మహామహా హడావుడిగా సాగిపోయే జీవితంలో నన్నిలా పట్టి కూర్చోబెట్టి మాట వినేలా చేసేది వీడొక్కడే! మంతనాలు, బుజ్జగింపులు, కథలు ఏమీ చెయ్యలేని పనిని చాలాసార్లు నా మోకాలిదండ చేసేస్తుంది. ఏమైంది నాన్నా... అని గడ్డం లేపి అడిగితే, వాడేమీ చెప్పని క్షణాల్లో కూడా, ఏమైందో చూచాయగా తెలుసుకునే శక్తి ఎలా అబ్బిందో, నాకూ ఆశ్చర్యమే. స్నానం చేయించేటప్పుడు బయటపడ్డ భుజాల మీది దెబ్బలో, పక్కింటావిడ నిన్న ఆటల్లో వీళ్ళంతా ఏం చేశారో తెలుసా మానసా అని వివరంగా చెప్పినప్పుడో, అంతెత్తున అరుపులతో పిల్లలంతా కోలాహలంగా ఇంటిలోకొచ్చి నెమలి కంఠం రంగున్న పక్షి డాబా మీద నుండి పోవట్లేదని నన్ను చుట్టుముట్టి అబ్బురంగా చెప్పినప్పుడో, పిల్ల జనాభా అంతా కలిసి ఒకే పాట ముక్త కంఠంతో పాడినప్పుడో - నాకు తెలీకుండా ఇంత పాట ఎప్పుడు నేర్చుకున్నాడు, ఎక్కడ తిరిగొచ్చాడు, ఇన్ని అల్లర్లు నా కంట పడకుండా ఎలా చేస్తున్నాడు, ఇన్ని దెబ్బలు నాకైనా చెప్పకుండా ఎలా ఓర్చుకున్నాడని దిగులుగా, ఆశ్చర్యంగా వాణ్ణి చూసుకుంటాను. పరదాలను ఎగరకొడుతూ చలిగాలి మా గదిలోకి పాకే రాత్రుల్లో నాకు దగ్గరగా జరిగి, నా పొట్టని కరుచుకుని పడుకుని వాడు కబుర్లు చెబుతున్నప్పుడు, ఆ చీకట్లో వాడి వెన్ను నిమురుతూ, ' చిన్న కన్నా! డాబా మీదకి ఒక్కడివే పోకూడదు, చివర్లలో అసలే ఉండకూడదు ' అనో, ' ఎన్ని ఆటలు ఆడుకున్నా, దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా ఉండాలి నాన్నా ' అనో, ' ఎవ్వరింట్లోనూ టివి చూడొద్దు..' అనో చెప్తుంటే... మెల్లగా గొణిగినట్టుగా అడుగుతాడు, ' నీకన్నీ ఎలా తెలిసిపోతాయమ్మా...' అని. పసితనం ఇంకా వదలని వాడి మెత్తటి బక్క ప్రాణాన్ని ఇంకా దగ్గరకు లాక్కుంటూ అనుకుంటాను...చిన్నప్పుడు అమ్మ గురించి నేను కూడా అచ్చు ఇలాగే అనుకునేదాన్నని.
