అప్పుడూ ఇప్పుడూ

వేదాద్రి కృష్ణా జిల్లాలోని లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం. అనిల్ వాళ్ళ తాతగారి తాతగారికి పుట్టిన పిల్లలు పుట్టినట్టే పోతోంటే, ఎవరో చెప్పగా విని, ఈ క్షేత్రానికి వచ్చి మొక్కుకుంటే, అప్పుడొక్క పిల్లవాడు బతికి బయటపడ్డాడట. అప్పటినుండీ ఇంటిల్లిపాదికీ ఏటా ఇక్కడకు రావడం అలవాటట. ఏ బస్సూ రావడానికి వీల్లేని ఆ కాలాల్లో, వీళ్ళ తాతముత్తాతలు పొయ్యిలతో సహా అన్నీ అక్కడే ఏర్పాటు చేసుకుని, ఇంటి నుండీ తెచ్చుకున్న పప్పుప్పులతో, నలభయ్యేసి రోజులు అక్కడే దీక్షగా ఉండిపోయేవారట.

అనిల్‌కీ నాకూ శ్రావణమాసంలో పెళ్ళైంది. మొదటి ఏడు నోములు పట్టే వీలుంటే మానకూడదని, మాకిచ్చిన మూడు వారాల సెలవుల్లో రెండు వారాలు ఆ నోమూ ఈ నోమూ పట్టించి, శ్రావణ పట్టీ చేతిలో పెట్టి, శ్రావణ శుక్రవారాలు కానిచ్చేశారు. మూడో వారం కాస్త ఊపిరాడే వేళకి, వేదాద్రి వెళ్ళి రమ్మన్నారు. ఇద్దరం బయలుదేరాం. 

అనిల్ అప్పటికొక ఆరు నెలల ముందు నుండే తెలుసు నాకు. హైదరాబాదులో ఆఫీసు పక్కనే స్నేహితులతో తనూ, కూకట్‌పల్లి్‌లో సింగిల్ బి.హెచ్.కె లో, ఒంటరిగా నేనూ ఉండేవాళ్ళం. సాయంకాలాలు గచ్చిబౌలి దాకా వచ్చి తను బైక్ మీద ఇంటికి తీసుకువస్తే, టీ తాగి స్వాగత్‌లోనో చిల్లీస్‌లోనో కూర్చుని, పదకండింటికి వాళ్ళిక బయలుదేరమంటే కదిలేవాళ్ళం. పేపర్ నాప్కిన్స్ నిండా పేర్లూ, తారీఖులూ, అరచేతుల నిండా కలిసిన వేళ్ళ కనపడని గురుతులూ..

ఆ హైదరాబాదు రద్దీ రోడ్లూ, హడావుడీ, అన్నీ చీకట్లోకి జారి, తను నా ఇంటి ముందు మళ్ళీ దించేసరికి మమ్మల్ని చూడటానికి కొబ్బరాకుల వెనుక చందమామొక్కడూ కాచుక్కూర్చునేవాడు.  నేను పైకి వెళ్ళి బాల్కనీలోకి పరుగెడితే, మెయిన్ రోడ్ మీద స్లో అయిన తన బండీ, సొట్ట పడ్డ బుగ్గల్తో సన్నని నవ్వూ వీధి దీపపు పసుపు వెలుతుర్లో అంత దూరాన్నీ కోసుకుంటూ నాకు కనపడేవి. కొన్ని సార్లు మరీ ఆలస్యమైతే కావాలనే బండి ఎక్కడో ఆపేసి నడుచుకుంటూ ఇంటికొచ్చేవాళ్ళం. అలా మెట్ల మీద కూర్చుని, నిద్ర కమ్ముకునే వేళకి కదిలి, మళ్ళీ బాల్కనీలో నేను నిలబడితే ఫోన్‌లో ఒకరినొకరు చూసుకుంటూ మెల్లిగా చెప్పుకోవాల్సినవి చెప్పుకుని..

