్కు తీర్చుకుందుకు ప్రయత్నించబోగా, భర్త ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మరింత బెంగలో కూరుకుపోతుంది.

చివరకు, అనారోగ్యంతో ఆ బిడ్డ పరిస్థితి తీవ్రతరం అవ్వడమూ, విధిలేని పరిస్థితుల్లో మందుల షాపు వెదుక్కుంటూ వొంటరిగా వెళ్ళిన ఆమెకు, ధనం తక్కువవ్వడమూ జరుగుతాయి.

దగ్గర్లోని వ్యక్తిని అర్ధించగా, ఆ క్షణం దాకా మంచివాడుగా ఉన్నవాడు కాస్తా, ఆమె బ్రాహ్మణ వంశానికి చెందినదని తెలియడంతో, చిన్ననాటి వెర్రి పగ ఒకటి జ్ఞప్తికొస్తుంది అతగాడికి.

ఈ పిచ్చిపిల్ల మరో సారి మోసపోయి అది భరించే శక్తి లేక కన్ను మూయడంతో కథ ముగుస్తుంది.

*****************************

చలానికి స్త్రీ అర్థమైనట్టు మరే రచయితకైనా, ఆ మాటకొస్తే అసలు మరే స్త్రీ కైనా అర్థం అవుతుందా అన్నది, నాకిప్పటికీ సందేహమే! వాళ్ళకు మాత్రమే సొంతమైన కొన్ని భయాలు, ఆలోచనలు, అభద్రతా భావాలు, సంశయాలు, ఎక్కడా ఎప్పుడూ ఎవ్వరి ముందూ బయపెట్టని ఆశలు చలం అక్షరీకరించినట్లు వేరొకరు చేయలేరు. తమకు మాత్రమే తెలుసుననుకున్న కొన్ని రహస్యాలు చలం ఇలా బట్టబయలు చేస్తుంటే, చలాన్ని చదివే ఆడవారందరూ ఆశ్చర్యంతోనో, ఇన్ని తెలుసుకునేందుకు అతని దగ్గరున్న మంత్రమేమిటన్న అనుమానంతోనో అతడికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారనుకుంటా, నాలాగా!

రచన ఆసాంతం చలం ఆమె మానసిక స్థితిని అద్భుతంగా ఆవిష్కరించాడు. రచనలో పెద్దగా వివరణలు గట్రా కనపడవు. ఆమె ఎందుకిట్లా చేస్తున్నదో తెర వెనుక నుండి ఎవ్వరూ చెప్పరు. రచయిత మధ్య మధ్యలో చొరబడి కథను నడిపించడమూ చూడము. కథ మొత్తం సుందరమ్మదే! చంద్రశేఖరంతో ఆమె చెప్పే నాలుగు ముక్కలే ఆమె తెలివికీ, ఆలోచనలకీ, ఆమె మంచితనానికీ, తేలిగ్గా మోసపోగల తత్వానికి ప్రతీకలని పాఠకులకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ చిన్న చిన్న వాక్యాలలోనే అనాదిగా కొందరు పురుషులు స్త్రీలోని యే కోణాన్ని, ఏ బలహీనతను ఆసరాగా తీసుకుని వాళ్ళ జీవితాలను నాశనం చేసే ధైర్యం చేస్తారో చెప్పేశాడు చలం!

జీవితాలను మార్చుకోవడానికి, తీర్చిదిద్దుకుని సగర్వంగా జీవించడానికి, మనోనిబ్బరంతో పాటు కాస్తంత లోకజ్ఞానం ఉంటే చాలేమో అని అనిపిస్తుంది బ్రాహ్మణీకం చదివితే ! ఆ కాలానికీ ఈ కాలానికీ మధ్య దశాబ్దాల దూరం ఉన్నా, ఇలాంటి వార్తలు అడపా దడపా ఈనాటికీ వింటూనే ఉన్నాం కనుక, ఆ బలహీనతల నుండి బయటపడే గుణం అందరికీ కలగాలనీ కోరుకోవాలి మనం!

చలం పురూరవ - నాకు నచ్చిన కొన్ని విషయాలు



పురూరవ ఒక సౌందర్యాన్వేషణ. సత్యాన్వేషణ. ఒకరి శాపం మరొకరికి అనుకోని వరమైన కథ.

