చలం-బ్రాహ్మణీకం-కొన్ని ఆలోచనలు

నాకెందుకో మొదటి నుండీ విషాదాంతాలయ్యే కథలంటే తెలియని వెగటు.

ఏ కారణం చేతనైనా ఒక పుస్తకంలోనో, సినిమాలోనో చివరకు చెడు గెలవటాన్ని చూపించినా, మంచితనమో - నిస్సహాయతో శాపాలుగా మారి కథలోని ఏ పాత్రనో కబళించడం జరిగినా దాన్ని తేలిగ్గా తీసుకోలేక విలవిల్లాడతాను.

చిన్నప్పుడు అమ్మ/అమ్మమ్మ దగ్గర 'ఆవు-పులీ' కథ విన్న నాటి నుండీ ఈ నాటి దాకా నా ఆలోచనల్లో పెద్ద మార్పేమీ లేదనే చెప్పాలి. కేవలం ఈ ఒక్క కారణం చేతనే నేను చదవకుండా వదిలేసిన పుస్తకాలు, చూడకుండా తప్పించుకు తిరిగిన సినిమాలూ బోలెడున్నాయి. అయితే ఇటీవల రచనా వ్యాసంగం మీద నాకున్న ఆసక్తిని గమనించిన శ్రేయోభిలాషులు కొందరు మాత్రం, నా ఈ తత్వం కొన్ని మంచి కథలకు దూరం చెయ్యగలదని హెచ్చరించాక, అభిప్రాయాలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. రచనను కేవలం రచనగానూ, పాత్రల్లో కలిగే సంచలనం పాఠకుల్లో కలిగించే భావోద్వేగం రచయిత నేర్పుగానూ చూడాలని నిర్ణయించుకున్నాను. అతిగానూ, అనవసరంగానూ స్పందించడం నన్ను ఆదర్శ పాఠకురాలిని కాకుండా చేసి, రచనలను అనుభూతి చెందటం నుండి రెక్క పట్టుకు దూరం లాగుతోందన్న సందేహం కలగడమూ, నాలోని మార్పుకు కొంత కారణం.

ఇలా మార్పు ఒళ్ళో కుదురుకుంటున్న కొద్ది రోజులకే "బ్రాహ్మణీకం" నా చేతుల్లో పడటం కేవలం యాదృఛ్ఛికం!

బ్రాహ్మణీకం, నన్నడిగితే, లెక్కలేనన్ని స్త్రీ హృదయాలని, ఒక్క పాత్రలో చూపించిన విషాదం!
మంచితనానికీ, జాలికీ, సహనానికీ హద్దులు తెలుసుకోలేని అమాయకత్వం జీవితాన్ని కొండచిలువలా మింగేస్తుంటే, ఉక్కిరిబిక్కిరి అవ్వడమే తప్ప ప్రతిఘటించలేని స్త్రీ జీవితం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించే కథ.

ఇల్లు తప్ప బయట ప్రపంచం ఎఱుగని ఒక ఆడపిల్లకు పెళ్ళి. మేడ పైని గదిలో, బయట ప్రపంచానికి ప్రవేశం లేకుండా తలుపులు మూసేసి, ఆమె సౌందర్యంతో పిచ్చి వాడైన భర్త పగలూ-రాత్రీ బేధం లేకుండా, రెండేళ్ళ పాటు సాగించిన సంసారం, చివరికి అతని ఆరోగ్యం చెడిపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మేడ దిగుతుంది.

అనారోగ్యంలోనూ భార్యను విడలేని వెర్రి మోహమా భర్తది. తల్లిదండ్రులూ, అత్తమామలూ వారిద్దరినీ విడిగా ఉంచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో, ఆఖరుకు, భర్తకు జాతకరీత్యా ఉన్న ఆయుస్షు అంతే కనుక, తదనుగుణంగా చివరి ఘడియల్లో భర్త మనసుకు ఉల్లాశం కల్పించడమే మెఱుగన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది.

చేసేదేమీ లేక వాళ్ళ ప్రాప్తానికి వాళ్ళని వదిలేస్తారందరూ.

భర్త చనిపోతాడు. అతనికి ఆస్థి ఉందని తెలిసినా, ఎలా రాబట్టుకోవాలో తెలీనితనం! భర్త చనిపోయాక ఎవరి పంచకు చేరాలో, ఎవరు ఆశ్రయం ఇవ్వగలరో, ఎవరిని అడగాలో తెలియని బిడియం!

