07 April, 2012

నా ఆలోచనల్లో - "చివరకు మిగిలేది"


** తొలి ప్రచురణ మాలిక పత్రిక ఉగాది సాహిత్య సంచికలో 

వందేళ్ళ జీవితాన్ని చవిచూచిన వృద్ధులైనా, విద్యా సాగర సంచితాన్ని ఔపాసన పట్టిన అగస్త్యులైనా, సన్యాసులైనా, సంసారులైనా సమాధానం చెప్పే ముందు పునరాలోచించుకోదలచే ప్రశ్న ఒకటుంది . అది "చివరకు మిగిలేది" ఏమిటన్నది. సరిగ్గా దీనినే నాందీ వాక్యంగా ఎన్నుకుని, తెలుగు సాహితీ చరిత్రలో తొలి మనో వైజ్ఞానిక నవల గానూ, తెలుగు తల్లి కీర్తి కిరీటంలో వెలుగులీనే మరకతమణి గానూ నిలువగల నవలగానూ పేరొందిన రచన చేశారు బుచ్చిబాబు.

సందిగ్థ  స్థితుల్లో సద్వివేకాన్ని సాయమడిగి, సరైన సమయంలో జీవితాన్ని అల్లకల్లోలాల నుండి బయట పడవేయగల నిర్ణయం తీసుకోలేకపోవడమే మానవ జీవితానికి సంబంధించిన అతి పెద్ద విషాదం. దయానిథి జీవితమంతా అటువంటి విషాదమే నిండి ఉన్నట్టు నాకనిపించింది. కథ మొత్తం చెప్పను కానీ - వ్యాసం నిడివిని దృష్టిలో ఉంచుకుని కథలోని పాత్రలను కొద్దిగా పరిచయం చేస్తాను.

కోమలి, ఇందిర, అమృత ఈ పుస్తకంలో ప్రముఖంగా కనపడే స్త్రీ పాత్రలు. దయానిథి, "చివరకు మిగిలేది" నాయకుడు. తన తల్లి నైతికత మీద బాల్యం నుండీ ఎన్నో మాటలు వింటూ పెరగడం చేత, అతని మనస్సులో ఒక విథమైన అల్లకల్లోల స్థితి నెలకొని ఉంటుంది. సంఘంలో కలివిడిగా తిరగలేని, అందరికీ దగ్గరవ్వలేని అంతర్ముఖుడి వంటి మనస్తత్వంతో పెరుగుతూంటాడు. పరిస్థితుల ప్రభావము వల్ల ఇతనికి ఇందిర అనే ఆమెతో పెళ్ళవుతుంది. ఆ పెళ్ళి మూణ్ణాళ్ళ ముచ్చటై ఇందిర అతన్ని వదిలి వెళ్ళిపోతుంది; ఆరోగ్య సంబంధిత కారణాల వల్ల కొన్నాళ్ళకి కన్ను మూస్తుంది.

అమృతం దయానిథికి మరదలి వరుస. తల్లి తరువాత దయానిథి పట్ల అంత దయతోనూ, అనురాగంతోనూ ఉన్న వ్యక్తి కనుక, ఆమె అంటే అవ్యక్తానురాగం ఉంటుంది . అయితే, అనుకోని సందర్భంలో, వీళ్ళిద్దరి మధ్యా శారీరక సంబంధం ఏర్పడి, అది అతన్ని మానసికంగా దెబ్బ తీస్తుంది; అతనిలోని నైతికతను ప్రశ్నిస్తుంది. తన తల్లి చేసిందని చెప్పబడే అదే తప్పు, తానూ చేసి, మరొక స్త్రీని, తద్వారా ఆమె కుటుంబాన్ని మళ్ళి సంక్షోభంలోకి నెట్టానా అన్న మథన ఉదయిస్తుంది. అయితే, అమృతం గుండె దిటవు కల్గిన మహిళ. చేసిన దానికి వగచడం, గతాన్ని చూసి విలపించి పశ్చాత్తాపపడడం, ఆమె నైజం కాదు. దయానిథి ద్వారా బిడ్డను పొందినా, అతను ఇంటికి వచ్చినప్పుడు ఏమీ ఎఱుగనట్టే, అసలేమీ జరగనట్టే నింపాదిగా కబుర్లు చెప్పి అతన్ని సాగనంపుతుంది. ఇది, దయానిథికి కాస్త ఊరట నిచ్చిందనే చెప్పవచ్చు. ఈ కథ మొత్తంలో, ప్రతీ సారీ తన అద్భుతమైన సంభాషణలతో, నచ్చింది నచ్చినట్టు చేయగల తెగువతో, "ఈ క్షణం"లో బ్రతకగల తాత్విక నైజంతో నన్ను వలలో వేసుకున్న జాణ నిస్సందేహంగా అమృతం పాత్రే!