సర్వ భూవలయ ఛత్రాధిపతినన్న అహంకారం నుండి మరలి, మానవ జాతికి చెందని ఒక దేవ వేశ్య ప్రేమ తననేం చేయబోతోందోనన్న బెంగ నుండి, అభద్రతా భావం నుండి బయటపడేందుకు విశ్వ ప్రయత్నం చేసి, ఆమె చెప్పిన ప్రేమభావనను అర్థం చేసుకోలేక, ఆ దేవత ఆజ్ఞను మీరి, అపరాధిలా మారి, ఏళ్ళ తరబడి విరహంలో మగ్గిన పురూరవుడి ప్రణయ గాథ ఇది.

తన ఒళ్ళో ప్రేమతో పడుకోబెట్టుకుని, పురూరవుడికి ఊర్వశి చెప్పిన కబుర్లన్నీ, నిజానికి వినాల్సింది, ఆచరణలో పెట్ట ప్రయత్నించాల్సినదీ మనమే! ఏ కాలానికైనా అన్వయించుకోదగిన ఆణిముత్యాల్లాంటి మాటలవి!

సంభాషణల్లో అడుగడుగునా కనపడే తాత్విక చింతన చేతనైతే మన జీవితాల లోపలి పొరల వైపొకసారి తొంగి చూడమని తొందర పెడుతుంది. ప్రేమ కోసం కాదంటే, ఆ అసలు ' నిజాల ' కోసమైనా ఈ పుస్తకం చదివి తీరాల్సిందే.

" నీ దిగులేదో కాఠిన్యం కన్నా మార్దవమూ, ఔన్నత్యమూ అనుకుంటున్నావు. తాము ఎక్కడ సహాయపడలేరో, అక్కడ దిగులుపడి, తమ కర్తవ్యం తీర్చుకున్నామని సంతుష్టిపడతారు మానవులు. జాలీ, దిగులు, చాలా కపటం, బలహీనం, ఉంది మీ లోకంలో. ప్రతి అడుగుకీ వ్యథ. జాలి. ఎవరికి ఉపకారం ? మీ లోకంలో ఏడుపు ఒక ధర్మమైపోయింది. అందరూ సరే! నువ్వు ఈ అవివేకాలకి వశ్యుడివి కావడానికి వీలు లేదు.

ధీరాత్ములు, స్థితప్రజ్ఞులు, లోకంలో అసాధారణ వ్యక్తులు -వాళ్ళ జీవితాలు వాళ్ళ సొంతం కాదు. వాళ్ళ అల్పత్వాలని, వెర్రి వాంఛలని మించిన మహా శక్తి వాళ్ళని ఉపయోగించుకుంటోంది. గనుకనే వాళ్ళు మానవులలో ప్రత్యేకమైన వారైనారు. వాళ్ళు ధర్మాలకీ, నీతులకీ అతీతులు. వారి పథం అగ్నిహోత్రం. వారికి రెండో మార్గం కనపడనీదు......

ఉన్నత గమనమంటేనే పూర్వ బంధ నాశనమని అర్థం. "

ప్రేమనీ, విరహాన్నీ, దిగులునీ - దాపరికాన్నీ, తప్పొప్పుల లెక్కల్లో సతమతమయ్యే మానవ జీవితాన్నీ అక్షరాల్లో అలవోకగా చిత్రించగలగడం చలానికి చేతనైనట్టు ఇంకెవరికన్నా చేతనౌనా అనిపించింది చాలా సార్లు.

ప్రకృతి వర్ణనలున్న ప్రతి చోటా మనసుని లాక్కెళ్ళి అక్కడ నిల్చోబెట్టగలిగిన భావాలు. ఊహలు. ఒక్కసారి పురూరవుడిగా మారి, ఊర్వశి ప్రేమను క్షణమైనా అనుభవించాలన్న ఆశ! వంటింటిలోనూ, ఇంటి కింద పార్క్‌లో సిమెంటు బెంచీ మీద కూర్చుని పేజీలు తిప్పిన సెకన్లలోనూ, ఆమె ప్రేమభావను అర్థం చేసుకోలేని పురూరవుడి మీద అంతు లేని జాలి కలిగింది నాకు. అలాంటి అవకాశాన్ని మూర్ఖుడిలా వృధా చేసుకుంటున్న అతగాడి మానసిక దౌర్బల్యం మీద కోపం కూడా వచ్చింది.

కానీ, నిజ జీవితంలో మనమంతా చేస్తున్నదీ అదే కదూ! ఊర్వశిని కాసేపు పక్కన పెడదాం! ఏది శాశ్వతం కాదో దాని కోసం వెంపర్లాడడం, కళ్ళ ముందున్న "క్షణం" అనే స్వర్గాన్ని విడనాడి, భవిష్యత్ కోసం కలలు కంటూ లేదా భయపడుతూ, ఆశలోనో నిరాశలోనో, జీవితాన్ని నాశనం చేసుకునే అభాగ్యులు మన చుట్టు పక్కలెంత మంది లేరు గనుక!