ఫ్రెంచ్ ఫ్రైస్
ఏళ్ళు గడిచే కొద్దీ అన్నీ మారిపోయినట్టు ఉంటాయ్ కానీ మారిన వాటిల్లో కూడా పాత పేటర్న్స్ కనపడినప్పుడు ఒక చిత్రమైన ఫీలింగ్. వేసవి సెలవల్లోనూ, బడులయ్యాక సాయంకాలాల్లోనూ, పిల్లలని చూస్తే అలాంటివే ఏవో గుర్తొస్తూ ఉంటాయ్. ఆటల వేళ అయితే ఎంతటి మండుటెండలైనా పట్టని అదే పిచ్చితనం. అకాలపు వానల్లో ఆటలొద్దు పడతార్రా అని అరిచి గీపెట్టినా వినకుండా వాన నీళ్ళు నిలిచిన కారిడార్ లో పరుగులుగా ఆడటంలో అదే మొండితనం. ఊరెళ్ళి వస్తూనే చెప్పులైనా విప్పకుండా పక్క ఫ్లాట్ స్నేహితులను కలుసుకోవాలని అదే పాత ఆరాటం. కొత్తగా కొనుక్కున్న ఆట వస్తువులో కొత్తగా నేర్చుకున్న విద్యలో, ఎవరైనా వీడికి ఇచ్చిన బహుమతులో మిత్రులతో చకచకా పంచుకోవాలన్న ఉత్సాహంలో, అదే అనాది స్నేహపరిమళం. కంది తోటల్లో కిష్ట నీళ్ళలో మమ్మల్ని తిప్పి ఆడించలేకపోయినందుకు మా నాన్నగారు అప్పుడప్పుడూ దిగులుపడేవారు. మాకు పట్టేది కాదు. ఇప్పుడు వీడూ ఆరుబయట ఇంకాస్త స్వేచ్ఛగా ఆడుకుంటే బాగుండనీ, ప్లే ఏరియా అని గిరి గీయని లోకంలో వాడికి వాడుగా హాయిగా మసలుకుంటే బాగుండనీ అనిపిస్తుంది. చెబితే, వాడూ పెద్ద పట్టించుకున్నట్టు ఉండడు. వాళ్ళ సంతోషాలు ఎక్కడ దాచిపెట్టుకుంటారో, వాళ్ళే తెచ్చి చూపించేదాకా మనం కనిపెట్టలేం. బహుశా ఈ పిల్లల ప్రపంచమొకటి ఎప్పుడూ ఇలాగే సమాంతరంగా నడుస్తూ ఉందేమో. మళ్ళీ నా గమనింపులోకి వచ్చింది మాత్రం పిల్లాడు గడప దాటాకే.
సరిగ్గా ప్రహ్లాద్‌కు ఆరు నెలల వయసున్నప్పుడు ఈ అపార్ట్‌మెంట్‌కు వచ్చాం. మొదట్లో గుమ్మం దాటినా నేనూ వెనుకవెనుక వెళ్ళిపోయేదాన్ని. ఆటలకు కిందకెళ్ళినా మావయ్యగారిని తోడు పంపాకే నేను లోపలికెళ్ళేదాన్ని. అలా అలా ఏడేళ్ళయ్యాయా, ఇక ఇప్పుడు అడుగు బయటపెడితే వీళ్ళంతా మనవాళ్ళే లెమ్మన్న ఫీలింగ్ నాకూ, ఈ మొత్తం అపార్ట్మెంట్ అంతా మాదే అన్న ఫీలింగ్ పిల్లమూకకూ వచ్చేసింది. సెక్యూరిటీ గార్డ్ పనిని కాస్త కాస్తగా తగ్గించేసుకున్నాను. మనం వెంట తిరగని వయసొస్తే, వాళ్ళకు ఊరు చాలనంత స్వేచ్ఛ. ఇప్పుడు బడి నుండి రాగానే బట్టలు మార్చుకుని, ఏమైనా తిని ఆటలకు వెళ్ళిపోతారు. ఐదూ ఐదున్నరకు మళ్ళీ పాలు తాగడానికి రండ్రా అని అమ్మలం కేకలు పెడుతూ ఉంటాం. తాగి మళ్ళీ పరుగు! ఎప్పటికో అలసి సొలసి వాళ్ళింటికి చేరాకా, స్నానం, చదువు, భోజనం, నిద్ర. ఇదొక చక్రం.
చిన్న ప్లే ఏరియా మాది. అక్కడ మరీ పసివాళ్ళు తప్ప ఎవరూ ఆడుకోరు. కాస్త పెద్దపిల్లలంతా, ఆ పూటకి ఎవరి ఫ్లోర్, ఎవరి ఇల్లు సౌకర్యంగా ఉందనిపిస్తే ఆ ఇంట్లోకి దూరిపోతూ ఉంటారు.
సరే, మొన్నొకసారి ఏమయిందీ..మా ఫ్లోర్లో మా ఇంటి పక్కన ఉన్న ప్లేస్‌లో క్రికెట్ ఆడటం మొదలెట్టారు. అంతా పదీ పదకొండేళ్ళ లోపు పిల్లలు. లిఫ్ట్ ఆపేసుకుని దాని ముందు వికెట్లు పెట్టుకుని ఆడుతున్నారు. మధ్యాహ్నమనగా అన్నం తిని ఆటకుపోయిన వాళ్ళు సాయంత్రం ఐదవుతున్నా రామని గోల.