ఇక మూడవ పాత్ర కోమలి. దయనిథికి ఆమెపై ప్రేమో, వాంఛో తేల్చుకోరాని అభిమానం. తల్లి బలవంతం చేత, డబ్బుకు లోబడి ఒక ధనవంతునితో వెళ్ళిపోతుంది కోమలి. అయితే, అక్కడ ఇమడలేక, తిరిగి దయానిథి చెంతకే చేరుతుంది. కోమలి పట్ల ఎంత మమకారం ఉన్నా, ఆమెను పెళ్ళి చేసుకోడు, పరిథులు దాటి వారిరువురూ ఒక్కటవ్వాలనుకోడు.  దానికి కారణాలు, కోమలితో అతని అనుబంధం ఆఖరుగా చేరిన తీరం, "చివరకు మిగిలేది" ఏమిటన్న అతన్ని వెంటాడిన ప్రశ్నకు, చిట్టచివరకు దొరికిన సమాధానం, ఇవన్నీ ఆఖరు అధ్యాయంలో చదవగలం.

ఇదీ, పొడి పొడి మాటల్లో, నా మాటల్లో, ఈ నవల కథ.

*****************************************

భార్యా భర్తల మధ్య పొరపచ్చాలు, జీవితాన్ని ప్రేమించగల పడతి కోసం కుటుంబ కట్టుబాట్లను ధిక్కరించైనా సరే, ముందడుగు వేయాలనుకోవడం, తదనంతర ఘర్షణలూ - ఇవి కాలాలకతీతంగా రచయితలను ఆకర్షించే కథా వస్తువులు. 

నిజానికి మనం చదివి వదిలేసిన పుస్తకాల్లోని పాత్రలు, మన గతంలో కలిసిపోయిన వ్యక్తుల జ్ఞాపకాలను తట్టి లేపడం అనేది తఱచుగా జరిగే ప్రక్రియే. అలాగే ఒక రచనలోని పాత్రల చిత్రీకరణ, మరొక రచనను/పాత్రను గుర్తు తేవడము కూడా అసహజమైన విషయమేమీ కాదు. "చివరకు మిగిలేది"లోని కొన్ని పాత్రలను, బహుళ ప్రాచుర్యం పొందిన కొన్ని రచనల్లోని పాత్రలతో పోల్చి చూడడం రెండు దశాబ్దాల క్రితమే జరిగింది. ముఖ్యంగా విశ్వనాథ వేయి పడగలతోనూ, చలం రచనల్లోని స్త్రీ పాత్రలతోనూ, షేక్స్‌పియర్ హామ్లెట్ నాటకంతోనూ, "చివరకు మిగిలేది" పాత్రలను దగ్గరగా పరిశీలించి చూసిన వారున్నారు. ఈ మాటలను ఇంతకు ముందే సాహితీ మిత్రుల వద్దా, ఆత్మీయుల దగ్గరా విని ఉండడటం, దాదాపు ఒకే కాలంలో, చివరకు మిగిలేది - అమీనా - వేయి పడగలు చదివే అవకాశం రావడం, ఈ పాత్రల్లోని సారూప్యాలను పైపైన స్పృశిస్తూ ఈ వ్యాసం రాసేందుకు నాకు ప్రోద్బలాన్ని అందించాయి.