ఊర్వశి ప్రేమను మించినదేదీ లేదంటుంది. "నిన్ను నీకు పరిచయం చెయ్యనా" అని పురూరవుడితో అంటూ ఉంటుంది. ఎన్నో ఆజ్ఞలూ పెడతానంటుంది. అవన్నీ పురూరవుడు తనని తాను మరవడానికి. అతడు ఆమే వాడై, ఇంకేమీ కాకుండా పోవడానికి. అంత అధికారాన్ని, దానిని మించిన ప్రేమనూ, అన్నింటిని అనుభవిస్తూ కూడా.."నువ్వెవరు" అన్న ప్రశ్నను విడిచిపెట్టలేని పురూరవుడికి ఇలా బదులిస్తుంది.

"యుగాలు వెదికి వెదికి నిన్ను చేరాను. ఈనాటికి నిన్ను గొప్ప అశాంతితో -ఈ లోకపు అశాంతి కాదు, వెయ్యి కన్నులతో, ఎక్కడ ? ఎక్కడ? అని కాలంతో ప్రతీ క్షణం ఎదురు చూసే సూర్య చంద్రులతో, అనంత దూరాన ఉన్న నక్షత్రాల కాంతితో కళ్ళు కలిపి వెతికే మధురమైన అశాంతితో, మాయ పొరలు చేధించి అనేక రూపాలలో, లోకాలలో, ఎవరు? ఎవరు ? నా ఆత్మనాథుడెవరు, అని దిక్కులు నిశ్శబ్దంగా మారుమ్రోగే అన్వేషణ ఫలితంగా కలుసుకున్నాను నిన్ను.

నన్ను మర్చిపోకు. మళ్ళీ నా చేతులని తప్పించుకుని అంధకారంలోకి జారినా నుంచి దూరమైపోకు. నీ అనుభవానికి నువ్వే విరోధివై నీకు నువ్వే అబద్దీకుడవై మనిద్దరి మధ్యా విరహ సముద్రాలని కల్పించకు.  నువ్వు నిరాకరిస్తే నిస్సహాయనైపోతాను,


ఎంతకూ రాని కాంతికై మౌనంగా పూవు రెక్కల మీద కన్నీరు కార్చే రాత్రివలే నా విరహంలో నేనే అణగిపోతాను. "

చదివేందుకు గట్టిగా అరగంటైనా పట్టని ఈ పుస్తకం, మననం చేసుకుంటుంటే మాత్రం రోజులు దాటిపోయేలా చేయగల అద్భుతం!

పురూరవుణ్ణి చదవకండి! ఏకాంతంగా కూర్చుని మనసారా అనుభవించండి!

ఊర్వశిలోని దైవత్వం నిండిన ప్రేమనూ, పురూరవుడి అల్ప మానవ మనస్తత్వాన్ని, మనం ఊహించలేని, సాధించలేని అపూర్వ ప్రేమ భావనలో మునిగి తేలండి!

ఈ పుస్తకం తప్పక చదవాల్సిన పుస్తకమని సూచించిన స్వాతిగారికీ, దొరక్క ఇబ్బంది పడుతుంటే, అవినేని భాస్కర్ గారి పేరు సూచించడమే కాకుండా ఆఫీసుకి తెచ్చి ఇచ్చిన "ఏకాంతం" బ్లాగర్ దిలీప్‌కు కృతజ్ఞతలు.

చలంగారి పుస్తకాలు బోలెడిచ్చి, నా మిగిలిన పుస్తకాలు, పనులు పక్కన పడేసేలా చేసిన భాస్కర్‌కు డబుల్ థాంక్స్. :)

భీత హరిణి


ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా రాసిన కవిత ఇది. నేను చదువుకునే రోజుల్లో కూడా ర్యాగ్గింగ్ ఉండేది.అందులోనూ మా కాలేజీ (సిద్ధార్థ, విజయవాడ) ఇటువంటి వాటికి పెట్టింది పేరు. అయినా చదువయ్యే సరికి కేవలం స్నేహాలే తప్ప గొడవలు గుర్తుండకపోవడం నా జ్ఞాపకశక్తి నాకిచ్చిన వరం ;)


ఈ కవితను, హంసిని వెబ్ పత్రిక వారు ప్రచురించారు.
http://hamsini.andhraheadlines.com/Sections/Details.aspx?CatID=5&AuthId=22&ArtId=65

*****************************************

అమ్మా నాన్నల అల్లారు ముద్దు పెంపకంలో
ఆకాశమే హద్దుగా సాగిన విజయ ప్రస్థానం నాది
కన్న వాళ్ళ శత కోటి కలలను నిజం చేసేందుకు
తొలిసారిగా గూడు వీడిన ఓ లేత గుండె చప్పుడిది

నన్ను చూస్తూనే.. మర్యాద ధ్వనించని చప్పట్లు
దగ్గరకు రమ్మంటూ కరడు గట్టిన గళాల పిలుపులు
నా మానస వీణలో   మెదిలిందేదో     అపశృతి
ఆకలి గొన్న సింహపు ముంగిట లేడి పిల్ల స్మృతి!