ఈ లోపు తండ్రీ చనిపోతాడు. దిక్కు లేకుండా పోయిన తల్లీ కూతుళ్ళ సంగతీ తెలుసుకున్న మేనమామ, వారిద్దరికీ ఆశ్రయం ఇవ్వడానికి ముందుకు వస్తాడు. అలా వారింటికి ప్రయాణమవుతారు. దారిలో ప్రయాణం పొడుగునా వీళ్ళ వ్యవహార శైలిని చలం వర్ణించిన తీరు చదివి తీరాల్సిందే! ఇతర కులాల వారితోనూ, వర్గాల వారితోనూ సాగిన సంభాషణల్లో అగ్ర వర్ణాల వారి ఆలోచనల గురించి విసిరిన వ్యంగ్యోక్తులు మనకి తెలీకుండానే పెదవుల చివరల నవ్వులు పూసేలా చేస్తాయి.

ఇహ నా దృష్టిలో అసలు కథ మొదలయ్యేది సుందరమ్మ వీళ్లింటికి వెళ్ళాకనే! అక్కడ ఈమె పాలిటి శాపంలా ఒక సంగీతం మాష్టారు(చంద్రశేఖరం) తయారవుతాడు. అతనికి సుందరమ్మ అందం మీద వ్యామోహం! ఆమె కళ్ళల్లో కనపడే మెరుపు రహస్యాలు తెలుసుకోవాలనే ఉబలాటం!

ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన స్త్రీ అన్న గౌరవమూ, ఆమె వైధవ్యం పట్ల జాలీ ఉన్నా, వాటిని మించిన మోహమే, ఆమె సౌందర్యం పట్ల తెలియని వ్యామోహమే ఆమెపై అతని ఆసక్తికి తొలి బీజం వేస్తుంది. ఆమెను తన దారిలోకి తెచ్చుకునేందుకు అతడి ప్రయత్నాలు ఏహ్య భావాన్ని కలిగిస్తాయి. అలాగే, ఆత్మ విశ్వాసం, ధైర్యం లేని సగటు స్త్రీ మాటల్లో, పురుషుడు ఆహ్వానాన్ని ఎలా వెదుక్కుంటాడో, దాన్ని ఆధారంగా చేసుకుని ఆమెను ఎలా మభ్యపరుస్తాడో, చలం మాటల్లో చదవడం బాగుంటుంది.

ఆమె అమాయకత్వం మీద మొదట్లో మనకున్న సహృద్భావం కథ నడిచే కొద్దీ చిరాగ్గా మారుతుంది. మంచితనం, విషవలయంలోకి తీసుకుపోతోంటే మౌనంగా అనుసరిస్తున్న ఆమెను వెనక్కు లాగేందుకు, కథలో మనకీ ఒక పాత్రుంటే ఎంత బాగుండుననిపిస్తుంది.

ఒకానొక రాత్రి సదరు చంద్రశేఖరం అతనికి కావల్సినదేదో దక్కించనే దక్కించుకుంటాడు. సుందరమ్మ గర్భవతి అవుతుంది. వితంతు బ్రాహ్మణురాలైన ఆమెకు ఇది మహాపరాధంలా తోస్తుంది. ఆమె భర్త గుర్తొస్తాడు. ఆచారాలతో, సాంప్రదాయాలతో అగ్ని లాంటి స్వఛ్ఛతతో గడచిన తన గతం గుర్తొస్తుంది. అంత క్రితం అతను పలు పర్యాయాల్లో కాళ్ళ బేరానికి వచ్చినప్పుడు, చనిపోతానని అంటూ మొసలి కన్నీరు కార్చినప్పుడు, అతనికి సర్దిచెప్పే ప్రయత్నంలో వలలో పడిన సుందరమ్మకు, ఈ సంఘటన తర్వాత, ఆ కాస్త జాలీ కరిగిపోయి అసహ్యమే మిగులుతుంది.

మేనమామ చంద్రశేఖరాన్ని మెడలు వంచి పెళ్ళికి ఒప్పించడంతో, వివాహమవుతుంది. అయితే ఈ శేఖరానికి వితంతువుని పెళ్ళి చేసుకోవడం మింగుడు పడదు. అతనికి ఇలాంటి ఖర్మ పట్టినందుకు చింతిస్తూ ఉంటాడు. ఆమె మీద అందాకా ఉన్న మోజూ కనపడదు, గుదిబండన్న అభిప్రాయం తప్ప. మరో పక్క సుందరమ్మ వీటన్నింటి పట్లా నిర్వికారంగా ఉంటుంది.

