ముత్తెపు ముంగిట

"ముగ్గు" అనుకోగానే, అబ్బే! మన కాలానికి సంబంధించిన సంగతి అస్సలు కాదనిపిస్తుంది. తెల్లవారుఝామున ఐదు నిముషాల సమయం దొరికితే, ఎంచక్కా ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెబుతూ కాఫీ వేళలు పొడిగించుకోవాలని అనిపిస్తుంది కానీ, ముగ్గులేం వేయాలనిపిస్తుంది? "ఆవుపేడా తెచ్చి అయినిళ్ళు అలికి, గోవుపేడా తెచ్చి గోపురాలలికి.." అని పాడుకుంటూ ముగ్గులేసుకోవడానికి ఎవరికైనా వీలెక్కడుంటోందీ? నేను ఆఖరు సారి ముగ్గులెప్పుడు వేశానో కనీసం గుర్తు కూడా లేదు. బహుశా బడికెళ్ళిన రోజుల్లో వేశానేమో.అది కాదంటే ఎదురింటి పిల్లలతో కలిసి న్యూఇయర్ కోసం రంగవల్లులేవో వేసి ఉంటాను. అటుపైన  ఆఫీసులో "పూక్కొలం" (మళయాళీల పండుగ) జరిగినప్పుడు, అఖిల 'నాకు తోడురావూ' అని బతిమాలితే రంగులు నింపి వచ్చేశాను. అంతే. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ మోజేమిటీ అనా? చెప్తాను.

మన చుట్టూ ఉన్నవాళ్ళు మనమెట్లా ఉండాలో, లేదా ఎట్లా ఉండకూడదో నేర్పుతారని అంటారు కదా. ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది. ఈ ఫ్లాట్స్‌లోకి వచ్చి రెండేళ్ళు అవుతోంది. మా ఫ్లోర్‌లో వాళ్ళతో కూడా ఎప్పుడూ అరకొర నవ్వులే. అపార్ట్మెంట్ పార్టీల్లో, సమావేశాల్లో, లంచులూ, డిన్నర్లూ అన్నప్పుడో కలిసి కాసేపు కబుర్లు చెప్పుకుని రావడమే తప్ప, విడిగా ఎప్పుడూ అంత కబుర్లు చెప్పుకున్న దాఖలాల్లేవు. పగలూ రాత్రీ తేడాల్లేకుండా నాలుగు కుటుంబాల వాళ్ళమూ తలుపులు బిడాయించుకుని కూర్చుంటాం. అనుకోకుండా కొన్నాళ్ళ క్రితం, మా ఎదురు ఫ్లాట్‌లోకి వాళ్ళ అమ్మమ్మగారు వచ్చారు. అమ్మమ్మలు మాత్రమే నవ్వగలిగే ఆప్యాయమైన నవ్వొకటి నవ్వేవారు, ఎవరు కనిపించినా. ఆవిడను చూస్తుంటే, ఆవిడ కట్టుకునే మెత్తమెత్తని చీరల కంటే మెత్తగా వినిపించే ఆవిడ తమిళ మాటలు వింటుంటే, మా అమ్మమ్మే గుర్తొచ్చేది. ఆవిడ వచ్చిన రెండు మూడు రోజులకు కాబోలు గమనించాను - వాళ్ళ గుమ్మంలో తెల్లగా నవ్వుతోన్న నాలుగు గీతల ముగ్గుని. అది మొదలూ, ప్రతి రోజూ ఆఫీసుకు వెళుతూ, ఇంటికి తను తాళం వేస్తుంటే నేనూ, నేను లిఫ్ట్ బటన్ నొక్కుతుంటే తనూ, ఆవిడ వేసిన ముగ్గును ఆసక్తిగా చూస్తూ దాని గురించి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళడం అలవాటుగా మార్చేసుకున్నాం. ఆవిడ ఊరెళ్ళినప్పుడల్లా, ఆ ముంగిలి బోసిగా కనపడుతూ ఉండేది. పెయింట్ చేసిన ముగ్గును మినహాయిస్తే, మిగిలిన మూడు గుమ్మాల పరిస్థితీ ఏడాది పొడుగునా అంతే కదా అనుకుంటే చిరాగ్గా అనిపించేది. కానీ బద్ధకానిదే కదా జయం ;).