నిస్సహాయంగా నిల్చున్నాక విచారణ పేరిట వేధింపులు
వంద మందీ ఒక్కటయ్యాక వెర్రి ప్రశ్నలతో సాధింపులు
ఆధిపత్యం నిలబెట్టుకోను అర్థం లేని అరుపులు
తప్పేంటో తెలీనివ్వక క్షోభ పెట్టే ఎగతాళి చూపులు..

నా స్వప్న సౌధపు పునాదులను
ఎవరో పెకిలిస్తున్న భావనలు నాలో
నేనూహించుకున్న పవిత్ర ప్రపంచపు
మౌనపు వెక్కిరింపులు లోలో....!!

ఒక్కసారిగా ఉప్పెనలా విరుచుకు పడే విమర్శనాస్త్రాలు
జీవితానికి సరిపడే బాధని మిగిల్చిన గాయాలు
క్యాంటీన్ లోకి వెళ్ళనీక ఆపిన భయాలు-బిడియాలు
ఆకలి మంటల నార్పలేక కన్నీరోడ్చిన జ్ఞాపకాలు ...

అర్థ రాత్రి దాటినా ఆగని వంకర ప్రశ్నలకు
అలసి పడిన చేదు చీకటి అనుభవాలు
ఎదురు తిరిగిన ప్రతి చోటా ప్రతి సారీ
ఎదను కోసేసిన అవమాన భారాలూ..

తన వాళ్ళనే తోడేళ్ళై కబళించే తత్వమింకా సమసి పోలేదనీ..
ఆటవిక యుగపు దాఖలాలు చుట్టూరా మిగిలే ఉన్నాయనీ
మనందరికీ తేల్చి చెప్తుంటే,సిగ్గుతో తల దించుకోమంటుంటే
ఏ వెలుగులను వెదుక్కుంటూ సాగిస్తున్నాం మనమీ ప్రస్థానం..?

మరో ప్రపంచాన్ని పరిచయం చేసెదెవరని మూర్ఖంగా అన్వేషించక
మార్పు తెచ్చేందుకు మహాత్ముడే రావాలని మౌనంగా నిరీక్షించక
ఎన్నటికీ అమలు కాని చట్టాల డొల్లతనాన్ని గేలి చేస్తూ
కుల మత వర్గ  విభేదాలను  కళాశాల కావలే  ఆపేస్తూ ..
                                        ఇప్పుడైనా చేతులు కలుపుదాం..!!

మానవత్వపు పరిమళాలు వాడనివ్వని వాడే
'మనీషి' అని మరో మారు చాటేందుకు..
విద్యాలయాల్లో విజ్ఞాన జ్యోతులే ప్రకాశిస్తూ
రాక్షస క్రీడలన్నీ అంతరించిపోయేటందుకు...!

రెల్లు పూల పానుపు పైన..

అనుభవాలన్నింటికి అక్షరాల తొడుగులు తొడగడం నా వరకూ నాకు అసాధ్యమైన పనే! అయినా ఎందుకీ తాపత్రయం అంటే, ఆ అనుభవాలకు సంబంధించిన అన్ని విశేషాలనూ కావలనుకున్నప్పుడల్లా తరచి చూసుకోవడానికి; మళ్ళీ మళ్ళీ జ్ఞాపకాల జారుడుబల్లనెక్కి, గతమనే ఇసుక తిన్నెల్లోకి తుళ్ళింతలతో జారిపడుతూ, జీవితం నన్నెంతలా సంతోషపెట్టిందో గుర్తు చేసుకుని, మరింతగా ఆమెను ప్రేమించడానికి!

మనం కాలంతో పాటు పరుగులు తీస్తూ తీరాలను దాటుకుంటూ ఎంత ముందుకు వచ్చేసినా, తొలి అడుగులు కొన్ని ఆ ఇసుక తిన్నెల్లో గాఢ ముద్రలు వేసే తీరతాయి. వర్షం వెలసిన మర్నాడు రెమ్మ రెమ్మకీ లాల పోసే చినుకులంత స్వచ్ఛంగా మనసులో నిలిచిపోతాయ్!

