గోరింటాకు గురుతులు - గుప్పెట్లో చందమామ


'గోరింటాకు ' అనగానే అమ్మ చేతి గోరుముద్ద గుర్తొస్తుంది. ' మంచాల మీదకి చేరకండి ' అని ఒకటికి పది సార్లు చెబుతూ, పిల్లలందరి కోసం విడిగా నేల మీద పక్కలు పరిచే అమ్మమ్మ జ్ఞాపకం మనసులో మెరుపులా మెరుస్తుంది. అరుణ వర్ణపు రెక్కలతో ఆకాశం భూమి మీదకి వాలబోయే వేళ, అరచేతుల్లో విచ్చుకునే చందమామల నవ్వులు చెరిగిపోకుండా ఉండేందుకు తల వెనక్కు చేతులు పెట్టుకుంటూ తిప్పలు పడ్డ రోజులు గుర్తొస్తే, హృదయాన్ని కదిలించిన సంతోషపు తరంగమేదో, పెదవుల మీద ఆనవాలు వదిలే తీరుతుంది.

ఆకుపచ్చని టోపీలు, ఉంగరం వేలిని వెక్కిరిస్తూ మిగిలిన వేళ్లన్నింటికీ కూడా ఉంగరాలు, నెలవంకలో పూర్ణ చంద్రులో, చుక్కలో బంతాకులో, ఏవైనా పర్లేదు, ఎలా ఉన్నా వాదం లేదు. ఆ రోజు లేలేత చేతుల రంగులు మార్చుకోవడానికి ఒక రూపు కావాలంతే! పసితనానికి ఎల్లల్లేని సంబరాన్ని కానుకిచ్చేందుకే కదూ, గోరింటాకు చెట్టు కొమ్మ కొమ్మకూ ఆకులు చిగురించేది!


'కదిలితే నే పెట్టనిక! ', 'ఇలా చెరిపేసుకుంటే అందమేమైనా ఉంటుందా తెల్లారాక?' , ' అయ్యయ్యో ! ఆ గోడల మీద మొండి మరకలయ్యేదాకా చేతులాడించడం ఆపేది లేదా..' ఇలా వేల అరుపుల మధ్య, మరీ చిన్నప్పుడైతే మొట్టికాయల మధ్య, గోరింటాకు ప్రహసనం పూర్తయ్యేది. అతి కష్టం మీద నిద్రలోకి జారుకునే ప్రయత్నాలు చేస్తుంటే, కలా మెలకువా కాని కలత నిదురలో, అకస్మాత్తుగా అరికాళ్ళల్లో చక్కిలిగిలి పుట్టినట్టనిపించేది. ఉలిక్కిపడుతూ కళ్ళు తెరవబోతే.." అసలు అరికాళ్లల్లో చిన్న చుక్క అయినా పెట్టుకుని తీరాలి; ముందే పెడితే అటూ ఇటూ తిరిగి ఇల్లంతా కృష్ణ పాదాలు వేస్తారని పెట్టలేదు.." అంటూ కాళ్ళ మీద జోజోలతో అమ్మ సంజాయిషీ మెల్లగా వినపడేది. మంత్రమేసినట్టుగా మళ్ళీ నిద్ర తన్నుకొచ్చేది.

అసలు కథలు మొదలయ్యేది తెల్లారాకే!

మేఘమాల లోగిలిలో కాంతి రేఖలు పాకించేందుకు నీలి కొండల కౌగిళ్ళ నుండి విడివడి, చిటారు కొమ్మల చాటుల నుండి వడివడిగా బయటికొచ్చే సూరీడికంటే ముందే, నేనూ లేచి కూర్చునేదాన్ని.

లేచాకా ఎర్రగా పండిన నా చేతులను పదే పదే ముద్దు పెట్టుకుని, కాస్త ఎండాక గోరింట నుండి వచ్చే వింతైన వాసనను బలంగా లోపలికి పీలుస్తూ, అక్క లేచే నిముషం కోసం కాచుక్కూర్చునే దాన్ని.