బిడ్డ పుడతాడు. ఎవరి ఆసరా లేకుండా బిడ్డను పెంచడమెట్లానో సుందరమ్మకు తెలీదు. చెప్పేందుకు ఎవ్వరూ ఉండరు. ఇరుగు పొరుగూ ఈమె పట్ల మర్యాదగా వ్యవహరించరు. వీటన్నింటి వల్లా సుందరమ్మకు జీవితం పట్ల చెప్పలేని నైరాశ్యం కమ్ముకుంటుంది. పిల్లవాడికి జబ్బు చేస్తే తన పాప ఫలమని భ్రమిస్తూ ఉంటుంది. ఒక దేవతకు మొక్కు తీర్చుకుందుకు ప్రయత్నించబోగా, భర్త ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మరింత బెంగలో కూరుకుపోతుంది.

చివరకు, అనారోగ్యంతో ఆ బిడ్డ పరిస్థితి తీవ్రతరం అవ్వడమూ, విధిలేని పరిస్థితుల్లో మందుల షాపు వెదుక్కుంటూ వొంటరిగా వెళ్ళిన ఆమెకు, ధనం తక్కువవ్వడమూ జరుగుతాయి.

దగ్గర్లోని వ్యక్తిని అర్ధించగా, ఆ క్షణం దాకా మంచివాడుగా ఉన్నవాడు కాస్తా, ఆమె బ్రాహ్మణ వంశానికి చెందినదని తెలియడంతో, చిన్ననాటి వెర్రి పగ ఒకటి జ్ఞప్తికొస్తుంది అతగాడికి.

ఈ పిచ్చిపిల్ల మరో సారి మోసపోయి అది భరించే శక్తి లేక కన్ను మూయడంతో కథ ముగుస్తుంది.

*****************************

చలానికి స్త్రీ అర్థమైనట్టు మరే రచయితకైనా, ఆ మాటకొస్తే అసలు మరే స్త్రీ కైనా అర్థం అవుతుందా అన్నది, నాకిప్పటికీ సందేహమే! వాళ్ళకు మాత్రమే సొంతమైన కొన్ని భయాలు, ఆలోచనలు, అభద్రతా భావాలు, సంశయాలు, ఎక్కడా ఎప్పుడూ ఎవ్వరి ముందూ బయపెట్టని ఆశలు చలం అక్షరీకరించినట్లు వేరొకరు చేయలేరు. తమకు మాత్రమే తెలుసుననుకున్న కొన్ని రహస్యాలు చలం ఇలా బట్టబయలు చేస్తుంటే, చలాన్ని చదివే ఆడవారందరూ ఆశ్చర్యంతోనో, ఇన్ని తెలుసుకునేందుకు అతని దగ్గరున్న మంత్రమేమిటన్న అనుమానంతోనో అతడికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారనుకుంటా, నాలాగా!

రచన ఆసాంతం చలం ఆమె మానసిక స్థితిని అద్భుతంగా ఆవిష్కరించాడు. రచనలో పెద్దగా వివరణలు గట్రా కనపడవు. ఆమె ఎందుకిట్లా చేస్తున్నదో తెర వెనుక నుండి ఎవ్వరూ చెప్పరు. రచయిత మధ్య మధ్యలో చొరబడి కథను నడిపించడమూ చూడము. కథ మొత్తం సుందరమ్మదే! చంద్రశేఖరంతో ఆమె చెప్పే నాలుగు ముక్కలే ఆమె తెలివికీ, ఆలోచనలకీ, ఆమె మంచితనానికీ, తేలిగ్గా మోసపోగల తత్వానికి ప్రతీకలని పాఠకులకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ చిన్న చిన్న వాక్యాలలోనే అనాదిగా కొందరు పురుషులు స్త్రీలోని యే కోణాన్ని, ఏ బలహీనతను ఆసరాగా తీసుకుని వాళ్ళ జీవితాలను నాశనం చేసే ధైర్యం చేస్తారో చెప్పేశాడు చలం!

జీవితాలను మార్చుకోవడానికి, తీర్చిదిద్దుకుని సగర్వంగా జీవించడానికి, మనోనిబ్బరంతో పాటు కాస్తంత లోకజ్ఞానం ఉంటే చాలేమో అని అనిపిస్తుంది బ్రాహ్మణీకం చదివితే ! ఆ కాలానికీ ఈ కాలానికీ మధ్య దశాబ్దాల దూరం ఉన్నా, ఇలాంటి వార్తలు అడపా దడపా ఈనాటికీ వింటూనే ఉన్నాం కనుక, ఆ బలహీనతల నుండి బయటపడే గుణం అందరికీ కలగాలనీ కోరుకోవాలి మనం!

28 comments:

  1. చలానికి స్త్రీ అర్థమైనట్టు మరే రచయితకైనా, ఆ మాటకొస్తే అసలు మరే స్త్రీ కైనా అర్థం అవుతుందా అన్నది, నాకిప్పటికీ సందేహమే!
    ......................