మొట్టమొదటి సారి కాలేజీకి వెళ్ళడం, ఉద్యోగంలో చేరిన మొదటి రోజు, మొదటి జీతం అందుకున్న రోజు, మొదటి సారి విదేశంలో అడుగిడిన రోజు, తొలి ప్రేమ, తొలి ముద్దు..నిజానికి సౌందర్యమంతా ఆ కొత్తదనానిదేనేమో కదూ!

" I like beginnings..because they are so full of promises...
I like beginnings because i know,there is always more to come....."

ఎప్పుడో ఎక్కడో చదివి నేను దాచిపెట్టుకున్న ఈ వాక్యాలతో ఏకీభవించని వారు బహుశా ఎవ్వరూ ఉండరేమో! నచ్చినా, నచ్చకపోయినా ఆ జ్ఞాపకాలు మర్చిపోవడం మాత్రం దుర్లభమని అందరూ ఒప్పుకునే తీరాలి. అలాంటి ఒక జ్ఞాపకం గురించి...రెల్లు పూల పానుపు అకస్మాత్తుగా ప్రత్యక్షమై వెన్నెల తరకలు దానిపై పరుచుకోవడాన్నితొలిసారిగా "విన్న" రోజుల గురించి......

ఇంజనీరింగ్ ఫైనల్ సెమిస్టర్ - లైవ్ ప్రోజక్ట్ కోసం ముచ్చట పడ్డామేమో, తిరిగీ తిరిగీ కాళ్ళు పడిపోయేవి. ఇంకో పక్క పరీక్షలు గట్రా మామూలే -

ఖాళీగా కొన్నాళ్ళు ఇంట్లో ఉందామనే ఆశ కూడా మనసులోకి రానీకుండా అమ్మ చిన్నప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల, పరీక్షలైపోతున్నాయన్న సంతోషం కన్నా, ఉద్యోగం రాకపోతే నా పని గోవిందా అన్న భయమే ఎక్కువగా ఉండేది.

ఆ భయమూ, నా బద్దకమూ 24 గంటలూ చేతిలో చెయ్యేసుకుని జంటగా ఉండడం వల్ల, ఎప్పుడూ దేవుడిని బెదిరించడంతోటే నా చదువు మొదలెట్టేదాన్ని. "దేవుడా, నిన్ను నమ్మాలంటే నువ్వు నాకు నెల రోజుల్లో మంచి ఉద్యోగం ఇప్పించేయాలంతే" - ఇలాగన్నమాట! అయితే ఇలాగే గతంలో ఇంటర్లో ఒకసారి బెదిరించినప్పుడు దేవుడికి బాగ ఖోపం రావడంతో అది కాస్తా బెడిసికొట్టింది. ఈ అలకలూ అవీ మనకి బొత్తిగా అచ్చి రావన్న తెలివితేటలు నాలో కలిగి, ఇంజనీరింగ్‌లో బుద్ధిగా మొక్కుల్లోకి దిగిపోయాను.

ఫ్రెషర్స్ వరల్డ్ ను పగలూ రాత్రీ మొహమాట పడకుండా బట్టీ కొట్టి, ఏదో అదృష్టం నన్ను కౌగిలించుకోబట్టి, కాంపస్ సెలెక్షన్స్లో గట్టెక్కాను. 'హమ్మయ్యా' అనుకుంటూ హైదరాబాదు వచ్చి పడ్డాను.

కొత్త ఆఫీసు! కొత్త మనుషులు. మా కాలేజీ నుండి నాతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా సెలక్ట్ అయ్యారు. అందులో ఒకమ్మాయి నా ప్రాణ స్నేహితురాలు, హరిత. చదువుకునేటప్పుడు ఒకరి ఇంట్లో ఒకరం రోజుల తరబడి ఉండగలిగినంత స్నేహం కావడంతో, కలిసి వేరే ఊరు రావడం, మళ్ళీ కలిసి ఉద్యోగం చేయడం...భలే సరదాగా ఉండేది.

ఇంటి మీద బెంగా, మొట్టమొదటి సారి ఇల్లు వదిలి వచ్చాక బలవంతంగా మనకి మనమే చేసుకోవాల్సిన పనులూ పక్కన పెడితే, ఆఫీసులో మాత్రం మహా తమాషాగా ఉండేది. "ఆఫీసంటే ఇలానా ఉంటుంది?" అని ఆశ్చర్యంగా కూడా ఉండేది. ఎందుకంటే,చేరీ చేరగానే ఏదో పని చేసెయ్యాలన్న తాపత్రయం మా అందరిదీ! ఆ ఆత్రాన్ని,ఆవేశాన్ని ఎవ్వరూ పెద్దగా అర్థం చేసుకున్నట్టే కనపడేవారు కాదు. సీనియర్లెవ్వరూ మమ్మల్ని పట్టించుకోకుండా సీరియస్‌గా పని చేసుకుపోతుండేవాళ్ళు. మేనేజర్ల సంగతి సరే సరి! మా మొహం చూసిన పాపాన కూడా పోలేదా మహానుభావుడు!