అక్క కూడా లేచాక, ఇద్దరం బాల్కనీలో ఒక మూలకు వెళ్ళి, ఎండిన గోరింటాకు మొత్తం ఓపిగ్గా విదుల్చుకుని, ఆ వెంటనే రెండు చుక్కల కొబ్బరి నూనె చేతులకు పట్టించుకునే వాళ్ళం. అలా చేస్తే గోరింటాకు ఎక్కువ కాలం నిలుస్తుందని చెప్పేవారు. అప్పుడు ఎదురెదురు కూర్చుని అరచేతులు పక్కన పెట్టుకుని చూసుకుంటూ నాదెక్కువ ఎర్రగా పండిందంటే నాదెక్కువ ఎర్రగా అని కాసేపు వాదించుకునేవాళ్ళం. కాసేపా వాదనలయ్యాక అక్క హఠాత్తుగా 'నీలాంటి అల్పులతో నేను వాదించను ' తరహా చూపొకటి విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోయేది. నేను యథా ప్రకారం బిక్కమొహంతో తయారు.

ఆ తర్వాత అమ్మ దగ్గరికి పరుగెత్తేవాళ్ళం.

అమ్మ కుడి చేతికి పెట్టుకునేది కాదు. మా అందరికీ తనే పెట్టడం వల్ల, ఆ చెయ్యి ఫలానా అన్న రూపమేం లేకుండా ఎర్రగా పండిపోయి ఉండేది. మాలాగా అంత జాగ్రత్తగా ఉన్నట్టూ ఎక్కువ సేపు ఉంచుకున్నట్టూ కూడా కనపడేది కాదు కాని, అమ్మ చెయ్యే మా చేతుల కంటే ఎర్రగా, అందంగా పండేది. చూడడానికి కూడా అదే చాలా అపురూపంగా ఉండేది.
ఆ రోజంతా అడిగిన వాళ్ళకీ అడగని వాళ్ళకీ చేతులు చూపించడంలోనూ, దగ్గరి వాళ్లనిపిస్తే చేతులను విడువని గోరింట వాసనను చూపించడంలోనూ నేను తలమునకలైపోయి ఉండేదాన్ని. బాగా కళ్ళు పెద్దవి చేసి నా చేతులు చూస్తూ ఉండిపోయిన స్నేహితులెవరైనా ఉంటే, కాస్త మిగిలిన గోరింటాకు మర్నాడు తెచ్చిస్తాలెమ్మని హామీలు కూడా ఇచ్చేసేదాన్ని. అపార్ట్‌మెంట్‌లో పక్కింటి వాళ్ళు ఎవరైనా, 'ఏమైనా పెళ్ళికి కానీ వెళ్తున్నావా మానసా ' అని చనువు కొద్దీ పలకరించినప్పుడు, 'ఊహూ, ఊరికే పెట్టుకున్నా" అని చెప్పడంలో, కారణం తోచనివ్వని కించిత్ గర్వం కూడా ఉండేదనుకుంటా. నా చేతులను నిశితంగా పరిశీలిస్తూ బళ్ళో వాళ్ళు , "మా ఇంటి వెనుక చెట్టుకు కాసే గోరింటాకు ఇంకా బోలెడు ఎర్రగా పండుతుంది తెలుసా" అని దీర్ఘాలు తీస్తే ఏ మాత్రం పట్టించుకోకుండా తమాషాగా భుజాలు ఎగరేసి పక్కకి వెళ్ళిపోయేదాన్ని.

అదే ఆ రోజుల గొప్పతనం! దేనికీ ఆలోచించక్కర్లేదు, అసలు ఆలోచించి మాట్లాడాలన్న స్పృహే ఉండక్కర్లేదు.

సంతోషమో, బాధో, గర్వమో గర్వభంగమో, కాస్తంత అసూయ, ఇంకాస్త దయ, కరుణ, కోరుకున్నంత సంతోషం, కోరికలే లేనట్టు ముంచెత్తే ప్రశాంతత, కావలసినది అడిగే ధైర్యం, ఎవ్వరూ అడగక్కర్లేకుండానే ఏమైనా ఇచ్చేయగల ప్రేమ, బోలెడంత విసుగు, వెన్నంటే ఒక్క ఊరడింపుతో వదిలిపోయే మొండితనం....