పిలిచీ పిలిచీ "ప్రహ్లాద్, నువ్విక రెండు నిమిషాల్లో రాకపోతే దెబ్బలు పడిపోతాయ్!" గుమ్మం ముందు నిలబడి గట్టిగా చెప్పాను.
"అమ్మా ప్లీజ్"
"ఆంటీ ప్లీజ్"
"లాస్ట్ ఓవర్ ఆంటీ.." మొత్తం పిల్లలంతా నా మీదకొచ్చేశారు.
మరీ అంత రాకాసిలా ఏం మీద పడనూ! మొహమాటపడి వెనక్కి తగ్గాను కానీ, పది నిమిషాలాగి మళ్ళీ పోయాను.
"ఏమైనా తిని వెళ్ళండిరా..."
మళ్ళీ మూకుమ్మడిగా దాడి. ఒక్కణ్ణైతే అడగగలం, అదిలించి కోప్పడి ఇంటికి లాక్కు రాగలం. అంతమంది పిల్లలు ముద్దు మొహాలతో బతిమాలే కళ్ళతో చుట్టుముడితే నిజం కోపం సరే, అసలు నటనైనా నావల్ల కాలేదు.
ఏదో నా అదృష్టం పండి ఇంకో ఇద్దరు అమ్మలు కూడా అదే వేళకి బయటకొచ్చి కేకలేయడంతో అంతా నీరసపు మొహాలతో అయిష్టంగా ఇళ్ళకు కదిలారు.
మా వాడు లోపలికొస్తూనే " అమ్మా! బనానా వద్దు నాకు. రోజూ అరటిపళ్ళు తింటావ్, నువ్వేమన్నా కోతివా అంటున్నారు; నాకీ రోజు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి" హుకుం జారీ చేశాడు.
ఉడికించి ఉంచిన స్వీట్ కార్న్ ఒలిచి చిన్న గిన్నెలో వేసి ఇచ్చాను, ఈ లోపవి తింటూ ఉండమని.
బాత్రూం లో నుండి చేతులు కడుక్కుని వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడో లేదో,
"బ్రో..." గుమ్మం దగ్గర నుండి కేక.
ప్రణద్ కులకర్ణి. మా వాడి దోస్త్.
"అప్పుడే తినేశావా?" ఆశ్చర్యంగా అడిగాను.
"I had a big glass of milk and AND a laddoo" గర్వంగా చెప్పాడు.
"కొంచం స్వీట్ కార్న్ తిను.." గిన్నె ఇచ్చాను. "నో ఆంటీ, I just had" తిప్పి ఇచ్చేశాడు.
"My mom is preparing french fries Da, you can eat them."
"ఐ హాడ్ దెం లాస్ట్ వీక్ బ్రో.."
ఇక పుట్టి బుద్ధెరిగినప్పటి నుండీ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తిన్నారో, ఎన్నెన్ని తిన్నారో, తినగలరో కుర్చీలు తోసుకుని ఒకరి మీదకు ఒకరెళ్ళిపోయి మరీ ఉత్సాహంగా చెప్పుకుంటున్నారు.
వాడికివి ఇష్టమని నాకు తెలుసు. ఇష్టమైనవేవైనా తినేటప్పుడు వాటిని పట్టుకునే పద్ధతీ...ఇష్టంగా కొరుకుతూ చప్పరిస్తూ తినే పద్ధతీ నాకు చూడముచ్చటగా ఉంటుంది. ఆ కాసేపూ వాడూ మహా బుద్ధిమంతుడైపోతాడు. ఎడమ చేతి వేళ్ళని రకరకాలుగా గాల్లో తిప్పుతూ నాకు రేటింగ్స్ కూడా ఇస్తాడు. పిడికిలి బిగిస్తే ఒక రేటింగ్, ఓ లా చూపెడితే ఇంకోటి. వి లా చూపెడితే, అరచేయంతా విప్పితే- ఒక్కో దానికీ ఒక్కో లెక్క. ఆ సంబరం కోసమే శుక్రవారం ఈ బంగాళాదుంపలన్నీ నిలువుగా శ్రద్ధగా తరిగి, నీళ్ళలో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి, శనాదివారాలు వేయించి ఇస్తూంటాను.
సరే, ఆ రోజు ఇద్దరు పిల్లలకీ ఒక వాయ వేశాను.
కెచప్ ప్లేట్లో వేసుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. చెరి సగం ఇచ్చాను.