ఆ తర్వాత ఒకరోజు ఆయన చావు కబురు చల్లగా చెప్పారు. మాకొక ట్రైనింగ్ ఉండబోతోందనీ..అది పూర్తయ్యేదాకా మాకు పొరపాటున కూడా పని ఇవ్వరని, మేము కొన్నాళ్ళిలా బలవంతపు "బెంచ్" పిరియడ్ అనుభవించి తీరాలనీ! నాకైతే కళ్ళల్లో నీళ్ళొక్కటే తక్కువ. చచ్చీ చెడీ అన్ని రౌండ్‌లు పరీక్షలు రాసి, కాలేజీ చదువు పూర్తయ్యాక గట్టిగా నెల రోజులు కూడా ఖాళీగా గడపకుండా వస్తే, మళ్ళీ పరీక్షలనడం ఎంత ఘోరం! ఇదేం అవమానం అని కాసేపు గింజుకున్నా, గత్యంతరం లేదు కాబట్టి దానికి అలవాటు పడాలన్న నిర్ణయానికి వచ్చాం అందరం.

మా కంప్యూటర్ వాళ్ళు( నేను, హరిత, రమ్య, తపస్వి, సౌజన్య , హర్ష, సత్య, సతీష్, వంశీ ) , ఇంకా ఎలెక్ట్రానిక్స్ వాళ్ళు ( రఘుమిత్ర, సంతోష్, ఆదిత్య,రాఘవేంద్ర, రాజశేఖర్, సుబ్బు (సుబ్రహ్మణ్యం), విద్య, రోహిణి ..) దాదాపు అందరం కలిసే ఉండేవాళ్ళం.

ఆ కంపనీలో, ఎవ్వరూ అడుగు పెట్టని ప్రాంతం ఒకటి ఉండేది- అది లైబ్రరీ. ఆ లైబ్రరీకి పాపం ఒక నోరు లేని లైబ్రేరియన్. ఈ పని లేని జనాలందరికీ రోజు గడిచే మార్గం చూపించింది ఈ లైబ్రరీయే అని మళ్ళీ చెప్పక్కర్లేదనుకుంటా!


మేమంతా, రెండున్నర దాకా ..అంటే, కేటరర్స్ గిన్నెలు సర్దుకుని వెళ్ళిపోయే దాకా డైనింగ్ హాల్లో కూర్చుని, ఏదో ఒకరకంగా కాలక్షేపం చేసి మరో రెండు నిముషాల్లో మమ్మల్ని తరిమే వారెవరైనా వస్తారు అనిపించగానే, ఆ లైబ్రరీకి వెళ్ళిపోయే వాళ్ళం.

సరే, రొటీన్ ఆటలు బాగా బోరు కొట్టేస్తున్నాయని, ఒక రోజు పాటలు పాడాలని నిర్ణయించుకున్నాం.

కొందరు అహింసావాదులు తమ గాన కళా చాతుర్యంతో జనాలను చంపడం ఇష్టం లేక, 'మేము పాడలేము' అంటూ మర్యాదగా పక్కకి తప్పేసుకున్నారు. పాడాలనీ..పాడకూడదనీ సంశయంతో మగ్గిపోయే మా హరిత లాంటి వాళ్ళేమో, 'అసలైతే నేను పాడతాను..కాని..ఇప్పుడు...ఉహు..ఇంత మందిలో..నో నో..' అంటూ హడావుడి చేసారు :). యధావిధిగా హరిత సంగతి తెలీని మిగిలిన వాళ్ళు బతిమాలుకున్నాక, "జస్ట్ హమ్ చేస్తానంతే!" అని చెప్పి ఏదో పాడేసింది. ఆ పాట కనిపెట్టే ప్రయత్నాల్లో మిగిలిన వాళ్ళు ఉండగానే, "వెయిట్" చెయ్యడం అస్సలు ఇష్టం లేని , సుబ్రహ్మణ్యం తన పాట మొదలెట్టేసాడు...'మాయదారి మైసమ్మో ..మైసమ్మా...'అని (అది కూడా డప్పు కొట్టుకుంటూ..). మేము అందరూ ముందు ఉలిక్కిపడి, ఆ తర్వాత ఆ లైబ్రరియన్ ఎక్కడ పరుగెత్తుకు వస్తాడో అని చచ్చేట్టూ టెన్షన్ పడి, ఆ ఫ్లోని కంట్రోల్ చేసే వృధా ప్రయత్నాలేవో చేసాం. ఈ సుబ్రహ్మణ్యం ఆ తర్వాత జి. స.రి.గ.మ లాంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా పాడుతున్నాడు. రేడియో మిర్చి వాళ్ళు నిర్వహించిన మరో కార్యక్రమంలో కూడా హుషారు పాటలతో హోరెత్తించాడు.