*********************************

"నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు.." అని "కృష్ణపక్షం"లో వేదన పడతారు దేవులపల్లి. ఈ ప్రేమించలేకపోవడమే, "చివరకు మిగిలేది"లో ఆసాంతమూ ప్రథానంగా కనపడుతుంది. బుచ్చిబాబు మాటల్లోనే చెప్పాలంటే, " ప్రేమించలేకపోవడం ఒక్కటే ఈ నవలలో వస్తువు కాదు. జీవితంలో "చెడుగు" -ముఖ్యంగా పెద్దవారి తప్పిదాలు, చిన్నవాళ్ళ జీవితాలను ఏ విధంగా వికసించనీయకుండా, పాడు చేసింది..ఇది కూడా ఒక ప్రథానమైన అంశమే!". అలాగే ముందుమాటను బట్టి, వ్యక్తిగతమైన విముక్తి ఈ నవలకి ప్రేరణగా పాఠకులకు అర్థమవుతుంది.

వివాహాలు సాఫల్యతనూ సంపూర్ణత్వాన్నీ పొందడానికి, ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర ప్రేమభావం, సడలని నమ్మకం, వ్యక్తావ్యక్త అనురాగాలూ ఆవశ్యకాలు. అయితే వీటితో బాటు, ఇరు కుటుంబాల మధ్య సహృద్భావాలు, దంపతుల మధ్య సాంఘిక ఆర్థిక తారతమ్యాలను గుర్తు చేసి పొరపొచ్చాలను సృష్టించని తల్లిదండ్రులు, బంధువుల పాత్ర, ఆ కాలంలోనూ - ఈ కాలంలోనూ కూడా తీసిపారేయలేనివిగా కనపడుతున్నాయి. వివాహం పట్ల మొదటి నుండీ విముఖత కలిగినవాడు దయానిథి. తన తల్లి ద్వారానైతేనేమి, తాను చూసిన లోకపు పోకడల వల్ల నైతేనేమి, అతనెన్నడూ పెళ్ళి అనే పంజరంలో చిక్కుకోదలచినట్లుగా కనపడడు. తన తండ్రి పదే పదే తల్లి ప్రస్తావన తెచ్చి, కోమలి విషయమై నిగ్గదీస్తూ, "నీకెందుకు పెళ్ళి సంబంధాలు రావడం లేదో తెలుసుకున్నావా?" అని ప్రశ్నించినప్పుడు, దయానిథి " నాకేమీ బెంగ లేద"ని నిర్వికారంగా చెప్పగల్గుతాడు.  చిట్టచివరికి కేవలం తండ్రి నిర్ణయానికి తలొగ్గి ఇందిరను పెళ్ళి చేసుకున్నా, వారిద్దరి మధ్యా ప్రేమ చిగురులు తొడగగల అవకాశాలు కానఁగరావు.  తండ్రి మాట పట్టుకుని ఇందిర వెళ్ళిపోతుంది. దయానిథి తిరిగి ఆమెను తన వద్దకు తెచ్చుకునే ప్రయత్నాలేమీ చేయడు. మళ్ళీ ఆమెను చూసింది ఆఖరు నిముషాల్లోనే! ఇందిర - వివాహ వ్యవస్థను పూర్తిగా తృణీకరించిందని అనుకోలేం! ఆమె అటువంటిదే అయితే, కేవలం వివాహ బంధాన్ని నమ్ముకుని తన జీవితపు చివరి క్షణాల్లో దయానిథికి చేరువ కాదు. ఆమెలోని ఈ అర్పణ బావం దయానిథికి అర్థమయ్యేసరికి ఆలస్యమైపోవడమొక కఠోర వాస్తవం.

నిజానికి వాళ్ళిద్దరి మధ్యా అపురూపమైన బంధమన్నది ఏ నాడూలేదు. ఇందిర మరణించే ముందు క్షణాల్లో దయానిథి ఆమెను చూడడానికి వెళ్ళినప్పుడు, ఇందిర బయల్పరచిన ప్రేమ, ఎదురుచూపులు ఫలించినందుకు ఆమెలో కలిగిన ఆనందం, ఇవన్నీ దయానిథిని అణువంతైనా కదిలించవు.