నేను రెండో వాయకు తీస్తుండగానే మా వాడు కిచెన్ లోకి వచ్చి నన్ను కిందకు గుంజి, "అమ్మా నాకింకా కావాలి" అని రహస్యంగా చెప్పాడు.
ఇస్తాను పండూ, వెళ్ళి తిను..బుజ్జగించి పంపేశాను.
"My mom will give us more Da" బిగ్గరగా అనౌన్స్ చేశాడు
వార్నీ!
వీళ్ళిద్దరూ పెట్టించుకు తింటూడగానే ఇళ్ళకు వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరిగా ఏదో ముంచుకు పోతునట్టే పరుగుపరుగున వచ్చేస్తున్నారు.
"ప్రహ్లాద్! కమ్ డా..." అరుపులు మొదలైపోయాయ్ గుమ్మం లో నుండి.
వీళ్ళిద్దరూ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నామని అరిచి చెప్పారు.
ఒకరిద్దరు లోపలికి వచ్చేశారు.
ఆంటీ, నాకూ చాలా ఇష్టం. ముద్దుగా చెప్పాడొకడు.
ఇంకో ప్లేట్ పెట్టాను.
నిన్నే తిన్నాం మేము..ఇంకొకడు టేబుల్ దగ్గర చేరి చెబుతున్నాడు.
నేను ఇంకో వాయ తీసుకెళ్ళేటప్పటికి డైనింగ్ టేబుల్ చుట్టూరా పిల్లలు.
పెద్ద ప్లేట్ పెట్టి మధ్యలో ఇవన్నీ పోసి, చుట్టూ కొంచం కొంచం గా కెచప్ వేశాను.
వీళ్ళకి సరిపోకపోతే అల్లరల్లరి చేసేస్తారు. ఒక్కొక్క ముక్కకీ లెక్కలు కూడా చూసుకుంటారు. నాకు ఎక్కువా నీకు తక్కువా అని.
"అమ్మా...పెరి పెరి మసాలా ఉందా?" మా వాడికి ఉన్నట్టుండి గుర్తొచ్చింది.
యెస్. ఉంది కదా. మర్చేపోయాను.
తరువాతి బేచ్‌కి మసాలా వేసి ఇచ్చాను. నేను వెళ్ళేసరికి ప్లేట్ ఖాళీగా ఉంది. అందరూ వేళ్ళు చప్పరిస్తున్నారు. ప్లేట్ నింపి వెనక్కి వచ్చేశాను.
మర్నాటికి, మా ఇంటిల్లిపాదికీ అని ఉంచిన గిన్నెను మళ్ళీ ఫ్రిడ్జ్ లో నుండి తీసి, ఇంకో వాయ, ఇంకో వాయ, ఆఖరు వాయ వేశాను. కాస్త క్రిస్పీ గా, మంచి బంగారు రంగులో..కొద్దిగా మసాలా చిలకరింపుతో నోరూరే బేచ్ - ప్లేట్ నిండా నింపుతుండగానే పుల్లలాంటి వేళ్ళతో ప్లేట్ మీదకొచ్చారు. చెప్పద్దా, నాకు కంగారు మొదలైంది. అక్కడెంతమంది ఉన్నారో లెక్కపెట్టే ధైర్యం లేకపోయింది. ఇప్పుడవి క్షణాల మీద అయిపోతాయ్. ఎవరో ఒకడు కేకేస్తాడు. సరిపోలేదనో, ఇంకా కావాలనో అంటాడు. కొందరు తిన్నామంటారు, కొందరు తినలేదంటారు. అల్లరి మొదలవుతుంది. అయిపోయాయని చెప్పచ్చూ...కానీ పొద్దుటి నుండీ ఆడుతున్నారు పిచ్చి వెధవలు. ఫ్రెంచ్ ఫ్రైస్ చాలనే పిల్లలని నేను చూడనే లేదు!
ఇన్స్టంట్ డెలివరీ ఆప్ లో చూద్దామని ఫోన్ కోసం హాల్లో కి వచ్చాను.