    చాలా బాగా చెప్పారు. ఆ మొత్తం పేరా ఎంతో అర్థవంతంగా ఉంది.
    చలం రచనల్లో నాకు నచ్చిన మొదటి ఐదులో బ్రాహ్మణీకం ఉంటుంది. మీ విశ్లేషణ బావుంది.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
  2. Thanks Soumya, you really have read it very quickly! :) am surprised to see ur feedback flashing in my inbox in minutes time. Cheers!

    and yea, Brahmaneekam is sure a great work by Chalam.

    ReplyDelete
  3. నేను బ్రాహ్మణీకం నవలపై వ్రాసిన రివ్యూ ఇది: http://literature.mlmedia.net.in/2010/07/blog-post_09.html

    ReplyDelete
  4. ఆ మధ్య రంగనాయకమ్మ గారు వార్త ఆదివారం బుక్‌లెట్‌లో చలం నవలావలోకనం పేరుతో రివ్యూలు వ్రాసారు. ఆ రివ్యూ చదివిన తరువాతే నేను బ్రాహ్మణీకం నవల చదివాను.

    ReplyDelete
  5. చలం గారు వ్రాసిన అనసూయ కూడా చదవండి. బ్రిటిష్‌వాళ్ళ కాలంలో భర్త చనిపోయిన స్త్రీల పరిస్థితి ఎలా ఉండేదో తెలుస్తుంది. 'అనసూయ‌'లో జరిగినవి పూర్వం మా కుటుంబంలో కూడా జరిగాయి.

    ReplyDelete
  6. ఈ కథ ఎన్ని సార్లు చదివినా అప్పుడే మొదటి సారి చదివినట్టు నిస్సహాయతతో కన్నీళ్ళు వస్తాయి నాకు! సుందరమ్మకి కొంచెం కూడా సహాయం చేయలేకపోయామే, "ఓసి పిచ్చి కుంకా, వాడి ఉద్దేశం గమనించు" అని కాస్తయినా జాగ్రత్తలు చెప్పలేకపోయామే అని పిచ్చి దు@ఖమొస్తుంది.

    చలానికి స్త్రీ అర్థమైనట్టు మరే స్త్రీ కైనా అర్థం అవుతుందా అన్నది, నాకిప్పటికీ సందేహమే! వాళ్ళకు మాత్రమే సొంతమైన కొన్ని భయాలు, ఆలోచనలు, అభద్రతా భావాలు, సంశయాలు, ఎక్కడా ఎప్పుడూ ఎవ్వరి ముందూ బయపెట్టని ఆశలు చలం అక్షరీకరించినట్లు వేరొకరు చేయలేరు. తమకు మాత్రమే తెలుసుననుకున్న కొన్ని రహస్యాలు చలం ఇలా బట్టబయలు చేస్తుంటే, చలాన్ని చదివే ఆడవారందరూ ఆశ్చర్యంతోనో, ఇన్ని తెలుసుకునేందుకు అతని దగ్గరున్న మంత్రమేమిటన్న అనుమానంతోనో అతడికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారనుకుంటా, నాలాగా! __________ఇవి అచ్చంగా నా మాటలే! చలం పుస్తకాలు చదివినపుడల్లా నా మనసులో నేను గొణుక్కునే మాటలు! చాలా మంది ఇలాగే అనుకుంటారేమో అయితే! అవును, మన మన్సులో ఆలోచనల్నీ రహస్యాలనూ చలం ఎలా తెలుసుకోగలడో తెలుసుకునేందుకే స్త్రీలు చలానికి దగ్గరవుతారు.

    ఇలా తీయని మాటలకు,ప్రేమ ప్రకటనలకు లొంగి పోవడంలో ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు ఆడవాళ్ళలో!

    ఇందులో చలం ఒక మాట అంటాడు ఒక చోట "ఔన్నత్యంలో ఉన్నన్నాళ్ళూ మనుషులు ఆ ఔన్నత్యం తమ స్వభావంలోనే ఉందనుకుంటారు" అని! సుందరమ్మనుద్దేశించి! ఎంత అద్భుతమైన మాటో!

    అలాగే ఆచారాలన్నీ తు చ తప్పకుండా పాటించే సుందరమ్మ మేనమామ ఇంట్లో కాఫీ కి అలవాటు పడ్డప్పుడు "సుందరమ్మ ఆచారమంతా అలవాటే గానీ ప్రిన్సిపుల్ కాదు" అంటాడు. చాలా మందికి ఛెళ్ళున తగిలే మాట అది.