ఇది బుచ్చి బాబు మాటల్లో చదవడం ఇంకా బాగుంటుంది - " దయానిథి ఇందిరతో కలిసి ఉన్నప్పుడు గుండెలూ గుండెలూ విశ్వగానంతో మేళవించి కలిసి కొట్టుకోలేదు. అన్ని నదులూ కలిసిపొయ్యే మహాసముద్రంలాంటి ప్రేమ ప్రవాహంలో వారి రక్తాలు వేరువేరుగానే ప్రవహించాయి. <....> పాటలు, పద్యాలు, యజ్ఞాలు. యాగాలు. క్రతువులు - ఎన్ని చేసినా, చందమామ అంతకంటే ఎక్కువగా ప్రకాశించదు. గాలి అంతకంటే జోరుగా వీయదు. కెరటాల సంఖ్య పెంచుకోలేదు సముద్రం. ప్రేమించదు మానవ హృదయం" - అక్షర సత్యాలే కదూ! ప్రేమ మొగ్గ తొడిగేందుకు హృదయాంతరాల్లో కలిగిన భావోద్వేగ సంచలనమే తప్ప, ఈ సృష్టిలో మరేదైనా ఏనాటికైనా సాయపడుతుందా?

విశ్వనాథ వారి వేయిపడగలులో, అరుంధతి సైతం మొదట్లో భర్త పట్ల వ్యతిరేక భావాలను కలిగి ఉంటుంది. అక్కడ అరుంధతికీ, ఇక్కడ ఇందిరకూ, ఈ విధమైన భావాలు కలుగజేయడంలో పుట్టింటి వారి పాత్ర కాదనలేనిది. అయితే, అరుంధతికి, మనసు మార్చేందుకు, మగని ఆదరణలో స్త్రీ పొందగలిగిన ఐశ్వర్యాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకు, రాజేశ్వరి పాత్ర ఉంది. అటువంటి తోడు దొరక్కపోవడం, దయానిథి -ఇందిరల ప్రేమకథను విఫల ప్రణయంగా మార్చివేసింది. 

"హృదయములో సముద్ర మథన వేళ క్షీరసాగర గర్భగత తరంగముల నుండి చంద్రుడావిర్భవించినట్లు ఒక మహదానంద రేఖ పొడసూపెను. అతడామె వంకనే చూచుచుండెను. ఆమె తల ఎత్తి యతనిని చూచెను. "వ్యాకరణ దోషము లెఱుగని యా కన్నులలోని భాష యేమో, అపండితులగు వా రిద్దఱకు చక్కగా నర్థమై.." అంటూ సాగే "వేయిపడగలు" కథనంలో, ధర్మారావు- అరుంధతిల మధ్య మెల్లగా వెలుగుజూసిన సౌహార్దము, వీగుతున్న అవిశ్వాశాల మధ్య వైదొలగుతున్న అనుమానాలూ - వెల్లివిరుస్తున్న వలపు భావనలూ మనలో కూడా హర్షాతిరేకాన్ని కలిగిస్తాయి.

దురదృష్టవశాత్తూ, "ఓసి పిచ్చి పిల్లా! మగడేమున్నదే? నీ వెట్లు చెప్పిన అట్లు వినెడి వాడు. చెప్పెడి నేర్పులో నున్నది కాని;" అంటూ సుద్దులతో మనసు మార్చగల రాజ్యలక్ష్మి లాంటి పాత్ర లేని లోటే, ఇందిరనూ -అరుంధతినూ భిన్న నాయికలను చేశాయని తోస్తుంది.

******************

తీవ్రమైన భావావేశం, తనకు తప్ప వేరెవ్వరికీ అర్థం కానీ ఆరాటాలూ - మనస్సాక్షి ననుసరించి ఏదైనా చేయగల్గిన స్వేచ్ఛ - దానికై తపన - ఇవన్నీ బుచ్చిబాబు కంటే ముందే సాహిత్యంలో పొందుపరచిన రచయితలు మనకున్నారు. సారూప్యాల రీత్యా చూస్తే, "చివరకు మిగిలేది"లోని కోమలి పాత్ర, నేను ఇటీవలే చదివిన చలం "అమీనా"ను పదే పదే నాకు గుర్తు తెచ్చింది.

కోమలీ, అమీనా ఇద్దరూ ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ పాడుతూ స్వేచ్ఛగా మసలే పల్లె జీవులు. ఇద్దరికీ సమస్యలూ, సందేహాలూ లేవు. బాధ్యతల పట్ల భయం లేదు. జీవితాన్ని ఆస్వాదించే గుణాన్ని, వారి చుట్టూ ముసురుకున్న క్లిష్ట పరిస్థితుల పట్ల ఒక విధమైన నిర్లక్ష్యాన్నీ - ఈ రెండు పాత్రల చిత్రీకరణల్లోనూ స్పష్టంగా చూడగలం.