ఇన్ని తెలిసున్న వాళ్ళని పట్టుకుని, 'పాపం పసి వాళ్ళు, ఏమీ తెలీని వయసు ' అంటారు కదా, ఎందుకు ?
- అందునా అనేది ఎవరు ? వయసు పెరిగే కొద్దీ పై లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా వదిలించుకుని గొప్పవారైపోయిన వారు !
********************
చివరగా ఓ సరదా సంఘటన :

మొన్నీ మధ్య ఇంటికి వెళ్ళినప్పుడు, గోరింటాకు వారం వారం అమ్మేందుకు ఇంకా ఒకావిడ వస్తోందని విని ఆశ్చర్యపోయాను. సెలవుల్లో ఉన్నా కదా అని రెండు చేతుల్లోనూ చందమామలు పెట్టించుకున్నా, వేళ్ళకు టోపీలు కూడా ..!

"అసలు నువ్వు ఈ పాతకాలం డిజైన్ ఎందుకు పెట్టుకున్నట్టు, గోళ్ళన్నీ చూడు ఎంత పిచ్చిగా తయారయ్యాయో ? కనీసం ఇప్పుడైనా నెయిల్ పోలిష్ వేసుకోకపోతివి!!" - వారం తర్వాత ఆఫీసులో అడుగు పెట్టగానే ఒక స్నేహితురాలు వాదానికి దిగింది - " ఫలానా మాల్‌కి వెళ్తే, మొదట్లోనే ఒకడు కూర్చుని ఉంటాడు. ఐదంటే ఐదే నిముషాల్లో అరబిక్ డిజైన్ మోచేతుల దాకా పెట్టేస్తాడు. నువ్వక్కడికి వెళ్లనే లేదా ఇన్నాళ్ళూ ? "

మోచేతుల దాకా గోరింటాకా...ఛీ ఛీ!! మహా చిరాకు పడిపోతూ 'వెళ్ళలేద'న్నాను.

నే చేసిన ఘోర అపరాధానికి మూల కారణం అర్థమైనట్టుగా (కనిపెట్టినట్టుగా ) తల పంకించింది.
మరో రెండు సార్లు అరబిక్ గీతల్లో ఉన్న గొప్పతనాన్ని పెద్ద మనసు చేసుకుని నా కోసం వర్ణించి, తప్పకుండా వెళ్ళి తీరాలి సుమా, అని నన్ను హెచ్చరించి, ఆ అమ్మయి వెళ్ళిపోయింది.

నాలో నేను రహస్యంగా నవ్వుకుంటూ అనుకున్నా- ' నే మనసు పడి, ఏరి కోరి చందమామను నా గుప్పిట్లో పెట్టుకున్నాననుకుని సంబర పడుతుంటే, అర్థం లేని గీతలేవో ఐదు నిముషాల్లో కోన్‌తో బరికేసిన వ్యక్తి గురించి నా దగ్గర చెబుతుందేమిటి? నే వింటాననేనా? పిచ్చి పిల్ల!!"

ఈ సంతోషం నేను కోరి దక్కించుకున్నది, మళ్ళీ ఇంకొకసారి ప్రపంచం నిర్దాక్షిణ్యంగా వల పన్ని లాక్కెళ్ళేందుకు కాదు!

Better luck next time, baby! :)

**********************************

19 comments:

  1. చిన్నప్పుడు కరీంనగర్‌లో ఉండే రోజుల్లో గోరింటాకు పెట్టుకునేవాణ్ణి. కానీ పెట్టుకున్న వారం రోజులకి ఆ ఎరుపు రంగు కళ పోయేది.

    ReplyDelete
  2. చేతులే కాదు, వేలు కూడా ఎర్రగా అయ్యేలా పెట్టుకునేవాణ్ణి. డిజైన్‌లు ఏమీ లేకుండా ముద్ద పూర్తిగా చేతులకీ, వేళ్ళకీ కప్పేసేవాణ్ణి. రాత్రి పెట్టుకుని నిద్రపోయి ఉదయం ఎండేదాక చూసేవాణ్ణి.