షాపింగ్‌లూ, పెళ్ళి కార్డ్‌లూ, ఎన్ని పనులున్నా తిరిగిందంతా హైదరాబాదే కనుక, కొత్తేం అనిపించేది కాదు. కానీ, వేదాద్రి నేను ఎప్పుడూ చూడని ఊరు. గుడిని ఆనుకుని పారే కృష్ణానది ఓ వైపు, ఉగ్రనారసింహుడు కొలువైన కొండ ఇంకోవైపు. కొండెక్కుతుంటే వందల వందల కోతులు నా మీదకే దూకుతున్నట్టుంటే, భుజాలు నొక్కి పట్టుకుని మెట్టుమెట్టుకీ వెనక్కు గుంజినట్టే తన వెనుక నడిచిపోయానప్పుడు. నదిలో దిగితే ఒడ్డునే వేలవేల చేపలు పాదాల మీద గంతులేస్తుంటే, వేళ్ళలో వేళ్ళు బిగించి పట్టు తప్పకుండా జాగ్రత్తపడ్డాను. ఆ చేపలూ, అల్లరీ - శృంగేరికి పోటీగా ఉండే దృశ్యమది. కాళ్ళు తడుపుకుంటూ ఆడినంత సేపు ఆడి, సాయంకాలం దర్శనమయ్యాకా, 'నది దాటదామా?' అన్నాడు. 

పడవ వచ్చింది. నది మీద నారింజ వెలుగులు పడుతున్నాయప్పటికే. నది మీది గాలి చల్లగా తాకుతోంది. తీరానికావల గుబురు చెట్ల మధ్య నుండీ వెనక్కు ఏదో దారి ఉంది. మమ్మల్ని దింపి మళ్ళీ ఎప్పుడు రావాలో అడిగి, పడవవాడు పరుగుల మీద ఆ దారిలోకి నడిచి మాయమైపోయాడు. ఇసుకలో కూర్చున్నాం ఇద్దరం. చిన్న చిన్న అలల్లా నీరు వచ్చి చాచిన పాదాలను తాకుతూ పోతోంది. అప్పుడొకటీ అప్పుడొకటిగా గుడి గంటల శబ్దం. గుంపుగా కొండంచును పట్టి జారే కోతుల కిచకిచలు కొన్నిసార్లు. అంతే. మనుషుల పొడ లేదు. పారిపోతునట్టే క్షణాల్లో మాయమయ్యేవి ఆకాశంలో పక్షులు. నే పాడుకున్న ఇష్టమైన రాగమొక్కటే ఇప్పటికీ నా చెవుల్లో, జ్ఞాపకాల్లో...ఏం మాట్లాడుకున్నామో గుర్తు లేదు కానీ, మొహమాటంగా వెనక్కి పోదామా అని అడగలేక పడవ దగ్గరే నిలబడ్డ మనిషి రూపు గుర్తుందింకా. జీబుగా కమ్ముకుపోతోన్న చీకట్లను చూసి కదిలాం. ఇంకో వైపు కూడా వెళ్ళచ్చనీ, ఇంకా బాగుంటుందనీ, ఈ వేళప్పుడు ప్రమాదం కనుక డబ్బులిప్పిస్తే రేపు తీసుకెళ్తాననీ హుషారుహుషారుగా అతనంటుంటే మొహమొహాలు చూసుకుని నవ్వుకోవడం కూడా గుర్తుంది. అలా అలా హాయిగా ఊగుతూ ఒడ్డుకు చేర్చింది పడవ. దిగి మెట్ల మీద నిలబడి చూస్తే, కృష్ణ మీద మెరుస్తూ తేలుతూ ఊగుతూ నక్షత్రాలు. అన్ని దిక్కుల నుండి అంతకంతకూ పెరుగుతూ కీచురాళ్ళ రొదలు. 

*

ఇన్నాళ్ళకు, నా ప్రహ్లాదుడిని తీసుకుని వెళ్ళడం కుదిరింది. ఊరికి మంచి రోడ్డు వచ్చింది, కార్లూ బస్సులూ గుడి ముందు దాకా వెళ్తున్నాయి. ఏ వేళన ఎవ్వరు వెళ్ళినా ఆశ్రయమిచ్చేందుకు, వండి వడ్డించేందుకు ఇప్పుడొక మంచి బ్రాహ్మణ సత్రమూ ఉంది. అదే నది, అదే గాలి, అదే కొండ, ఆవలి తీరాన అవే చెట్లు, మేం బిగించి పట్టిన ఇసుక. అవే కోతులు, కిచకిచలు, అల్లర్లూ, గుడిగంటల చప్పుళ్ళూ.

నా పక్కన నా వాడు. ఒళ్ళో నా పిల్లాడు. ఆ దేవుడికి మొక్కకుండా ఎలా ఉంటాన్నేను?