"అట్లా గడ్డిపోచల మధ్య గంతులేస్తూ ఆకాశాన్నీ, భూమినీ బుజ్జగిస్తూ స్నేహం చేసుకుంటూ ఉండవలసిన వ్యక్తి కోమలి. ఆమె నిజస్థానం అది. పుట్టినిల్లు పచ్చగడ్డి. అత్తిల్లు ఆకాశం. సర్వీ చెట్లు వానాకాలంలో పీల్చుకున్న వర్షం నీటిని ఈనాడు మెల్లమెల్లగా వదులుతూ కోమలిని మధ్య కూచోబెట్టి తలంటుపోస్తుంది. గాలి సిగ్గులేని పిచ్చి పువ్వుని బలవంతంగా తలలో అమరుస్తుంది. ఎర్రపువ్వులను బంధించుతున్న గడ్డిపోచలు గాలికి ఎండలో మెరుస్తూ లయగా ఆరబెట్టిన ఆకుపచ్చ పట్టుచీరలా, ఎండుకుని, కోమలిని చుట్టుకుంటాయి, ఆకలి దాహాలు లేని అయోమయపు ఆశదారుణాలు,  ఎరగని దైవత్వం, హద్దులు లేని అనుభవం ఆమె" -- అంటాడు కోమలి గురించి బుచ్చిబాబు.

అమీనా చలానికి ఒక చింకిరి తుంటరి, బంధనాలు లేని చేపలు పట్టుకునే ముసల్‌మాన్ బాలికగా పరిచయం. కోమలీ అలాంటిదే! కోమలికి దయానిథికీ మధ్య వారిరువురనూ చేరువ కానీయకుండా ఆమె తల్లి ఉంటుంది. ఇక్కడ అమీనాను చలానికి దూరం చేసి ఒక ముసలి వ్యక్తితో పెళ్ళి చేస్తుంది ఆమె తల్లి కూడా..! కానైతే, చివరికి సమాజానికి భయపడి, అయిష్టంగానే అమీనాతో కఠినంగా వ్యవహరించి ఆమెను దూరం చేసుకుని వగచే చలాన్ని చూస్తాం. కోమలి కూడా ఒక ధనవతుండితో వెళ్ళిపోయినా, అది తాత్కాలికమై, మళ్ళీ దయానిథిని చేరుకోగలగడం ఈ రెండు కథల మధ్యా ఉన్న వైరుధ్యం.

*****************************

"To be without some of the things you want is an indispensable part of happiness"  - అన్న రస్సెల్ మాటలను దయానిథి పాత్ర సంపూర్ణంగా వంటబట్టించుకున్నట్లు కొన్ని కొన్ని సన్నివేశాలు నిరూపిస్తాయి.

కోమలి పట్ల తనకున్న అపారమైన ప్రేమను, ఆకర్షణను, వ్యామోహాన్ని, శారీరక సంబంధంతో తుడిచిపెట్టుకోకుండా ఉండేందుకు అతడు పడే ప్రయాస ఈ విషయాన్నితేల్చి చెప్తుంది. అందని చందమామలా కోమలి అతని జీవితంలో ఒక అత్యున్నత స్థానంలో నిలబడాలని తపించిపోతాడు. అందుకు గానూ, కోమలి సహాయం తప్పనిసరి కనుక, ఆమెకు అతని ఆశ విడమరచి చెప్పే ప్రయత్నాలెన్నో చేస్తాడు. మొదటి అధ్యాయంలో తలుపు మాటు నుండి ఆమెను చూసి, వెనుతిరిగి వెళ్ళిపోవడం మొదలుకుని, కథలో చాలా చోట్ల ఈ తాపత్రయం కనపడుతుంది. ఆ రాత్రి ఆమెను చూసి, 