    సుందరమ్మ మాత్రం చలం పాత్రల్లో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర! చాలా జాలినీ ప్రేమనూ కల్గించే పాత్ర

    ReplyDelete
  7. అనసూయ పాత్ర సుందరమ్మ పాత్ర వంటిది కాదా? భర్త చనిపోయిన అనసూయకి రెండవ పెళ్ళి చెయ్యకుండా ఆమె భర్త ఆస్తి కోసం ఆమెని విధవగా ఉంచుతారు. ఆమెకి బంధువుల అబ్బాయి సూర్యనారాయణని దత్తత ఇచ్చి ఆస్తి పోకుండా చేస్తారు. ఆ సమయంలో అనసూయ ఒక డాక్టర్‌ని నమ్మి మోసపోతుంది. ఇంటి నుంచి పారిపోయి డాక్టర్‌ని పెళ్ళి చేసుకోవాలనుకున్న ఆమెని డాక్టర్ మోసం చెయ్యడంతో ఆత్మహత్య చేసుకుంటుంది.

    ReplyDelete
  8. ఆ మధ్య ఎవరో అడిగారు, చలం గారి నవలలలో స్త్రీలు చివరలో ఆత్మహత్యలు చేసుకుంటారు లేదా విషాదంలో మిగిలిపోతారు ఎందుకు? అని. అప్పట్లో స్త్రీలకి సమాజం విధించిన కట్టుబాట్ల నుంచి తప్పించుకునే అవకాశం ఉండేది కాదు.

    ReplyDelete
  9. సుజాత గారూ,
    మీ స్పందనలో మరో సారి చలం ఎందుకు స్త్రీలకు ప్రత్యేకమయ్యాడో ..ఆడవాళ్ళల్లో చాలా మందివి బహుశా ఇవే భావాలేమో! మీరు ఉదహరించిన "ఆచారాలకు" సంబంధించిన మాటలు చదివినప్పుడు నాకూ అలానే అనిపించింది.

    చలం పుస్తకాలు నాకు కొత్త. ముందే చెప్పినట్టు వాటిలోని బాధ నన్ను వాటికి ఇన్నాళ్ళూ దూరంగా ఉంచింది. మొన్నీ మధ్య భాస్కర్ గారు పుస్తకాలు పంపించడంతో అదే పని మీద ఉన్నాను :))

    ReplyDelete
  10. ప్రవీణ్‌గారూ,

    ఇది రాసే ముందే బ్రాహ్మణీకం మీద మీరు రాసింది చదివాను. కృతజ్ఞతలు. మిగిలినవి చదివి అభిప్రాయలు పంచుకుంటాను.

    ReplyDelete
  11. నేను బ్రాహ్మణీకం నవల చదవడానికి ముందు వార్త ఆదివారం బుక్‌లెట్‌లో రంగనాయకమ్మ గారు వ్రాసిన వ్యాసాలు చదివాను. రంగనాయకమ్మ గారు చలం రచనలలోని స్త్రీల పాత్రలకీ, విశ్వనాథ & బాపిరాజుల రచనలలోని స్త్రీల పాత్రలకీ మధ్య తేడాని చక్కగా వివరించారు. అది చదివిన తరువాతే నాకు బ్రాహ్మణీకం & అనసూయ రచనల పై ఆసక్తి పెరిగింది. దాని గురించి ఇక్కడ వ్రాసాను http://literature.mlmedia.net.in/2010/03/blog-post_2392.html

