ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కవిత్వం - "అనుభూతి గీతాలు"


"కలలు పండే వేళ,
మౌనపుటలల మీదుగా
గతాన్నీ, భవిష్యత్తునూ
కలిపే స్వప్న సేతువు
ఏకాంతం -"             అంటూ అందమైన భావాలతో సాగిపోయే కవితా సంకలనం "అనుభూతి గీతాలు"గా కాక మరింకెలా మన ముందుకొస్తుంది ?

ఇది సాహితీ ప్రపంచంలో సుపరిచితులైన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి రచన. కవి పండిత కుటుంబంలో, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి తనయులుగా జన్మించిన వీరు, దాదాపు అన్ని సాహితీ ప్రక్రియలనూ స్పృశించినట్టే కనపడతారు. అపురూపమైన భావావేశం వీరి సొంతం. ఆవేశాన్నైనా, ఆవేదననైనా అక్షరాల్లో లయబద్దంగా అమర్చగల్గడం, పాఠకుల మనసులతో పాటు, మెదళ్ళనీ రచనల ద్వారా కదిలించగలగడం వీరి ప్రత్యేకతలు.

నాకు మొదటి నుండి కవిత్వం పైన తగని మక్కువ. వచనమంటే లేదని కాదు. కానీ, కవిత్వంలో ఉన్నదేదో అందులో కనపడదు. పైకి సరళంగా, సంఘర్షణలేమీ లేని సరస్సులా కనిపించినా, సముద్రమంత లోతైన భావాన్ని కలిగి ఉండి, తేలిగ్గా అర్థం కాకుండా తరచి చూసిన కొద్దీ, కొద్ది కొద్దిగా అందాన్ని విప్పార్చి చూపే కవిత్వాన్ని నేను మొదటి నుండి ప్రత్యేకంగా చూసేదాన్ని. అక్షరాలలో అంతర్లీనంగా దాగి ఉండే అర్థాలను, పంక్తుల మధ్య నుండే ఖాళీలో ఒదిగీ దాగీ కవ్వించే అందాలను దొరకబుచ్చుకోవాలనుకునే నా తపనే, ఇలా కవితా సంకలనాల వెనుక పడేందుకు ప్రోత్సాహం ఇస్తుంది.

"ఊర్మిళను విడిచిన మర్నాడు " అని శర్మ గారు రాసిన కవిత ఒకటి చదివాను.
"నిన్ను విడిచి వచ్చాక గాని
నీ స్వప్నచ్ఛాయలింత బలమైనవని నాకు తెలియదు
నా మెడ చుట్టూ చేతులు వేసి
నిశ్చింతగా పడుకున్న నిన్నటి నీ స్పర్శ
ఇంతగా నా ఉనికిని నీలోకి లాగేసుకుందని
నాకు తెలియదు"



అంటూ మొదలయిన ఆ కవిత చదవగానే వారి రచనలు మరిన్ని చదవాలన్న ఆసక్తి కలిగింది. ఇది జరిగిన చాలా రోజులకు, ఈ "అనుభూతి గీతాలు" ((తొలి ముద్రణ -1976. మలి ముద్రణల వివరాలు తెలీవు నాకు.) దొరికాయి. ఈ సంకలనంలోని దాదాపు అన్ని కవితలూ బాగుంటాయి. కొన్ని పద చిత్రాలు అందంగా అనిపిస్తే, కొన్ని చోట్ల విరుపులే అందాన్ని తెచ్చి పెట్టాయి. కొన్ని శబ్ద సౌందర్యంతో ఆకర్షించాయి.

ఉదాహరణకు, "కళ్ళు" అనే కవితలో,

"క్రూర కాంక్షా ఫణుల మణులవి
ధీర వాంఛా మదన సృణులవి"      - అంటారీయన.

లోకం పోకడలను "దుఃఖం" అనే కవితలో రాసినా, జన్మ సూత్రాన్ని, రహస్యాన్ని "మృతి"లో వివరించినా, సున్నితత్వం, సందేశం కవితలని విడిచిపెట్టలేదు.

"మంచు కొండల మధ్య ఇరుకు లోయలో
సన్నని సెలయేటి నీటి చప్పుడు-
మంచు అంటిన నల్ల నల్లని రాళ్ళు
వాయులీనాల శ్రుతులు సవరించుకునే
నీగ్రో విద్వాంసులు- "                         అంటూ దృశ్యాలను వినిపించడం వీరికే సాధ్యం!