అలా రోజూ ఆహ్లాదపరచిన ఆవిడ ముగ్గో మరేదైనానో...కారణమేమిటో స్పష్టంగా తెలియదు కానీ, ధనుర్మాసం మొదలవ్వగానే ముంగిలి ముగ్గులతో కళకళ్ళాడాలని నాకో పంతం పుట్టుకొచ్చేసింది. ఏనాటి ముగ్గులు మహాప్రభో, వేయడానికి ముచ్చటపడ్డానన్న మాటేగానీ,  ఒక్కటి కూడా గుర్తు రాలేదు. ఇలా కాదని, రెండో రోజు ఓ కాగితం పట్టుకుని నేర్చుకుందామని కూర్చున్నాను. అమ్మ ఏం వేసిందో గుర్తు చేసుకుందామని ప్రయత్నించాను. ఏం వేసేది, ఆ మెలికల ముగ్గొకటి కళ్ళు మూసి తెరిచేలోగా వేసి వెళ్ళిపోయేది. ఆ మెలికల్లో దాగున్న చుక్కలెక్కెట్టేసరికి పుణ్యకాలం కాస్తా దాటిపోతుందేమో నన్న భయం కలిగింది. ఐదారు వృత్తాలు అలవోకగా ఒకదానితో ఒకటి ముడిపెడుతూ గీసి, వాటిలో నుండి ఓ పద్మాన్నో, మరేదైనా పూవునో మాంత్రికురాలిలా సృజించేది. అది ఎంత చిన్న ముగ్గవ్వనివ్వండీ, తన చేతులతో నాలుగు బంతిపూరేకులు తెచ్చి ఆ ముగ్గుల మధ్యలో అలా చల్లీ చల్లగానే, " భూదేవంతా ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో/ ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియ్యల్లో" అని పాడి తీరాల్సిందే. ఇంకొన్నిసార్లు 'ఈ మాసమంతా గీతల ముగ్గులేయాలి లేలేమ్మ'ని, తన వేళ్ళ సందుల్లోంచీ ముగ్గు పిండిని లయగా వదిలేస్తూ, బ్రహ్మాండమైన రథాన్ని రెండంటే రెండే నిముషాల్లో సృష్టించి, దాన్ని తృప్తిగా చూసుకుని తిరిగి తన పనుల్లో మునిగిపోయేది. నేను గానీ అలా వేయాలని ప్రయత్నిస్తే "నాంచారమ్మ ముగ్గు, నక్షత్ర దర్శనం" అని కొత్త సామెతలు పుట్టినా ఆశ్చర్యం లేదు. 

వంటలకైనా ముగ్గులకైనా ఉజ్జాయింపు కొలతలే తప్ప నాకూ మా అక్కకీ ఉన్నట్టు నోటు పుస్తకాలేమీ ఉండవనీ తెలిసీ, మెల్లిగా అడిగానో రోజు.."ఏమ్మా, ఎక్కడైనా రాసి దాచుకోకూడదూ ఇవన్నీ?" అని. విచిత్రంగా చూసింది , " నాలుగు రోజులేస్తే అవే వంట బడతాయ్, మళ్ళీ రాసేదేవిటీ, పట్టుమని ఐదేళ్ళు లేని చంటిది రెండుసార్లు చూసి ముగ్గులు ఒంటిచేత్తో వేసేస్తోంటే!" అని నా ఆశల మీద నీళ్ళు చల్లేసింది. ఇలా లాభం లేదని అంతర్జాలాన్ని ఆశ్రయించి, నచ్చినవేవో నేర్చుకుని, రోజూ పొద్దున్నే ముగ్గులేయడం మొదలెట్టాను.