"ఏదో కాంతి కిరణం అతని చీకటి హృదయాన్ని మెరుపులా వెలిగించింది. కోమలి అతనిలోకి ప్రవేశించి అన్ని తలుపులూ మూసేసినట్లనిపించింది.ఎక్కడ తాకినా అన్ని రేకులూ ఊడిపోయే పుష్పం. వేలుతో తాకితే, అంతా వొడిలిపోతుంది, రంగులన్నీ పోతాయి. నశింపైపోతుంది. గొప్ప సౌందర్యం అనుభవం కాదు. గొప్ప సౌందర్యం అంటే అయిపోవడం కాదు. ఎల్లప్పుడూ "అవుతూండడం". హద్దులు లేనిది అనుభవం. గొప్ప సౌందర్యానికీ హద్దులు లేవు. రెండిటికీ శరీరం హద్దు కాదు -కాకూడదేమో!"

ఇలా తలచి, శరీరం ఉన్న మనుస్యులందరూ పిచ్చివాళ్ళేనేమోనని నవ్వుకుంటూ, కోమలిని కదిలించకుండా తలుపులు దగ్గరగా మూసి వెళ్ళిపోతాడు దయానిథి. అటుపైన "కాత్యాయని సంతతి" అధ్యాయం చివర్లో "జీవిత రహస్యం" విప్పి చెబుతున్నానంటూ దయానిథి కోమలితో సాగించే ఈ క్రింది సంభాషణలోనూ అవే ఛాయలు.

"నువ్వెందుకూ ప్రేమించడం..?"

"ప్రేమ పవిత్రమైనది..-"

"ఓస్!!"

"నిజం."

" మరి నా మీద కోరికెందుకు?"

"అది మనస్సుకి - ఇది శరీరానికి -అదైనా మీరు కాబట్టి."

"అలా వద్దు -అసలు కోర్కెలే వద్దు - ఇద్దరం ఇలాగే స్నేహంగా ఉందాం.ఏం? శరీరాల స్నేహం ద్వేషంగా మారుతుంది. ఆత్మలని చంపేస్తుంది-; అట్లా చేస్తే మనం అందర్లానే ఐపోతాం. అట్లా చేయకపోవడంలోనే ఉంది అందం. జీవితం వింతగా ఉంటుంది. బ్రతుకు మీద విసుగు పుట్టదు. గొప్ప గొప్ప పనులు చెయ్యొచ్చు"
***************
ఈ పుస్తకం ఎందుకు చదవాలి ?

నవలా సాహిత్యం మీద "చివరకు మిగిలేది" నెరపిన ప్రభావం తక్కువదేమీ కాదు. ఇది తెలుగులో తొలి మనో వైజ్ఞానిక నవల. దాని తాలూకు గాఢమైన శైలి ఈ పుస్తకంలో ఒక కొత్తదనాన్ని చూపెడుతుంది. బుచ్చిబాబు రచనలో జలపాతపు వేగమున్న కవిత్వ ధోరణి ఉంటుంది. ఆ ప్రవాహం క్రింద నిల్చుని దోసిళ్ళతో పట్టుకోగలిగే అనుభవమేదైనా కావాలనుకుంటే, రచనను ఓపిగ్గా చివరికంటా చదవాలి. నవలల్లో ఈ స్థాయిలో వర్ణనలు గుప్పించిన పుస్తకాలు లేవని అనలేం కానీ, సంఖ్యాపరంగా తక్కువ.

"రాతి శిథిలాల మధ్య ఉండవలసినది అమృతం. ఎక్కడో ఏ హంపీలోనో - అన్నీ రాళ్ళు- భగ్న ప్రతిమలు. ఒంటరిగా నిల్చిపోయిన స్థంభాలు ప్రేమ కోసం గుండె రాయి చేసుకున్న రాకుమారిలా విగ్రహాలు అన్ని శిథిలమైపోయి, ఏ అర్థరాత్రో అడుగుల చప్పుడూ, నిట్టూర్పు వినపడితే కదులుతాయేమో ననిపించే ప్రమాద స్థితిలో పడి ఉంటే వాటి మధ్య అమృతం కూచుని విషాదంలో నవ్వుతుంది. గడచిపోయిన అనుభవపు వైభవాలని తల్చుకుని, ఏడ్చి ఏడ్చి, అతీతం ఐనప్పుడు కన్నీరు చుక్కలు చుక్కలుగా రొమ్ముల మధ్య నుండి జారి ఈనాటి నదిగా ప్రవహిస్తోంది. తన దుఃఖం నదులై పొంగి పొంగి దేహాన్ని ముంచి వేస్తుంది -తప్పు! తను ఏడ్వకూడదు - విషాదంతో నవ్వుతుంది. ఆనాడు సౌందర్యం తన యాత్ర ముగించుకుని ఆమెను శిలగా మార్చివేస్తుంది. ఏ రాతిని నిట్టూర్పుతో కదిల్చినా అమృతం కలలో కార్చిన కన్నీరల్లే నీరైపోతుంది. "