నాకు నిరాశ కలిగించినవి లేవా అంటే ఉన్నాయి. "వెన్నెల్లో గోదావరి" లాంటి శీర్షికలు, "అనుభూతి గీతాలు" అన్న పేరున్న సంపుటిలో కనపడినప్పుడు, మనసు ఏవేవో ఊహించుకోవడాన్ని తప్పుబట్టలేం. కానీ, ఆ ఆశించిన వర్ణనలేవీ అక్కడ కనపడవు. మనమూ పంచుకోవాలనిపించే అనుభవాలేవీ పలకరించవు. వేరే మాటల్లో చెప్పాలంటే, కాస్త గోదావరి పరిచయమూ, కొన్ని మామూలు మాటలతో చప్పగా సాగిపోతుంది.

శ్రీకాంతశర్మ గారు అనుభూతివాదాన్ని సమర్ధించిన కవిగా పేరొందినవారు. అయితే, ఈ మాట చెప్తూన్నప్పుడు, ప్రముఖ సాహితీ విమర్శకులు, కీ.శే. టి.ఎల్.కాంతారావుగారి మాటలు స్ఫురణకొస్తాయి. వారి "కొత్త గొంతులు" నుండి,


" నాకైతే ఈ వాదం చాలా విచిత్రంగా ఉంది. అనుభూతికి అతీతమైన కవిత్వం ఒకటి ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానంగా భావ కవిత్వాన్నిపేర్కొని భావం లేకుండా కవిత్వం ఉంటుందా? అని ఎదురు ప్రశ్న వేసే అవకాశం ఉంది.భావ కవిత్వం ఒక ఉద్యమం. అందుకే ఒక దృక్పథం కనపడుతుంది. అనుభూతి కవిత్వానికి అట్లాంటి దృక్పథం ఉన్నట్లు కనపడం లేదు. ఎవరి అనుభూతి వారిది అనుకుంటే పేచీ లేదు. తిలక్ చెప్పినట్టు అనుభూతి ఆకారం పాఠకులను హత్తుకోవాలి.కనీసం "ట్రాన్స్పరెంటు చీకటి" అయినా అయి ఉండాలి. అలా కాపోతే కవిని పాఠకుడు అందుకోవడం కష్టం"

'అనుభూతి గీతాల'కు నిజానికి ఈ కష్టం లేదు. విమర్శకులే అన్నట్టు, కవి చెప్పదల్చుకున్నదేదో మనకు సూటిగానే చేరుతుంది. ఈ సూచనలన్నీ ఒక వాదంలో చిక్కుకుని, ఇజాల ముసుగులో తలదాచుకుని రచనలు సాగించే అపరిపక్వత కలిగిన కవులకు చెందాల్సినవని అర్థం చేసుకున్నాను.

కవితలతో పాటు, "తూర్పున వాలిన సూర్యుడు" అనే నవల, సాహిత్య పరిశోధనా, విమర్శనా గ్రంథాలు, శిలా మురళి అనే కావ్యమూ, లెక్కలేనన్ని వ్యాసాలు, శీర్షికలూ, రేదియో నాటకాలూ, సంగీత రూపకాలూ వీరి రచనా పాటవానికి తార్కాణాలు.

శర్మగారు 1944లో తూ.గో జిల్లాలో జన్మించారు. సతీమణి ఇంద్రగంటి జానకీబాల గారూ రచయితగా సుప్రసిద్ధులే. రేడియో వినే అలవాటు ఉన్న వారందరికీ, "సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ.." అంటూ ఆమె గొంతులో ఆహ్లాదంగా సాగిపోయిన గీతం ఈ పాటికే గుర్తొచ్చి ఉంటుంది. కొన్నాళ్ళు మా నాన్నగారి కొలీగ్‌గా పని చేసిన గుర్తు నాకు. "అష్టాచెమ్మా" సినిమాతో మనకి పరిచయమైన ఇంద్రగంటి మోహన కృష్ణ వీరి అబ్బాయి.