నన్ను ఎవ్వరూ పాడమనకపోయినా, నేను ఏ మాత్రం నిరాశ చెందకుండా, హరిత, సుబ్బు పాడగా నాకేంటన్న ధైర్యంతో, ఎవ్వరికీ తెలీని, ఆడియో తప్ప సినిమా విడుదల కాని ఒక దేవా సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట పాడాను.

ఇక మిగిలింది మా రఘు మిత్ర. అందరినీ బాధ పెట్టకుండా ఏడిపించడం లో అతను ముందుండేవాడు. అతను పాడతాను అనగానే మేము కూడా పోటా పోటీగా ఏదో ఒకటి వెక్కిరించడానికి వంక దొరుకుతుందనే ఆశతో హుషారుగా ముందుకొచ్చాం. ఉన్నట్టుండి, పాట మొదలెట్టాడు..." రెల్లు పూల పానుపు పైన.." అంటూ.. నిజంగానే నేను ఆశ్చర్యపోయాను..ఆ రెల్లుపూల వానలో తడిసిపోయాను. పాటలంటే సినిమా పాటలే అని ఊహించుకునే అజ్ఞానం నాదప్పట్లో.


"ఏ సినిమాలోది ఈ పాట" ఆ అబ్బాయి పాట పాడడం అయిపోగానే చప్పట్లు కొడుతూ అడిగాను.
'లలిత గీతం మానసా.., సినిమా పాట కాదు" నవ్వుతూ చెప్పాడు ఆ అబ్బాయి.

ఆ తర్వత "టీ" టైం అవ్వడంతో, మేము అందరం ఇక ఆ విషయాన్ని అక్కడితో వదిలేసాం.
ఆ పాట మాత్రం చాల కాలం నన్ను వెన్నాడింది..అంత హాయి గొలిపే పాటలను అంత సామాన్యంగా మర్చిపోలేం. అనుకోకుండా నేను ఇంకో మంచి ఆఫర్ రావడంతో, ఆ కంపెనీని వదిలేసి వచ్చేసాను.

మొన్నా మధ్య అక్క హైదరాబాదు వచ్చినప్పుడు, కోటి విశాలాంధ్రలో ఏవో పుస్తకాలు కొనాలని నన్ను కూడా తీసుకెళ్ళింది. అక్కడ పుస్తకాలు తిరగేస్తుంటే, కృష్ణ శాస్త్రి సాహిత్యం- 4 కనపడింది. రాత్రి అక్క పిల్లలు కరుణించి నిద్రపోయాక - పరాగ్గా ఈ పుస్తకం పట్టుకుని పేజీలు తిప్పుతుంటే, "రెల్లు పూల పానుపు.." కనపడింది. మళ్లీ అదే వాన... రెల్లు పూల పానుపు పైన వెన్నెల వాన. ఇది కృష్ణశాస్త్రి గారు కురిపించిన జల్లు అని తెలిసి పట్టరాని ఆనందం కలిగింది. ( మరి అప్పటి దాకా నాకు ఆ ముక్క తెలీదు కదా..)

పాట సాహిత్యం ఇదీ :

" రెల్లు పూల పానుపు పైనా
జల్లు జల్లులుగా - ఎవరో
చల్లినా రమ్మా! వెన్నెల చల్లినా రమ్మా!

కరిగే పాల కడవల పైన
నురుగు నురుగులుగా -
మరిగే రాధా మనసూ పైన
తరకా తరకలుగా - ఎవరో
పరచీనారమ్మ! వెన్నెల పరచీనా రమ్మా!