మొదటి రోజు తను అడుగు బయటపెట్టబోతూ ఉలిక్కిపడి ఆగి, ఫకాలున నవ్వబోయి, అలా చేస్తే జరగబోయే పరిణామాలు గుర్తు తెచ్చుకుని కాబోలు తమాయించుకుని, "పొద్దున్నే ఎంత కష్టపడ్డావూ" అని వేళాకోళం ధ్వనించకుండా బాగా జాగ్రత్తగా చిలక పలుకులు అప్పజెప్పి వెళ్ళిపోయాడు. నేను గుడ్ల నీళ్ళు కుక్కుకుని మర్నాటి కోసం ఎదురు చూశాను. ఓ వారం పదిరోజులు అప్పుడే నడక నేర్చుకున్న వాడి బుడిబుడి నడకల తడబాటులా, అప్పుడప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్న పసి రాతల్లోని అమాయకత్వంలా, నా ముగ్గులు నాకే చిత్రంగా అనిపించేవి. ఓ పక్షం దాటాక, మెల్లిగా చేతుల్లో కుదురొచ్చింది, కొత్త ముగ్గులు కూడా వచ్చాయి. పట్టు కుదిరాక, పట్టుపావడా పరుచుకు కూర్చున్న అందమైన అమ్మాయిలా ముగ్గులు భలే ముచ్చటగా అనిపించడం మొదలెట్టాయి. మా ఎదురింటి పదమూడు నెలల పసివాడు, ఆ చుక్కల ముగ్గులు చూసి తప్పటడుగులతో గడప దాటి రావడం మొదలెట్టాడు. వాడు ముగ్గు తొక్కేస్తాడన్న భయంతో, ఆ 'ఖారే' కుటుంబంతా వాడి వెనుకే పరుగెత్తుకు వచ్చినా, నాకు మాత్రం వాడు ముగ్గు తొక్కి తడి నేల మీద నడుస్తోంటే కృష్ణ పాదాలే చూసినంత సంబరంగా అనిపించేది. మునివేళ్ళపై కూర్చుని ముగ్గులేసుకుంటున్న నా భుజాన్ని వాడి లేలేత చేతులకు ఆసరగా అట్టేపెట్టుకుని, ఆ పసితనపు స్పర్శతో నన్ను తనవైపు తిప్పుకుని, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి వాడు నవ్వే ఆ నవ్వు, "వదనం మధురం, హసితం మధురం, మధురాధిపతేరఖిలం మధురం" అన్న పాటను నా పెదవుల మీదకు తీసుకొచ్చేది. అవతల ఇంటి తమిళమ్మాయి, పొద్దున్నే పాల పేకెట్లు తీసుకోవడానికి వచ్చి, ఆగి, "వావ్, రోజూ మీరే వేస్తున్నారా?" అని అడిగితే మొహమాటంగా నవ్వి చెప్పాను..."మీ అమ్మమ్మగారి ముగ్గులు చూసీ చూసీ.." అని. ఆవిడ వెంటనే పరుగుపరుగున ఇంట్లోకెళ్ళి, వాళ్ళ అమ్మమ్మను తీసుకొచ్చి చూపించారు.పరమానందంగా మనవరాలి మాట విని, బోసి నవ్వుతో ఆవిడ అందించిన అభినందనలని ఏ భాషలోకి తర్జమా చేయగలను? మామూలుగా మారు మాట లేకుండా పని చేసుకు వెళ్ళిపోయే హవుస్ కీపింగ్ వాళ్ళు కూడా "మేడం, ఈ ముగ్గు చేత ఐతా లేదా మేడం" అని కన్నడా తెలుగూ కలిపి, నేల మీద సుద్ద ముక్కలతో కొత్తవి గీసి చూపించి నేర్పించడం మొదలెట్టారు. మేము శనాదివారాల్లో బయటకు వెళ్ళి, సోమవారం ఆలస్యంగా రావడం వల్ల ముగ్గు లేకపోతే, "ఒంట్లో బాగుండడం లేదా మేడం" అని చనువుగా పరామర్శ చేస్తున్నారు.