    ReplyDelete
  3. దాదాపు అందరి గోరింటాకు జ్ఞాపకాలన్నీ ఇక్కడ అక్షరాల్లోకి వచ్చేసాయి.. ఎప్పుడు అంతే కదా చిన్నప్పుడు, అమ్మ చేతిలోనే చందమామ నిండుగా కనపడుతుంది..

    ReplyDelete
  4. అద్భుతం! ఎన్నెన్ని జ్ఞాపకాలనో కదిలించారు మానసా మీ పోస్టుతో.. గోరింటాకూ, పట్టీలూ, జడగంటలూ, మల్లె పూలూ, జాజులూ, అమ్మ చేతి ఆవకాయ ముద్దలూ.. వీటన్నీటి కోసమైనా చిన్నతనంలోనే ఉండిపోతే బావుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు! :)

    ReplyDelete
  5. మధుర కామెంటే నాదీనూ!

    గోరింటాకు రెండు చేతులకీ పెట్టేసుకున్నాక కపల్సరీగా ప్రతి సారీ వీపు మధ్యలో దురద పెట్టేది. అబ్బ, చచ్చిపోయేవాళ్ళం నిజంగా!

    పొద్దున్నే పండిన చేతులకు కాస్త కొబ్బరి నూనె పట్టిస్తే రంగు నిలవడమేమో గానీ నూనె మెరుపులో ఎర్రని గోరింటాకు మరింత కాంతులీనుతుంటే ఎంత బాగుంటుందో!

    మా ఇంట్లో పెద్ద గోరింట వృక్షమే ఉండేది. ఎంత పెద్దదంటే చిన్న పిల్లలుగా ఉన్నపుడు దానికి తాడుతో ఉయ్యాల వేసి ఊగేవాళ్ళం!

    దారే పోయే ఆడపిల్లలంతా "ఏమండీ, కాస్త గోరింటాకు ఇస్తారా" అని అడగటం,"కొమ్మలు విరక్కొట్టకుండా కోసుకోండి" అని అమ్మ చెప్పడం...భలే ఉండేది.

    మజ్జిగ,కాచు వగైరాలు వేసి మరింత ఎర్రగా పండే ఏర్పాటు చేయడం!

    నాకూ ఎందుకో, కోన్ గోరింటాకు పెట్టుకోవాలనిపించదు.

    ReplyDelete
  6. కరీంనగర్‌లో మా ఇంట్లోనూ గోరింట చెట్టు ఉండేది. షాప్‌లో గోరింట పేస్ట్ గానీ పౌడర్ గానీ కొనాల్సిన పని లేకుండా మేమే రుబ్బుకునేవాళ్ళం.

    ReplyDelete
  7. మాలిక లో కామెంట్ చూసి వచ్చాను. ఇప్పుడు నాకు అర్థమైంది. గుప్పిట్లో చందమామ/గారెలు/నక్షత్రాలు/చుక్కలు/ఆకులు, వేళ్ళకి రింగులు, వేళ్ళకి కాప్ లు .. :) తీసేసేదాకా హడావిడీ, తీసేశాక చేతి వాసనా, గోరింటాకు తో ఎర్రగా పండిన చేత్తో పెరుగన్నం తినటం.. ఇవే ఎక్కువ ఇష్టం!
    కోన్ తెచ్చి వేసే కొత్తరకం గజిబిజి డిజైన్లు అతిగా పండిపోయి నల్లబడిపోవటం పెద్దగా ఇష్టం లేక చాలా కాలమైంది పెట్టుకోక..

    టపా నిజంగానే పాత జ్ఞాపకాలని తట్టి లేపింది.

    ReplyDelete
  8. ఆబ్బాయినైనా మా అక్కతో పోటీపడి మరి గోరింతాకు పెట్టుకునేవాడిని., ఏదైనా పండగ వచ్చిందంటే చాలు మా పొలంలో ఉన్న గోరింతాకు కోసుకువచ్చి అక్కతో పాటు మా వాడ (కాలనీ) అంతా పంచిపెట్టేవాళ్ళం....

    ReplyDelete
  9. పోస్ట్ చాలా బాగుందండీ :-)

    ReplyDelete
  10. ఎంత చక్కటి గోరింటాకు గుర్తులు తట్టి లేపారండీ. గోరింటాకంత అందంగా ఉంది మీ టపా కూడా.