రాజకీయాల్లోనూ, చిత్రరంగంలోనూ వారసత్వాన్ని పుణికిపుచ్చుకునే వాళ్ళని ఎంతో మందిని చూస్తాం కానీ, సాహితీ రంగంలో ఇలాంటివి అంత తఱచుగా కనపడవు. తెలుగు పొట్టి కథలకు "కథానిక" అనే అద్భుతమైన పేరు సూచించి, ఆ సాహితీ ప్రక్రియకు ఒక సమున్నత స్థానాన్ని కల్పించిన శ్రీ. హనుమచ్ఛాస్త్రి గారి వారసత్వాన్ని నిలబెట్టడంతో పాటు, అర్థవంతమైన రచనలెన్నో చేసి, సాహితీ ప్రియులకు షడ్రసోపేతమైన విందునిచ్చిన శ్రీకాంత శర్మ గారి వంటి మహనీయులను, అప్పుడప్పుడూ పుస్తక పరిచయ మిషతో తల్చుకుని నీరాజనాలందించడానికే ఈ వ్యాసం.  

12 comments:

  1. చాలా మంచి పరిచయం
    ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతోందో చెప్పగలరా

    ReplyDelete
  2. కవితలపై తిలక్ మాటలు చదివిన ప్రతీసారీ ఛెళ్ళున తగులుతాయి. కవిత్వాన్ని ప్రేమించి, ఇంకా ప్రారంభ దశలోనే ఉండి నిజాయితీగా ప్రయత్నించే వారిని పక్కన పెడితే, కొంత మంది ఎందుకు రాస్తారో వారికే తెలీదు. ఏమి రాస్తారో కూడా తెలీదు. వీళ్ళంటే మాత్రం నాకు కొద్దిగా భయమే. మీ వ్యాసం బాగుంది.

    ప్రస్తుతానికి ఈ పుస్తకం నా దగ్గర దొరుకుతుంది. అన్ని చోట్లా దొరుకుతుందని మాత్రం అనుకోను. చాలా పాత పుస్తకం కదా! మీ స్పందనకు ధన్యవాదాలు.
    మరో మాట - మీ బ్లాగ్‌లో నాకు కామెంట్ ఎన్ని సార్లు ప్రయత్నించినా సబ్మిట్ అవ్వడం లేదు. మొదట రాసింది కాస్తా తరువాతి ప్రయత్నాల్లో మర్చిపోగా..పోగా..చివరికి ఇది మిగిలింది :(. అందుకే ఇక్కడే రాస్తున్నాను( ఇది కూడా మిగలదేమోనని..). క్షమించాలి.
    ---
    కవితలపై తిలక్ మాటలు చదివిన ప్రతీసారీ ఛెళ్ళున తగులుతాయి. కవిత్వాన్ని ప్రేమించి, ఇంకా ప్రారంభ దశలోనే ఉండి నిజాయితీగా ప్రయత్నించే వారిని పక్కన పెడితే, కొంత మంది ఎందుకు రాస్తారో వారికే తెలీదు. ఏమి రాస్తారో కూడా తెలీదు. వీళ్ళంటే మాత్రం నాకు కొద్దిగా భయమే. మీ వ్యాసం బాగుంది.

    ReplyDelete
  3. మానస గారు:

    చాలా మంచి పుస్తకం, మంచి పరిచయం. శర్మ గారి అన్ని రచనల్లోకి "అనుభూతి గీతాలు" నాకు చాలా ఇష్టమయిన రచన. మీరు అన్న మాట బాగుంది -"పైకి సరళంగా, సంఘర్షణలేమీ లేనీ సరస్సులా కనిపించినా, సముద్రమంత లోతైన భావన్ని కలిగి ఉండి, తేలిగ్గా అర్థం కాకుండా తరచి చూసిన కొద్దీ కొద్ది కొద్దిగా అందాన్ని విప్పార్చి చూపే కవిత్వాన్ని నేను మొదటి నుండీ ప్రత్యేకంగా చూసేదాన్ని."

    ReplyDelete
  4. బావుందండీ బాగా రాసారు. very nice.’నిశ్శబ్దం-గమ్యం"...ఇంకా రెండు మూడు పుస్తకాలు శర్మగారివి.. చాలా బావుంటాయి.నాకు శర్మ గారి కవిత్వం చాలా ఇష్టం. మా నాన్నగారి సహోద్యొగే కాక మంచి మిత్రులు వారు.మా నాన్నగారు తన అవార్డ్ కార్యక్రమాలకు అన్నింటికీ వారితోనే స్క్రిప్ట్ రాయించుకునేవారు. "సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ.." రాసినది శ్రీ. హనుమచ్ఛాస్త్రిగారే.