ఒక్క ముగ్గు ఇంత మందిని ఇంత సహజంగా దగ్గర చేసిందా అనుకుంటే భలే ఆశ్చర్యం వేసింది. ఈ తెలతెల్లని ముగ్గు, లోకానికిన్ని కొత్త రంగులద్దగలదా అని ఓ చిన్నపాటి సందేహం, సంతోషం. మొన్న నా ప్రాణస్నేహితుడి పెళ్ళి అని, హైదరాబాదు వెళ్ళినప్పుడు, అమ్మమ్మ పక్కలో ఒదిగి పడుకుని, "ఏవైనా ముగ్గులొస్తే చెప్పవే , నీ పేరు చెప్పుకు వేసుకుంటాను" అని ఆవిడ చంద్రహారాన్ని సరిజేస్తూ అడిగితే, దాన్ని సర్దుకుంటూ లేచి కూర్చుని, లేని ఓపిక తెచ్చుకుని, మా మావయ్య కూతుర్ని పిలిచి, కొన్ని కాగితాలు తెమ్మని పురమాయించింది. అదింకా తెలివైనది. "బామ్మకి వచ్చిన ముగ్గులన్నీ నాకు నేర్పించేసింది. ఇదుగో, కోడూరు కుటుంబపు ముగ్గు, అత్తయ్యలందరికీ వచ్చిన ఏకైక ముగ్గు, నీకెలాగూ ఇదే నేర్పిస్తుంది" అంటూ ఒకటి చూపించింది. "బానే ఉన్నట్టుందే, సరి, నువ్వే నేర్పించు మరి" అని బుద్ధిగా అడిగేసరికి, నాకన్నా పదేళ్ళు చిన్నదైన గుంట, "చుక్కలన్నీ చక్కగా పెట్టి పిలువ్ నన్ను, ఎలా కలపాలో నేర్పిస్తాను" అని తుర్రుమంటూ పారిపోయింది. నడుం విరిగిపోయింది, అన్నీ లెక్క తప్పకుండా, వరుస చెడకుండా పెట్టేసరికి.

నా సరదా తీరిపోయిన రోజు, ప్లాస్టిక్ ముగ్గుల పేపరు నన్నెలాగూ కాపాడుతుంది. అందాకా ఎదురింటి చంటోడి నవ్వులూ, అమ్మమ్మ పలకరింపులూ, ప్రతి ఉదయానా ప్రాణసఖుడు కళ్ళతోనే జీవితం మీద చేసే మెరుపు సంతకాలూ- ఎంత బాగుంటాయీ!


12 comments:

  1. హే..సేం పించ్! (సరిగా ముగ్గు వెయ్యలేనందుకు కాదు..ముగ్గుపై ప్రేమకి :)) అపార్ట్మెంట్ అయినా సొంతింటి ప్రేమతో ఈసారి నేనూ నెల పట్టాను. నించునిలేవలేనమ్మ వంగుని తీర్థానికి వెళ్ళిందన్నట్లుగా, నడుం నెప్పితో రోజులో సగభాగం మంచానికి అతుక్కుపోయినా, మధ్యలో ఆపకూడదనే పంతం కొద్దీ పీట వేసుకుని మరీ నెల పూర్తిచేసాను. అమ్మని తలపించే మా ఎదురింటి ఆంటీ ఒకటే గొడవ.. నన్నడిగితే నే పెడతాను కదా మీ గుమ్మంలో ముగ్గు..నువ్వింత అవస్థ పడాలా? అని. అబ్బే గుమ్మంలో నేనే వెయ్యాలి అనండీ...అనేసి వేసేదాన్ని..:) ఆఖరి రోజు బ్రతికానురా బాబూ..అయిపోయింది అని హాయిగా ఊపిరి పీల్చుకున్నా!
    ఇంతకీ నెలచివరికన్నా ముగ్గు మంచిగా వచ్చిందా అమ్మడూ:D