    ReplyDelete
  11. @ప్రవీణ్,దిలీప్, వంశీ - :):)
    @ మధురవాణిగారూ : ముందు ఇక్కడికి వచ్చెయ్యండి, ఇక్కడి నుండి చిన్నతనానికి కలిసి వెళ్లిపోదాం ;)
    సుజాత గారూ : మీరు ప్రతి చోటా మహా వృక్షాలూ తోటలూ అంటుంటే బోలెడు కుళ్ళుకోవాల్సి వస్తోంది మేమంతా :):). నూనె మెరుపుల్లో గోరింట ఎరుపు గురించి చెప్పుకోవాలంటే కవిత్వం తన్నుకు రావాల్సిందే! మీ కంపల్సరీ క్లాజ్ చూడగానే గట్టిగా నవ్వొచ్చేసింది.
    కృష్ణప్రియ గారూ : హహ, గారెలు మర్చేపోయాను నేను. కోన్ గోరింటాకు గురించి మనలో చాలా మందికి ఒకేరకం అభిప్రాయాలున్నాయంటే గమ్మత్తుగా ఉంది :). మాలికకీ, మీకూ థాంక్స్.
    జయ గారూ : ధన్యవాదాలు; :)
    వేణూ శ్రీకాంత్ : బోలెడు థాంక్యూలు.

    ReplyDelete
  12. నేను గోరింటాకు పెట్టుకోకపోయినా కొన్ని గోరింటాకు జ్ఞాపాకలను గుర్తుచేశారు. చిన్నప్పుడు మా చెల్లికోసం కొన్ని సార్లు గోరింటాకు కోసుకొచ్చిచ్చిన అనుభవాలున్నాయ్ నాక్కూడా :)

    //మొన్నీ మధ్య ఇంటికి వెళ్ళినప్పుడు, గోరింటాకు వారం వారం అమ్మేందుకు ఇంకా ఒకావిడ వస్తోందని విని ఆశ్చర్యపోయాను.//


    నాకూ ఆశ్చర్యంగానే ఉంది వింటుంటే. బస్సుల్లేని గ్రామాల్లోకూడా మెహంది కోన్ లు దొరికే రోజులివి.

    ReplyDelete
  13. పల్లెటూర్లలో కోన్స్ ఎక్కడ దొరుకుతున్నాయి? హైవే పక్క గ్రామాల్లో కూడా కోన్స్ దొరకవు. టౌన్‌లో అపార్ట్మెంట్లలో గోరింట చెట్లు పెరగవు కాబట్టి టౌన్‌లలో కోన్స్ కొంటారు.

    ReplyDelete
  14. Manasa garu., mee gorintaku gnyapakalu bagunay andi..Sravana maasam spl aa?
    - Chandana

    ReplyDelete
  15. @భాస్కర్ : నిజమే! గోరింటాకు ఆడపిల్లలకే కాక, కొంత మంది మంచి అన్నయ్యలకు కూడా గుర్తులు మిగిల్చిందన్నమాట. Nice!
    :)@ చందనా!
    కొంచెం అలాంటిదే. శ్రావణమాసంలో ఆషాడమాసం నాటి సంగతులు రాశాను; థాంక్స్.

    ReplyDelete
  16. గోరింటాకు పెట్టుకోవడానికి ఆడైతే ఏమిటి, మగైతే ఏమిటి? గోరింటాకు పెట్టుకునేది హస్త సౌందర్యానికే కదా. అందం మగవాళ్ళకి అవసరం లేదా?

    ReplyDelete
  17. నేను కూడా చిన్నప్పుడు పెట్టుకునేవాణ్ణి గోరింటాకు. వయసు పెరెగేకొద్దీ మగపిల్లాడివి గోరింటాకేంటి అనే ఫ్రెండ్స్ మాటలు ముదిరి, గోరింటాకు పెట్టుకుని ఓపిగ్గా కూచోలేను బాబోయ్ అన్న ఆలోచన బలిసాకా మానేశాను.

    ReplyDelete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....