    ReplyDelete
  5. చాలా బావుందండి. కవిత్వాన్ని గురించీ ఈ పుస్తకాన్ని గురించీ కొన్ని మంచి గమనికలు రాశారు.

    ReplyDelete
  6. చాన్నాళ్ళకి బ్లాగుల్లోకి రాగానే మనసుకి హాయి కల్పించారు, చాలా కృతజ్ఞతలు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు రాసింది "ఆకాశగీతం" వీలైతే చదవండి. మిమ్మల్ని నిరాశ పరచదు.
    "పలకరించడానికి ఎన్నో భాషలు
    కొన్ని వినిపించేవి, కొన్ని కనిపించేవి
    పలకరింత నిన్నూ, నన్నూ
    ఒక జాతికొమ్మ మీద కలిపిన పులకరింత
    ఒంటరితనం కొనకొమ్మమీద
    చిరునవ్వు పూసే చిగురింత
    శిలకూ, ఉలికీ, కుంచెకూ, విపంచికీ
    వర్ణార్ణవామృత కలశాలందించి
    అక్షర ధనస్సుమీద
    సాయక సమాహారం సంధానించి
    సాగించే జీవనలీల - ఇది" అంటూ సాగుతుంది. నాకెప్పటికీ మరపుకి రానిదా కవిత.

    ReplyDelete
  7. @అఫ్సర్ గారూ: ధన్యవాదాలు. నిజమే, 'అనుభూతి గీతాలు ' శర్మ గారి రచనల్లో ప్రత్యేకమైనదే. మీ అమూల్యమైన స్పందనకు కృతజ్ఞతలు.
    తృష్ణ గారూ: అవునండీ; అది హనుమచ్ఛాస్త్రిగారి గీతమే.
    ఉష గారూ: చక్కటి కవితను పరిచయం చేశారు. ధన్యవాదాలు. తృష్ణ గారూ, మీరూ ఇలా మంచి పుస్తకాల జాబితా అందించినందుకు ఒక పక్క సంతోషంగా ఉన్నా, అవన్నీ ఇప్పుడు ప్రచురణలో ఉన్నాయో లేదో, ఉన్నా దొరుకుతాయో లేదో అన్న బెంగ మాత్రం వెంటే ఉంది. వాటిని సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాలిక.

    కొత్తపాళీ గారూ : హృదయపూర్వక ధన్యవాదాలు.

    ReplyDelete
  8. నా టపా గురించి మీ టపాలో వ్యాఖ్యానించినందుకు కృతఙ్ఞతలు. మీరన్నట్టు ఏదో సమస్య ఉన్నట్టుంది సరిచేస్తాను. ఈలోపు కనీసం అనానిమస్ గా అయినా వ్యాఖ్యానించండి. ఈ కొత్త టపా చూడండి. http://pakkintabbayi.blogspot.com/2011/09/blog-post.html#comments

    ReplyDelete
  9. ಮಾನಸ ಗಾರೂ,
    ಇಂದ್ರಗಂಟಿವಾರಿ ಪ್ರತ್ಯೇಕತೇ ಅದಿ. ಆಯನ ಪತ್ರಿಕಾ ಸಂಪಾದಕುಲುಗಾ ಉನ್ನಪ್ಪುಡು ಎಂತೋ ಮಂದಿ ರಚಯಿತಲನಿ ಕವುಲನೀ ಪ್ರೋತ್ಸಹಿಂಚಾರು. ಆಯನ ಚುಟ್ಟೂ ಆಯನ ಪೆಂಚುಕುನ್ನ ಮೊಕ್ಕಲೂ ಆಯನಲಾಗೇ ಸ್ವಚ್ಛಂಗಾ ಆಮ್ಲಜನಿತೋ ಪ್ರಾಣಂ ಉಬುಕುತೂಂಟಾಯಿ.

    ReplyDelete
  10. మానస గారూ, శ్రీకాంతశర్మగారి రచనల గురించి ముఖ్యంగా కవిత్వం గురించి మీ పరిచయం చాలా బావుంది. ముఖ్యంగా ఊర్మిళను విడిచిన మర్నాడు అంటూ మీరు పరిచయం చేసిన ఆ వాక్యాలు చాలా అద్భుతంగా అనిపించాయి.

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....