*

11 comments:

 1. Aksharalu chaduvutunte kalla mundu kanipistunnayandi annee... Chala baga rasaru

  ReplyDelete
 2. దాదాపు పదేళ్ళు అవుతున్నా నీకు ఇంత detailed గా గుర్తున్నాయంటే.. ఆ క్షణాలనెంత ఆస్వాదించావో, వాటిని నీలోకి ఎంత ప్రేమగా నింపుకున్నావో కళ్ళకు కట్టినట్టు రాసిన ఈ అక్షర చిత్రలేఖనంలో వీడియో దృశ్యాల్లా కనిపిస్తున్నాయి.

  నా కళ్ళకు మీరిరువురూ ఆదిలక్ష్మీ నారసింహుల్లా కనిపిస్తున్నారు.

  "అరచేతుల నిండా కలిసిన వేళ్ళ కనపడని గురుతులూ" What a romantic poem!

  ReplyDelete
 3. చాలా బావుంటుంది కదూ మానసా అక్కడ? మా నాన్నగారి ఫామిలీ లో యోగానంద లక్ష్మీ నరసింహ స్వామే ఇంటి దైవం.

  మా నాన్నగారి పేరు అదే! మా బామ్మ గారి పేరు కూడా రాజ్యలక్ష్మి. (అమ్మ వారి పేరు)

  ఎక్కువ హడావుడి లేకుండా మధ్యలో బండలతో ఆ కృష్ణా , కొండ మీద గుడీ.. మెట్లెక్కి జ్వాలా నరసింహుడి దగ్గరికి నడవడం.. నాకెంత నచ్చిందో

  మేము నరసరావు పేట నుంచి సత్తెన పల్లి మీదుగా వెళ్ళాం. అలా వేల్తే గింజుపల్లి అనే వూరు దగ్గర ఫంట్ మీదికి కారు కూడా ఎక్కించి నది దాటాలి.

  భలే ఉందసలు. కారు ఫంట్ మీదకా? పర్లేదా అని అడుగుతుండగానే మా పక్క నుంచి ఇసుక లారీ ఎక్కించారు దాని మీదికి

  అటు వొడ్డు చేరాక మళ్ళీ పది కిలోమీటర్లు కార్లో ప్రయాణించి వొడ్డు చేరాలి.

  జగ్గయ్య పేట మీదుగా అయితే డైరెక్ట్ గా కొండ దగ్గరికి వెళ్తాం

  ఆ తేట నీళ్ళ కృష్ణ, ఆ మెట్లు...ఇంటికి రాబుద్ధి వేయదు


  ReplyDelete
 4. @Anon - Thank you andi. Glad you enjoyed reading this.
  :)) థాంక్యూ భాస్కర్ గారూ..:))

  అవును సుజాత గారూ, మీరు చెబుతుంటే నాకూ ఆ దారిలో వెళ్ళాలని ఉంది ఈసారి కుదిరితే. మీ నదుల ప్రేమ గుర్తుంది నాకూనూ..

  ReplyDelete
 5. ఈ మధ్య తరచూ హైద్ నుంచి మా వూరు తెనాలి వెళ్తున్నాం. వేదాద్రి బోర్డ్ చూస్తూనేవున్నా ఆగాలనుకోలేదు! ఇపుడు వేదాద్రి తలుచుకొగానె నువ్వే గుర్తొచ్చేలా వున్నావ్. మంచి మధురమైన జ్ఞాపకాలే కాదు అద్భుతమైన భాష నీది మానసా! అభినందనలు!

  ReplyDelete
 6. యాదాద్రి గలగలలు గంటలై వినవచ్చె
  కృష్ణమ్మ కిలకిలలు కంటమెరిసె
  మానసమ్ము మురియ మధురమైన జంట
  నరసింహరాయని దీవెనందె....

  ReplyDelete
 7. థాంక్యూ ఇందిర గారూ! :)

  పిన్నీ, థాంక్యూ! <3

  ReplyDelete
 8. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ, ఇంకో పదిపదుల ఏళ్ళకు కూడా నువ్విలాగే కళకళలాడుతూ, కలకలమంటూ వుండాలి!

  ReplyDelete
 9. * Raki, Thank you so much :) <3
  * Thank you so much, Lalita Garu.. :)

  ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....