అక్కడ పళ్ళెం మధ్యలో ఓ నాలుగు ఫ్రైస్. అంత మంది పిల్లల మధ్యలో. ఏ ఒక్కరూ వాటిని ముట్టుకోవట్లేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా. వాళ్ళు ఏమనుకుని వాటిని వదిలేశారో నాకు తెలిసే వీలేమీ లేదు. కానీ,
ఏడేళ్ళ పిల్లాడికి అమ్మగా, అసలు ఇలాంటివి ప్లేట్లో మిగిలి ఉండటం అసంభవమని నాకు బాగా, చాలా బాగా తెలుసు. ఆ నాలుగు ముక్కలూ ఆ పిల్లల మధ్య స్నేహానికి గుర్తు. అబండెన్స్ కి గుర్తు. నీ దగ్గర ఎంత ఉన్నా సరే, నీకిష్టమైన వాళ్ళతో పంచుకునేటప్పుడు, లేమి పొడచూపదనడానికి గుర్తు. పిల్లలు అట్లాగే దాని చుట్టూ కూర్చుని ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఉండీ ఉండీ బిగ్గరగా నవ్వుతున్నారు. ఒక్కొక్కరుగా చేతులు కడుక్కోవడానికి లేస్తున్నారు.
"ఫస్ట్ బాల్..." బయట నుండి బిగ్గరగా ఓ గొంతు.
వాళ్ళంతా మళ్ళీ ఆటలోకి మళ్ళిపోయారు. వాళ్ళ ముఖాల్లోని కాంతి, వాళ్ళ గొంతుల్లోని ఉత్సాహం, వాళ్ళ నవ్వుల్లోని సంబరం నా ఇల్లంతా పరిచి పరిచి...
అతిథి
ఈ ఆరేడెనిమిదేళ్ళ పిల్లల్ని తీసుకుని ఎవరింటికైనా వెళ్ళాలంటే భలే ఇబ్బంది. ఇబ్బందంటే, అది చిన్నప్పటిలా సంచీలో కూరాల్సిన తిండి డబ్బాలు, ఇంకో జత బట్టలు...ఇలాంటివి కాదు.
సంగమ
కానుక
స్పెషల్ రింగ్ టోన్ లేదు
ఊహించినదీ కాదు
గచ్చు మీద దొర్లే ముత్యాల్లా
ఫోన్ స్క్రీన్ మీద కదులుతూ
నీ పేరు...
*
" ఏం బహుమతి కావాలి?"
ఇంకానా!
కోర్కెలు రద్దయ్యే క్షణాల్లో
మాట మాటా ఓ దీవెన.
ఆవరించుకునే మౌనంలోండే
ఆత్మీయ సంభాషణ.
*
కోయిల పిలుపు.
గొంతు కలిపానంతే.
వసంతం నాదయ్యింది.
ఆకాశపు వెలుగు.
చేతులు చాపానంతే.
అదృష్టం జడివానైంది.
"ఏం కావాలి?"
ఏమీ తోచందే!
నమ్మలేని నిజం మధ్యలో
తలుపు తట్టి వచ్చాడు-
రూమి.
జాబిలి తునకా!
నిన్ను కనిపెట్టమని ఎందరినైనా కవ్వించు. ట్రిక్ ఆర్ ట్రీట్ అని ఎంతకైనా బెదిరించు. మాయముసుగు సరిచూసుకుంటూ ఎన్ని దూరాలైనా పరుగెట్టు. మసక సంధ్య కొసల్లో గుమ్మంలో నిలబడి నేనిలాగే ఎదురుచూస్తుంటాను. నా వేల ఊహల్లో నుండి రూపు కట్టుకు జారిపడ్డ జాబిలి తునకా! మోచేతి ఒంపులోకి ఆత్రంగా నిన్నందుకున్న ఆ తొలి నెలల్లో, నా కళ్ళల్లోకి వెదుకుతూ నువు చూసిన చూపులు జ్ఞాపకమున్నంత కాలం, ఎన్ని వందల ముసుగులు ఎదురుపడనీ, నీ రూపును అప్పటి క్షణాల సాక్షిగా పోల్చుకుంటాను. కలిసి నా లోపల, కదిలి కొన్నాళ్ళలా, పచ్చి వాసనలతో నువ్వు నా పక్కన చేరి కేర్ర్...ర్ర్..మన్నప్పుడు...