    ReplyDelete
  12. ముందుగా నా చలం సాహిత్యం విషయంలో నా అజ్ఞానమే ఎక్కువ జ్ఞానం కంటే.
    నేను చదివినవి ఆయన రాసిన కొన్ని చిన్న కథలు అవి కూడా అంతర్జాలంలోనే.
    అవి కాక ఇక ఇలాంటి సమీక్షలూ, విశ్లేషణలూ, వాదోపవాదాలూను.
    తెలియని దాంట్లో తలెందుకు దూర్చడం, "విభూషణం మౌనమపణ్డితానాం" అని తెలిసి కూడా అంటే ...ఆ తెలివి కూడా నాకు లేదని ఒప్పుకుంటాను :(
    ఇక్కడ చలం స్త్రీలని అర్థం చేసుకోవడం గురించి మాట్లాడుకుంటుంటే నాకనిపించిన రెండు ముక్కలు చెప్పాలనిపించింది.
    ఐతే ముందుగా ఇంతవరకూ చదివిన వాటిల్లో ఈ టపా చాలా బాగా రాశారు అనిపించింది.
    భాష, భావ వ్యక్తీకరణ విషయాల్లలో చాలా బాగా అనిపించింది.
    చలం స్త్రీలని అర్థం చేసుకున్నాడంటే ఒప్పుకోవాలనిపించదు.
    మగ వారి మనస్తత్వాన్ని కపటం లేకుండా బయట పెట్టాడు అంటే బావుంటుందేమో.
    ఆ నాటి స్త్రీ పరిమితులను ఆయా కథల ముగింపులు తెలియ చేస్తాయి అన్న వ్యాఖ్య ముందు నాకు తెలియని విషయాన్ని స్పష్టం చేసినట్టనిపించింది. కానీ, ఆలోచిస్తే, చలం చూపించిన చొరవకి ఆ ముగింపులు పూర్తి వ్యతిరేకం కదా. చలం జీవితం ఆయన రచనలు, ఆయన రచనలు ఆయన జీవితం అని అనిపించేటట్లుగా నాకు ఇంతవరకూ నేను చదివి పెంచుకున్న (అ) జ్ఞానం వల్ల అర్థమైనందున ఆయా పాత్రలు సంఘర్షణను చూపిస్తున్నాయి అని మాత్రమే నేను అర్థం చేసుకోగలుగుతున్నాను.
    ఐతే కాలానుగుణంగా వచ్చే మార్పులలో చలం చిత్రీకరించిన సంఘర్షణలు ఒక వాదానికి ఎక్కువ బలాన్ని ఇచ్చేవిగా అనిపించవచ్చు.
    అది అతని మానసిక సంఘర్షణయే కాని సామాజిక స్పృహతో చేసిన సంఘర్షణ అని ఒప్పుకోవాలనిపించదు.
    ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ అభిప్రాయం నేను ఎదిగే కొద్దీ మారవచ్చు అనే కంటే ఎదగవచ్చు అని ఆశిస్తున్నాను. నాకు చలం మైదానం వంటి నవలలు చదవడం చాలా కష్టం. సాంఘిక ఇతివృత్తంతో రాసిన నవలలేమైనా చదవగలనేమో, ఎక్కువ పాత్రలూ, వైవిధ్యమైన సన్నివేశాలూ కలిగినవి ఐతే. బహుశా బ్రాహ్మణీకం ఆ కోవలోకి వస్తుందేమో. తీర్చలేని కష్టాలు, అన్యాయంగానో అమాయకత్వంతోనో బలి అయ్యిపోయే పాత్రల గురించి చదవడం కూడా కష్టమే ఐనా.

    ReplyDelete
  13. * ముందుగా ఇంతవరకూ చదివిన వాటిల్లో ఈ టపా చాలా బాగా రాశారు అనిపించింది.*
    లలిత గారు, మీ పైవాఖ్యం అర్థం ఎమిటి? ఇంత క్రితం రాసిన కొన్ని టపాలు పెద్దగా బాగ లేవనా? నేను ఈ బ్లాగు కి గొప్ప అభిమానిని. మానసా చామర్తి బ్లాగులోకంలో లేడి చలం. ఆమే రాసిన కవిత్వం చదవండి. చలం రాసిన యశోద గీతాలను గుర్తుకు తెస్తాయి. అటువంటి మానసను ఎదో వయసులో చిన్నది గదా అని ఈ టపా బాగ రాశారు అని అంటం ఎమీ బాగా లేదు.

    SriRam

    ReplyDelete
  14. సవరణ: మానసా అని రాసాను తొందరలో మానస గారు అని చదువుకొనేది.
    SrIRam

    ReplyDelete
  15. "ఇంతవరకూ చదివినవి" ఏమిటో నా వ్యాఖ్య మొదట్లో వ్రాశాను.
    నా ఉద్దేశ్యం చలం గారి రచనల గురించి నేను చదివిన వాటిల్లో అని.
    మానస గారి వ్రాతలతో ఈ టపాతోనే ఇప్పుడే పరిచయమయ్యింది నాకు.
    పేరు లీలగా గుర్తుకు వస్తోంది, వ్యాఖ్యలలో / వ్యాఖ్యల ద్వారా ఎక్కడైనా చూశానేమో మరి.
    వీరి మిగిలిన టపాలు చదవాలన్న ఆసక్తి కలిగింది ఈ టపా చదివాక.
    వయసు ప్రసక్తి ఇక్కడ అనవసరం అనుకుకుంటాను.
    ఎందుకని అంతలా నన్ను అన్నారో అర్థం కావట్లేదు.
    మీకు అనిపించింది అని కాకుండా నేను అనేశాను అనేస్తే మరి నాకూ బాధ వేస్తుంది.