    ReplyDelete
  2. ముగ్గు పోస్ట్ కదా , జెంట్స్ కామెంట్ పెట్టచ్చో లేదో అని ఒకింత ఆగాను :) , బాగా రాసారండీ ! ముగ్గు అంటే యండమూరి ఆనందో బ్రహ్మ లో మందాకినే గుర్తుకొస్తుంది నాకు :) థాంక్స్ ఫర్ ది పోస్ట్

    ReplyDelete
  3. ఆసక్తిగా పెట్టిన చుక్కలు ఆపేక్షలు కలబోశాయన్నమాట.

    ReplyDelete
  4. *తృష్ణగారూ, మీ పట్టుదలకు జోహార్లు :)). కొంచం ఇంచుమించుగా నాదీ అదే కథ ;). ఆఖరు ముగ్గూ...మ్మ్మ్...బాగా వచ్చినట్టే అనుకుందాం :)))

    ** సురేషన్నయ్యా..థాంక్యూ థాంక్యూ! :))

    ** వంశీ గారూ - మందాకినిని భలే గుర్తు చేశారు.. నాకేమిటో మళ్ళీ చదవాలనిపిస్తోంది. అన్నట్టూ ముగ్గులు అమ్మాయిల టాపిక్కే గాని, అక్షరాలు కావు కదండీ..సందేహించకుండా మాట్లాడుకోవచ్చు మనం :))థాంక్యూ!

    * జ్యోతిర్మయి గారూ, thank you so much! మీ బుజ్జిపండు బాగున్నాడని ఆశిస్తాను. :))

    ReplyDelete
  5. మీ 'అనుభవాలూ, జ్ఞాపకాలు ' అంశంలోని టపాలు చదివినప్పుడల్లా మీరు నన్ను నిజంగానే పాత జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళిపోతారండీ :-)

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ గారూ, ఎలా ఉన్నారు? మధ్య మధ్యలో అజ్ఞాతవాసం కానీ చేస్తున్నారా? :) మీ మాటలు వినడం సంతోషానిచ్చింది. థాంక్యూ.

      Delete
  6. వంశీ సేం పించ్.ఓహ్ మందాకినీ,యాజీ మళ్ళీ ఇంకోసారి చదవాలి.

    మీ రాతలు కూడా అ చుక్కల ముగ్గుల్లా భలే ఉంటాయండీ నిజం

    ReplyDelete
    Replies
    1. పప్పు సర్, థాంక్యూ! :) యండమూరి చాలా నవలలు ఇప్పుడు చదువుతుంటే "అబ్బా, ఏం క్లాసులు!!" అనిపిస్తాయి నాకు. (వయసు ప్రభావం :-) ) ఆనందో బ్రహ్మ "కొంతవరకు" ఆ భావానికి మినహాయింపు అనే అనిపిస్తుంది.

      Delete
  7. Mahadev PisipatiTuesday, May 13, 2014

    ha ha ha....."నాంచారమ్మ ముగ్గు, నక్షత్ర దర్శనం" bagundi....

    ee tapa printout teesi ...maa intiki teeskellali :):)

    ReplyDelete
    Replies
    1. కొత్తదేం కాదూ :)) నేనో మా అక్కో వంట చేసినప్పుడు మా నాన్నగారు అనే మాట ఇది :)) - "నాంచారమ్మ వంట, నక్షత్ర దర్శనం" అని ;)

      Delete

అల

       అలల పొత్తిళ్ళలో      అల్లరై నీ నవ్వు అలల రెక్కల మీద వెన్నెలై నీ చూపు అలల ఒత్తిళ్ళలో నలిగి నీ కేరింత అలల ముద్దుల తడిసి తీరాన్ని చేరాక....