ఆ అలవాటు లేని దగ్గరితనానికి దడదడలాడిన ఈ గుండె కొట్టుకున్నంతకాలం, ఎన్నిశబ్దాలు చుట్టుముట్టనీ, నీ సన్నటి గొంతులోని రవ్వల మెరుపుల్ని జల్లెడ పట్టుకు గుర్తుపడతాను. దోగాడిన నీ బాల్యమ్ముందు నా సమస్త జీవితాన్నీ ఆటగా పరిచి పాలనవ్వులు ఏరుకున్నదాన్ని, తేనెగారే నీ మోవి మాటలు తాకాకే ఈ జీవనమాధుర్యాన్ని పట్టి చూసుకున్నదాన్ని. ఒరేయ్, ఊగే నీ చేతుల్లోని అల్లరిని పట్టి ఆపడం నాకెంతసేపు పని! అన్ని ఆటలూ పూర్తైన అలసటలో నా పక్కన ఒదిగి పడుకుంటావు, అరచేతిని చెంప కిందుగా పరుచుకుని, అచ్చం మీ నాన్నలాగే. నుదుటి మీదకు వాలుతోన్న ఉంగరాల జుత్తును వెనక్కి తోస్తోంటే, పూలకొమ్మలు ఊగినట్టు నవ్వుతావు, నిదురలోనే. కోమలమైన నీ నవ్వు నా రాత్రిని హత్తుకుంటుంది. మినమినలాడే వెన్నెలచినుకుల్లో రేకూ రేకూ విప్పుకుంటోన్న పరిమళ పుష్పం లాంటి ఈ రాత్రిని...నీ నవ్వు...మృదువుగా...
వేడుక
సెలవురోజు మధ్యాహ్నపు సోమరితనంతో
ఏ ఊసుల్లోనో చిక్కుపడి నిద్రపోయి
కలలోని నవ్వుతో కలలాంటి జీవితంలోకి
నీతో కలిసి మేల్కోవడమే,
నాకు తెలిసిన వేడుక.
నీరెండ ఉదయాల్లో అద్దంలోకి వొంగి
ఇప్పుడిప్పుడే రంగు మారుతున్న గడ్డాన్ని
నువ్వు తడుముకున్నప్పుడల్లా
ఆ గరుకుచెంపలని తొలిసారి తాకిన
లేప్రాయపు తడబాటు క్షణమొకటి,
మెరుపై నన్ను చుట్టుముడుతుంది.
పట్టరాని నా ఇష్టం ముందు
నీ వయసు కట్టుబానిసై మోకరిల్లుతుంది.
వెలిసిపోని జ్ఞాపకమైనందుకు
పారేయలేని నీ పాతచొక్కాలా
ఉరికే యవ్వనంలో నువ్వు ముద్దరలేసిన
ఎన్ని నిన్నలో
ఫ్రిడ్జ్ మాగ్నెట్ మీద కుదురుకున్న
నీ అయస్కాంతపు నవ్వుల్లా లాగుతూనే ఉంటాయి.
ప్రణయఝంఝ రేపిన మోహసంచలనాలు సర్దుమణిగాక,
అలవాటైన ఉనికి ఇచ్చే స్తిమితానివై నను కమ్ముకుంటావు.
ఉత్తిమాటనై నిను కప్పుకోబోతే
పెదాల మీద సీతాకోకరెక్కల్లా వాలి చెదిరిపోయే ముద్దువవుతావు.
తప్పని ఈ లోకపు వత్తిళ్ళ నుండి తప్పించుకుని వచ్చి
నే కావలించుకునే విరామ క్షణాల సమస్తమా...
నా కన్నా ముందే అలారం మీదకి చేరే నీ చేయీ
నా డెస్క్ మీద నువు నింపి ఉంచే నీళ్ళ సీసా
బాల్కనీలో విచ్చిన పిచ్చి పూవు
ఆఖరికి
మీరా షాంపూ వాసన కూడా
ప్రేమఋతువులోకి నెట్టే ఇంట్లో,
ఇన్నేళ్ళ తర్వాత ఈ రోజుకి కూడా ...
కలలోని నవ్వుతో కల లాంటి జీవితంలోకి
నీతో కలిసి మేల్కోవడమే
నాకు తెలిసిన వేడుక.
రాగసాధిక
ఓ మూడు నాలుగేళ్ళ క్రితం బోస్టన్ లో ఉన్న రోజుల్లో అనిల్ అక్కడొక విపస్సన కేంద్రం ఉందని చూసుకుని, ఓ రెండు రోజులు వెళ్ళొస్తాను అంటే, చిన్నపిల్...