    ReplyDelete
  16. చలం గారి నిజ జీవితంలో జరిగిన ఘట ఇది. చలం గారి cousin (పెదనాన్న గారి కూతురు) పేరు రమణ. చలం గారు తన చిన్నప్పుడు రమణతో ప్రేమలో పడ్డారు. Straight cousinsని పెళ్ళి చేసుకోవడానికి భారతీయ సమాజం అంగీకరించదు. Cross cousins (మేనత్త పిల్లలు)ని పెళ్ళి చేసుకోవడానికి మాత్రమే ఇక్కడి వాళ్ళు ఒప్పుకుంటారు. రమణతో పెళ్ళికి అతని పెద్దలు అంగీకరించలేదు. అతన్ని చిట్టిరంగనాయకమ్మ అనే ఆమెకి ఇచ్చి పెళ్ళి చేశారు. చలం గారి బంధువులలో కొందరు స్త్రీలు కట్టుబాట్ల నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకున్నారు. వారి నిజజీవిత కథల్ని నవలలలో చూపించారు. అనసూయ కథలో జరిగిన ఘటనలు పూర్వం మా కుటుంబంలోనూ జరిగాయి. ఆస్తి కోసం మనవాళ్ళు ఆడదాని న్యాయాన్ని ఏమాత్రం లెక్కచెయ్యరు.

    ReplyDelete
  17. ప్రముఖ మార్క్సిస్ట్ రచయిత రాచమల్లు రామచంద్రారెడ్డి గారు అన్నారు "చలం గారు లేకపోతే తెలుగు సాహిత్యం విశ్వానాథ సత్యనారాయణ వంటి వారి ఫ్యూడల్ భావజాలంతో లేదా గాంధేయవాదం లాంటి ప్రతిరోధక వేదాంతాలతో కుళ్ళిపోయేది" అని. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని బతికించినవాడు చలం. అందుకే నాకు చలం గారంటే అంత అభిమానం.

    ReplyDelete
  18. Nice review Manasa Garu.
    -Maitreyi

    ReplyDelete
  19. అనసూయ - ఇది మరో బ్రాహ్మణీకం కథ http://literature.mlmedia.net.in/2010/06/blog-post_04.html

    ReplyDelete
  20. స్త్రీ సహజ ముగ్ధత్వం అనే మాటకి చలానికి తెలిసినట్టుగా అర్ధం ఇంక ఏ మగాడికి తెలియదనుకుంట..

    ReplyDelete
  21. లలిత గారూ,
    మీరన్నది నాకు సరిగ్గానే అర్థం అయింది :). మీ బ్లాగ్ చాలా కలర్‌ఫుల్‌గా , ఆసక్తికరంగా ఉంది. బహుశా అక్కడే ఎప్పుడో మిమ్మల్ని కలిసి ఉంటాను.

    ఇక ఈ మాటను గురించి :"చలం స్త్రీలని అర్థం చేసుకున్నాడంటే ఒప్పుకోవాలనిపించదు."

    బ్రాహ్మణీకాన్నే తీసుకుంటే, కొన్ని సన్నివేశాల్లో వేరే యే రచయిత అయినా కథను కొనసాగించడానికి వేరే మార్గాన్ని ఎంచుకుంటాడేమో అనిపిస్తుంది. ముఖ్యంగా శేఖరం సుందరమ్మను ప్రలోభపెట్టే సన్నివేశాల్లో !అక్కడ స్త్రీ సహజమైన జాలిని, సహృదయాన్ని చలం చాలా ఖచ్చితమైన పదాలను వాడుతూ ప్రొజెక్ట్ చేసినట్టు నాకనిపించింది.

    అలాగే, ప్రేమలేఖల్లో కొన్ని పేజీలుంటాయి...ఉత్తరం చదవగానే ఏం చెయ్యాలో చెపుతూ. అది చాలా టిపికల్ రెస్పాన్స్ నా దృష్టిలో. అలాగే స్త్రీలో సహజంగా పురుషుడు తన పట్ల ప్రేమతో వ్యవహరించకపోతే జీవితంలో అన్నింటి పట్లా కలిగే వైరాగ్యం ఇతరత్రా కూడా చలం బాగా వ్యక్తపరచగలిగాడు అనిపిస్తుంది.