ఈ వర్ణన గమనించారా, ఇది, అమృతాన్ని పాఠకులకు తొలిసారిగా పరిచయం చేస్తూ రాసినది కాదు. వేరొక పాత్రకి ఆమె వ్యక్తిత్వాన్ని వివరిస్తూ చెప్పిన కబుర్లు కావు. తనలో తాను ఏకాంతంలో సంభాషించుకుంటూ, తన జీవితంలోని స్త్రీలను విశ్లేషించుకునే ప్రయత్నంలో జారిపడ్డ పదాలివి. "ఎంతందంగా చెప్పాడు!" అనుకోకుండా , రెండో సారి చదవకుండా, నేను ముందుకు సాగలేకపోయిన మాట నిజం.

ఇదే కవిత్వ ధోరణి, కథనంలో చాలా చోట్ల ఇబ్బంది పెడుతుందన్న వాస్తవాన్ని మరొక్కసారి గుర్తు చెయ్యకపోతే, ఈ వ్యాసం సంపూర్ణం కాదేమో! ఈ కథ, కథనం వ్యక్తి స్వేచ్చ కోసం వెంపర్లాడే మనస్తత్వాన్ని చూపెడతాయి. ఆ క్రమంలో ఎన్నో దృశ్యాలు, ఎన్నో వచ్చిపోయే పాత్రలు, వాటి చిత్రీకరణలూ. జీవంతో సంబంధం లేకుండా, కంటికి కనపడ్డ ప్రతి దృశ్యానికి కామాన్ని ఆపాదించడం, నాకు వెగటు పుట్టించిన అంశం. మనుష్యుల్లో ప్రకృతిని దర్శించడానికి నేను వ్యతిరేకిని కాను కానీ, ఇతని వర్ణనల్లో అక్కడక్కడా ఏదో అసహజత్వం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నక్షత్రాల చూపుల్లో, మెరుపుల్లో, వర్ణనల్లో కామం..., "గడ్డిపోచలు కామంతో మసలడం", "విశ్వాన్ని ఆవులింతలో ఇముడ్చుకున్న విముఖత" తదితరాలు మచ్చుకు కొన్ని మాత్రమే! (ఇలాంటి "ఆవులింతలు" వర్ణనల్లో కోకొల్లలు! )

అత్యంత సున్నితమైన భావాలని, రసరమ్యమైన పదాలతో కూర్చి పాఠకులను కొత్త లోకాలకు తీసుకుపోయే సంభాషణలున్నట్టే ( కోమలి నిద్రిస్తుండగా చూసిన క్షణాల్లో, దయానిథిని మనసులో కలిగిన భావావేశాలకి ఎంచక్కని అక్షర రూపముందో చూడండీ క్రింద), చూసిన ప్రతి సన్నివేశానికి, ప్రతి వస్తువుకీ, వ్యక్తికీ ఒక ఉపమానాన్ని జోడించి తప్ప పరిచయం చేయలేని రచయిత నిస్సహాయత చదువరులను  తీవ్ర అసంతృప్తికి  గురి చేసే పుట లీ పుస్తకంలో చాలానే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఇది పూర్తిగా ఒక బలహీనతగా బయటపడిపోయిందే తప్ప, కథనానికి ఏ ప్రత్యేక విలువను ఆపాదించలేకపోయినట్టు నాకనిపించింది. 