కడిమి తోపుల నడిమి బారుల
ఇసుక బైళుల మిసిమి దారుల
రాసీ రాసులుగా - ఎవరో
పోసీనా రమ్మా - వెన్నెల పోసీనా రమ్మ! "

పాట నెట్లో దొరుకుందేమో నాకు తెలీదు. ఒక వేళ ఉన్నా మొదటి సారి కలిగినంత ఆనందం కలుగుతుందో లేదో అసలే తెలీదు. నాకు ఆ జ్ఞాపకాలే మధురాతి మధురం! కేవలం అదొక్కటే కాదు,

జీవితంలో ప్రతి క్షణాన్నీ, దానిలోని కొత్తదన్నాన్నీ ఆస్వాదించే ప్రయత్నం చేస్తే, ప్రతి అనుభవాన్ని భద్రంగా దాచుకోవాలనిపించేంత గొప్పగా మలచుకోగలిగితే, సంతోషం తప్పకుండా మనని వెదుక్కుంటూ వస్తుంది. ఆపై చిరునవ్వులన్నీ విడిచి పోనని మారాం చేసే చంటి పాపలై మనని చుట్టుకుపోతాయి.

Really, the secret is as simple as this -
"Joy is what happens to us when we allow ourselves to recognize how good things really are!"

Historic Times : అన్నా హజారేకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు

జాతీయ స్థాయిలో అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న అహింసావాద పోరాటానికి, నిరాహార దీక్షకు మద్దతుగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి, "యూత్ ఫర్ బెటర్ ఇండియా" సంస్థ అనేక మంది పౌరులను భాగస్వామ్యులను చేస్తూ, హైదరాబాద్ నగరంలో రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తోంది.


ఏప్రిల్ 8వ తారీఖున, దోమల్‌గూడలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో వేలాది మంది పౌరులతో పాటు, శేఖర్ కమ్ముల (సినీ దర్శకులు), చుక్కా రామయ్య ( విద్యావేత్త), బాబూ రావు వర్మ ( స్వాతంత్ర్య సమర యోధులు), రామ కృష్ణ రాజు (రాష్ట్ర కన్వీనర్, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్.టి.ఐ. కాంపైన్) తదితర ప్రముఖులు సైతం పాలు పంచుకోనుండటం ముదావహం.



స్వాతంత్ర్య పోరాటం తదనంతరం, ప్రజలందరి లబ్ధికై జరుగుతున్న అతి పెద్ద ప్రజా పోరాటంగా మారుతున్న ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి బాధ్యత కలిగిన పౌరులందరూ సంపూర్ణ మద్దతు నందించాలనీ, తమ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యులై ముందుకు నడిపించాలనీ 'యూత్ ఫర్ బెటర్ ఇండియా' సంస్థ పిలుపునిస్తోంది.

అవినీతిని నిరోధించేందుకు, అంతమొందించేందుకు మనకున్న అమూల్యమైన అవకాశాన్ని చేజార్చుకోరాదనీ, ఈ పోరాటం ప్రజలందరి సహకారంతో మాత్రమే ముందుకు సాగగలదనీ విన్నవిస్తూ, పాల్గొనదలచిన వారిని , "యూత్ ఫర్ బెటర్ ఇండియా" వారి ఈ క్రింది నంబర్లలో సంప్రదించాలని తెలియజేసారు.

శశాంక్ - 9949648018 ; ఎలక్షన్ రెడ్డి - 9676360111
 
Venue : Indira park, Hyderabad
Time : 8 AM

ఆలింగనం


హోరెత్తిస్తున్న హారన్లు...ఆగకుండా అనౌన్సుమెంట్లు..
మనకంటూ మిగిలింది కేవలం మరికొన్ని క్షణాలు

గుప్పెట్లోని ముళ్ళ గులాబీలో అందం శూన్యం
ఆ చివరి ఆకుపచ్చ రెపరెపలకే మనసంతా భారం


విచ్చుకోని పెదవుల మౌనంలో మనసు విరహ గీతాలు 
చెమ్మగిల్లిన చూపులకటూ ఇటూ వేల ఊసుల ఉత్తరాలు   

వీడమంటూ మొండికేస్తూ ఐక్యమవుతున్న అరచేతులు
వసంతాలన్నీ వెలి వేసే వేదనతో రగులుతున్న ఎదలు

ఓపలేని ఒంటరితనాన కమ్ముకునే దిగులు తలపులు
రోజుల ఎడబాటూ వల్లకాదంటూ రాలిపడే కన్నీటిబొట్లు

కాలమిలా విషం చిమ్ముకుంటూ వెళ్ళిపోయేదే
వీడ్కోలులోని విషాదం ఉప్పెనలా ముంచి వేసేదే..

నువ్వైనా నాలుగు నవ్వుల్ని దోసిట్లో పోసి సాగనంపకుంటే
ఆఖర్లో ఆత్మీయ ఆలింగనం ఆసరాగా ఇవ్వక ఆగిపోయుంటే !!

రాగసాధిక

  ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...