    ప్రపంచంలోని స్త్రీలంతా ఇంతే అన్నది కాదు నా ఉద్దేశం. సుందరమ్మలా మంచితనంతో జీవితాలు నాశనం చేసుకుంటారనీ కాదు. అయితే మనం ఎన్నో సార్లు కేవలం చూసి వదిలేసే సున్నితమైన అంశాలని అంత ప్రతిభతో రచనగా మలచడం చలానికే సాధ్యమైనదన్న భావనే నన్ను చలాన్ని పొగిడేలా చేసింది :)

    మరొకటి :" చలం చూపించిన చొరవకి ఆ ముగింపులు పూర్తి వ్యతిరేకం కదా!" - ఇది నాకూ అనిపించింది. అలాంటి రచనలూ ఎమైనా ఉన్నాయేమో వెదికి సాధించి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను.

    ReplyDelete
  22. heyyyyyyyyyyyy manasa,,how r u

    ReplyDelete
  23. Why none of the above referred to/ commented on the original H G Wells' Passionate Friends? The same has been adapted to screen by renowned director - David Lean. Dear Manasa Chamarthi, try for the book and through some more light on Chalam gari బ్రాహ్మణీకం

    ReplyDelete
  24. Dear Naresh Nunna,

    I was not aware about the original at all; Now that you have given a hint to me, I will try to get that book from friends. I will write a second review on Brahmaneekam then, and perhaps that makes it complete.

    Thanks for the details and suggestion.

    Regards,
    Manasa

    ReplyDelete
  25. జీవించడం, జీవితాన్ని అర్ధం చేసుకోవడం ఈ రెండూ వేర్వేరు విషయాలు అంటారు సంజీవదేవ్. నిజమే. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టిన వెంటనే జీవించడం నుంచి పక్కకు తొలుగుతారు. ఒక అనుభూతిగా జీవితాన్ని పరిమితం చేసుకునేలా ఉన్న శరీరం, మనసునుంచి - ఒక అనుభవం - ఒక అన్వేషణ- ఒక అంతర్యానం వైపు మళ్ళేందుకు చాల కాలం -దూరం ప్రయాణం అవసరమవుతుంది. స్త్రీ ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టెందుకు తొలి మలి నాగరికతలు సహకరించలేదు. ఆధునికాంతర తొలిపాదం ఆమెదే. కాని ఆమె అందుకు సిద్ధమా? సౌందర్యాన్ని, ప్రేమనూ స్వేచ్చగా తీసుకొని, ఇవ్వగలిగిన హృదయం ఆమెది. కాని, ఇవ్వడానికి ఒక పువ్వులొ ఉన్న సహజత్వం- నాగరికత నిర్మాణంలో లేదు. అది తీసుకునేందుకు -సంకెళ్ళను పెంచుకునేందుకు సర్వదా సిద్ధం.
    ఉన్న స్వేచ్చను తనదైన బంగారు సంకెళ్ళలోనో, పంజరంలోనో బంధించుకొని స్వేచ్చ అని అరుస్తుంది.
    ఇక చలం , "పిచ్చివాడు, కళాకారుడు, ప్రేమికుడి మానసిక స్థితి ఒకేలా ఉంటుందన్నట్లు" అందుకు ఆయనే ఒక ఉదాహరణ. ఏకకాలంలో మూడూ. కొందరికి అవి జీవితంలో భాగం, చలానికి ఆ మూడూ జీవితం. ఆయన పాత్రలు ఆయనే- మారుపేరు, ఒక స్వేచ్చ. అవి స్త్రీని ఆకర్షిస్తూనే ఉంటాయి.

    ReplyDelete
  26. Woman in any caste ,need not only brahmin will pray fall in the hands of cheats like Chandra Sekhar . Sundaramma need not be brahmin woman. Is Chalam wish to say , only brahmin woman is innocent like sundarama?

    ReplyDelete
  27. బ్రాహ్మణికం మీద రాసిన సమీక్ష ఎంత ఆలోచింపజేసిందో, దానికి స్పందించిన పాఠకుల వాఖ్యలు కూడా ఎన్నో దృక్కోణాలను చలం సాహిత్యంలో పరిచయం చేస్తూ ఆలోచింపజేస్తుంది. 'ఆవిర్భవ' పక్ష పత్రికలో పుస్తక దర్పణం ఉంది. దానితో పాటు ఆసక్తి ఉన్న సాహితీవేత్తలు మీ రచనలు radioavirbhava@gmail.comకి పంపవచ్చు. ఆవిర్భవ గత సంచికలు ,ఆవిర్భవ ఆన్లైన్ గ్రంధాలయం చదవాలనుకుంటే www.avirbhava.live ని వీక్షించవచ్చు. గత సంచికలను వెబ్సైట్ తో పాటు readwhere లో కూడా చదవచ్చు.https://www.readwhere.com/read/2420733/Avirbhava-sixth-Edition-November-16th-2019/Avirbhava-sixth-Edition-November-16th-2019
    ధన్యవాదాలు .

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....