"ఇంటి కప్పు మీద నుండి జారిన వెన్నెల వెలుగు ఆమె నుదుటి మీద గీతలా పడుతోంది. ఆనాడు సౌందర్యం తన యాత్ర ముగించుకుని పవ్వళిస్తోంది. పరిమళం బరువుకీ రంగు ఒత్తిడికీ తట్టుకోలేక ఊడి పడిపోయిన అడవి పువ్వు. పర్వత శిఖరాన్నుంచి జారి పడిపోయిన మంచుముద్దలోని నిర్మలత్వం; నిశీధిలో సృష్టి వేసుకున్న మంటలో నడిజ్వాల అర్థరాత్రి జీవులు కన్న స్వప్నంలోని మూగ బాధ"

******************************

వ్యక్తిగత ఇష్టానిష్టాల్లో లీలా మాత్రంగా తొణికిసలాడే భేదాలే, ఒక్కోసారి పుస్తకాల పట్ల మన మౌలిక అభిప్రాయాలు వెలిబుచ్చడంలో కీలక పాత్ర వహిస్తాయని బలంగా నమ్మే వాళ్ళల్లో నేనొకతెను. బహుశా, అలాంటి అంచనాలేవో సరితూగని కారణం చేత, నేను ఈ పుస్తకాన్ని మొదటి చూపులో పూర్తిగా ప్రేమించలేకపోయాను. కొన్ని పుస్తకాలను పూర్తిగా అవలోకనం చేసుకునేందుకు, కథలోని ఆత్మను పట్టుకునేందుకు ఒకటికి రెండు సార్లు చదవడమే మంచి పద్ధతేమో!

ఈ పుస్తకానికి సంబంధించి నా తొలి పఠనానుభవాలను నిజాయితీగా చెప్పాలంటే, మొదటి పేజీ మొదలుకుని, ఆఖరు పేజీ వరకు, సహనాన్ని బ్రతిమాలి వెంట ఉంచుకుని మరీ చదివాను. కథ ఎటు పోతోందో అర్థం కాదు, విడిపోతున్న అధ్యాయాలు ఏ విషయాన్ని చెప్పదలిచాయో నన్న సందిగ్ధమూ, వాటిని నేను అందుకోగలిగానో లేదో నన్న సంశయమూ పదే పదే ఇబ్బంది పెట్టాయి. అయినప్పటికీ, కథనంలో చాలా చోట్ల కనపడే నెమ్మదితనం, కథను ఎటూ పోనివ్వని జడత్వమూ, కొన్ని కృతకంగా తోచే వర్ణనలూ వదిలేస్తే, "చివరకు మిగిలేది", వస్తు రీత్యా ప్రయత్నించి చూడాల్సిన పుస్తకమనే భావిస్తున్నాను. మలి పఠనాలు ఈ నమ్మకాన్ని మరి కాస్త బలపరిచాయి.

అనైతికాన్ని సమర్ధించలేక, నైతికత ఒడిలో సంపూర్ణంగా ఒదగలేక, ఒంటరితనం ముసుగులు తీయలేక విసుగు చెంది, క్షణికావేశంలో చేసిన తప్పులతో మధనపడి, తాత్వికతను నింపుకుని మనసును అల్లకల్లోలం చేసుకుని "చివరకు మిగిలేది" ఏమిటన్న ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఇవ్వకుండానే ముగిసే ఈ నవల, నాయక పాత్రను, జీవితాన్నీ నిజాయితీగా అర్థం చేసుకోదలచిన వారికీ, కాల్పనికాల్లో కొత్త తరహా రచనను చూసేందుకు తపించే వారికీ నచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అలాగే, రచన పరమావథి ప్రతిసారీ ఒక పాఠాన్ని నేర్పడమే కానవసరం లేదని పునరుధ్ఘాటించే నవలగా, సర్వ స్వతంత్రంగా నిలబడగలదీ రచన.

బుచ్చిబాబు విడిగా ఏదైనా కవిత్వం రాసి ఉంటే, అది తప్పక చదవాలన్న కుతూహలం కలిగించిన పుస్తకం -"చివరకు మిగిలేది". ప్రయోగాత్మక రచనలకు పెద్ద పీట వేసే సహృదయత కలిగిన తెలుగు సాహితీ అభిమానులు, ఒక్కసారైనా ఓపిగ్గా చదివి సంతృప్తి పడవలసిన పుస్తకం.

***********************************************
చలం "అమీనా" గురించి నా పరిచయ వ్యాసం ఇక్కడ : http://www.madhumanasam.in/2011/09/blog-post_25.html